Share News

Oh My ‘Ghat’! ఓ మై ‘ఘాట్‌’

ABN , Publish Date - Oct 27 , 2026 | 12:13 AM

Oh My ‘Ghat’! సీతంపేట ఏజెన్సీలోని ఘాట్‌రోడ్లలో మలుపులు ప్రమాదాలకు నిలయంగా మారాయి. రోజుల వ్యవధిలోనే వరుస ఘటనలు చోటుచేసుకోవడంతో మన్యం వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సవరగొయిది సమీపంలో ఉన్న మలుపువద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరికొందరు ప్రయాణికులు గాయపడ్డారు.

Oh My ‘Ghat’! ఓ మై ‘ఘాట్‌’
ప్రమాదకరంగా సవరగొయిది మలుపు

  • ఇప్పటివరకు ఆరుగురి మృతి

  • పదుల సంఖ్యలో క్షతగాత్రులు

  • భయాందోళనలో మన్యంవాసులు

సీతంపేట, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలోని ఘాట్‌రోడ్లలో మలుపులు ప్రమాదాలకు నిలయంగా మారాయి. రోజుల వ్యవధిలోనే వరుస ఘటనలు చోటుచేసుకోవడంతో మన్యం వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సవరగొయిది సమీపంలో ఉన్న మలుపువద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరికొందరు ప్రయాణికులు గాయపడ్డారు. సీతంపేట మన్యంలో ప్రకృతి అందాలకు నెలవైన ఆడలి వ్యూపాయింట్‌కు వెళ్లే మార్గంలో ఏడాదిన్నర కాలంలో ఐదుగురు వరకు పర్యాటకులు మృతిచెందారు. పదులసంఖ్యలో పర్యాటకులు గాయాలపాలై ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో ఘాట్‌రోడ్లపై ప్రయాణమంటేనే గిరిజనులు బెంబేలెత్తిపోతున్నారు.

రోజుల వ్యవధిలోనే..

- సవరగొయిది మీదుగా ఉన్న ఘాట్‌రోడ్డుపై నుంచి వెళ్తే తక్కువ దూరంలో సీతంపేట, పాలకొండ వైపు నుంచి శంభాం, కోడిశ, ఆడలి వ్యూపాయింట్‌కు చేరుకోవచ్చు. అందుకే పర్యాటకులు, ప్రయాణికులు, ద్విచక్ర వాహనచోదకులు ఈ మార్గంలోనే ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈనెల 18న సవరగొయిది సమీపంలో ‘ఎస్‌’ ఆకారంలో ఉన్న ఎయిర్‌బెండ్‌ మలుపు వద్ద ఓ ఆటో అదుపుతప్పి లోయలోకి బోల్తాపడింది. ఈ ఘటనలో హిరమండలం మండలం దబ్బగూడ గ్రామానికి చెందిన గిరిజనుడు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈనెల 23న ఆ ప్రాంతంలోని మలుపువద్ద మరో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్‌తో పాటు వాహనంలో ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులు కూడా గాయాలపాలయ్యారు. రోజుల వ్యవధిలో వరుసగా ప్రమాదాలు సంభవించడంతో ఈప్రాంత గిరిజనుల్లో ఆందోళన నెలకొంది. అటుగా ప్రయాణించాలంటేనే భయడుతున్నారు. ప్రమాదకర మలుపుల వద్ద రక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

- గిరిశిఖర ప్రాంతంలో ఉండే పర్యాటక ప్రదేశాలకు వెళ్లేందుకు సాహసోపేతమైన ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ఇరుకైన రహదారులు , ప్రమాదకర మలుపులు, పరిమితికి మించి ప్రయాణికులకు ఎక్కించుకోవడం, ఘాట్‌ రోడ్ల ప్రయాణాలపై వాహనచోదకులకు నియంత్రణ లేకపోవడం వంటి కారణాలతో ఏజెన్సీలో తరుచూ ప్రమాదాలు చోటుచేసు కుంటున్నాయి.

- గిరిశిఖర ప్రాంతంలో ఉన్న ఆడలి వ్యూపాయింట్‌కు వెళ్లే మార్గంలోని ప్రమాదకర మలుపుల వద్ద రూ.1.20లక్షలతో రక్షణ గోడల నిర్మాణం ఇటీవలే పూర్తిచేశారు. దీంతో శంభాం నుంచి ఆడలి వ్యూపాయింట్‌కు వెళ్లే మార్గంలో కొంతవరకు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. అయితే శంభాం నుంచి కొండ దిగువ ప్రాంతంలో దిగువతొత్తడి-సవరగొయిది గ్రామాల మధ్య ఉన్న ఘాట్‌రోడ్డు మలుపుల వద్దే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

ప్రమాదాలకు గల కారణాలపై ఆరా

పాలకొండ-హడ్డుబంగి రహదారి నుంచి ఘాట్‌రోడ్డు మీదుగా సవరగొయిది, దిగువతొత్తడి, శంభాం గ్రామాలకు వెళ్లే మార్గంలో ఉన్న ప్రమాదకర మలుపులను ఇటీవల అధికారులు పరిశీలించారు. వరుసగా ఆటోలు ప్రమాదాలకు గురికావడం వెనుక ‘ఎస్‌’ ఆకారంలో ఉన్న ఎయిర్‌బెండ్‌ మలుపే కారణమని గుర్తించారు. ఇరుకుగా ఉన్న రోడ్డును వెడల్పు చేయడంతో పాటు జంగిల్‌ క్లియరెన్స్‌, ప్రమాదాలు జరుగుతున్న మలుపు వద్ద క్రాష్‌ బేరియర్స్‌ విత్‌ రిఫ్లక్టర్స్‌ ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు తెలియజేస్తున్నారు.

ఆర్‌అండ్‌బీ డీఈ ఏమన్నారంటే..

‘పాలకొండ-హడ్డుబంగి రోడ్డులోని కిట్టాలపాడు జంక్షన్‌ నుంచి శంభాం వరకు వెళ్లే ఘాట్‌రోడ్డులో ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో ఏటా డిసెంబరు నెలలో జంగిల్‌ క్లియరెన్స్‌ చేస్తున్నాం. సవరగొయిది గ్రామ సమీపంలోని మలుపు వద్ద ప్రమాద స్థలాన్ని పరిశీలించాం. రక్షణ చర్యల్లో భాగంగా క్రాష్‌ బేరియర్‌ విత్‌ రిఫ్లక్టర్స్‌ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాం. అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం.’ అని ఆర్‌అండ్‌బీ డీఈ జగన్నాథరావు తెలిపారు.

Updated Date - Oct 27 , 2026 | 12:13 AM