Share News

“Oh My ‘Ghat’!” ఓ మై ‘ఘాట్‌’!

ABN , Publish Date - May 10 , 2026 | 12:19 AM

“Oh My ‘Ghat’!” ఎత్తయిన కొండలు, ఆహ్లాదకర వాతావరణం, ఇరుకు రోడ్లు, ఆపై మలుపులు, లోయల అంచుల నుంచి సాహసోపేతమైన ప్రయాణం.. ఇదీ సీతంపేట ఏజెన్సీలో పరిస్థితి. ఘాట్‌రోడ్లలో ప్రయాణించేటప్పుడు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కాగా సీతంపేట ఏజెన్సీలోని ఘాట్‌రోడ్డు ప్రమాదాలకు నిల యాలుగా మారుతుండడం కలవరపరుస్తోంది.

“Oh My ‘Ghat’!” ఓ మై ‘ఘాట్‌’!
ఆడలి వ్యూపాయింట్‌కు వెళ్లే మార్గంలోని ప్రమాదకర మలుపు

  • ఏమరపాటుగా ఉంటే లోయలోకే!

  • సీతంపేట ఏజెన్సీలో వరుస ప్రమాదాలు

  • గాలిలో గిరిజనుల ప్రాణాలు

  • పదుల సంఖ్యలో క్షతగాత్రులు

సీతంపేట రూరల్‌, మే9(ఆంధ్రజ్యోతి): ఎత్తయిన కొండలు, ఆహ్లాదకర వాతావరణం, ఇరుకు రోడ్లు, ఆపై మలుపులు, లోయల అంచుల నుంచి సాహసోపేతమైన ప్రయాణం.. ఇదీ సీతంపేట ఏజెన్సీలో పరిస్థితి. ఘాట్‌రోడ్లలో ప్రయాణించేటప్పుడు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కాగా సీతంపేట ఏజెన్సీలోని ఘాట్‌రోడ్డు ప్రమాదాలకు నిల యాలుగా మారుతుండడం కలవరపరుస్తోంది. ఇటీవల వరుసగా ప్రమాదాలు సంభవించడం.. పలువురు ప్రాణాలు కోల్పోవడం.. మరికొందరు గాయాలపాలవడంతో గిరిజనులు హడలి పోతు న్నారు. ఘాట్‌రోడ్లలో ప్రయాణించే ప్రైవేట్‌ వాహనాలు పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కిస్తుండడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. డ్రైవర్లకు అవగాహన లేకపోవడం వంటి కారణాలతో ఘాట్‌రోడ్లు నెత్తురోడుతున్నాయి. ఏదో ఒకలా గమ్యస్థానాలకు చేరుకోవాలనే తపన తప్ప భద్రతపై గిరిజనులకు కనీస అవగాహన లేకపోవడంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు.

ఘటనలు ఇలా..

- గతనెల 30న మీనకోట, సవరపాడు గ్రామాల సమీపంలోని ఘాట్‌రోడ్‌ లోయలో ఆటో బోల్తాపడిన ఘటనల్లో పాలకొండ మండలం జంపరకోట, డోలమడ గ్రామాలకు చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు.

- అదేరోజుసీతంపేట సమీపంలోని వాబ జంక్షన్‌ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొన్న ప్రమాదంలో జంపరకోట గ్రామానికి చెందిన భార్యాభర్తలు మృతిచెందారు.

- ఈనెల 6న బెన్నరాయి గ్రామానికి చెందిన 42 మంది గిరిజనులు పుట్టిగాంలో జరుగుతున్న ఓ వివాహ కార్యక్రమానికి హాజరై పికప్‌వ్యాన్‌లో తిరిగొస్తుండగా.. సవరపాడు ఘాట్‌రోడ్డులో వాహనం అదుపు తప్పి లోయలో బోల్తా పడింది. ఈ ఘటనలో 20మంది తీవ్రగాయాలపాలయ్యారు. అదష్టవశాత్తు పికప్‌ వ్యాన్‌ బోల్తాపడిన ప్రదేశంలో చెట్లు ఉండడం ప్రాణనష్టం జరగలేదు.

అవగాహన లేక..

అటవీ ఉత్పత్తులు తరలింపు, విద్య, వైద్యం ఇతర అవసరాల కోసం ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు ప్రైవేట్‌ వాహనాలనే ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. అయితే ఘాట్‌రోడ్లలో మలుపుల వద్ద ఏ విధంగా నడపాలనే దానిపై డ్రైవర్లకు అవగాహన లేకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.

ప్రమాదకర మలుపులెన్నో..

- మీనకోట నుంచి జంపరకోటకు వెళ్లే మార్గంలో ఉన్న మలుపుల వద్ద కొద్దిరోజుల కిందట ఆటో బోల్తా పడగా.. నలుగురు గిరిజనులు మృత్యువాతపడ్డారు.

- ఆడలి వ్యూపాయింట్‌కి వెళ్లే మార్గంలోని వెల్లంగూడ, బుడ్డడుగూడ, యాతాంగూడ, బిడిందిగూడ మలుపులు వద్ద తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఈ మార్గంలో ఐదురుగు వరకు మృత్యువాతపడ్డారు. పదుల సంఖ్యలో పర్యాటకులు క్షతగాత్రులుగా మారారు.

- దేవనాపురం-జగతిపల్లి వ్యూపాయింట్‌కు వెళ్లే మార్గంలో చాపరాయిగూడ, బొంబడుగూడ, బూర్జగూడ, దీసరగూడ మధ్య కూడా ప్రమాదకర మలుపులెన్నో ఉన్నాయి. గతంలో ఈ మార్గంలో ఓ కానిస్టేబుల్‌ కొండదిగుతూ మృత్యువాత పడగా పదుల సంఖ్యలో గిరిజనులు రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు.

- మెట్టుగూడ నుంచి చింతాడ, పాండ్ర, సున్నంగూడ, పాండ్ర బాపన్నగూడ, కిండ్రువాడ గ్రామాల మధ్యలో ఉన్న మలుపుల వద్ద కూడా ఎప్పటికప్పుడు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

- ఇసపరాయి- కిండ్రువాడ గ్రామాలతో పాటు బెన్నరాయి నుంచి తుంబలి, తుంబలిగూడ గ్రామాలతో పాటు పొంజాడ, జాతాపు జజ్జువ, కోతాం వంటి గ్రామాలకు వెళ్లే మార్గంలో ప్రమాదకర మలుపులు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం ఏజెన్సీలో ప్రమాదకర మలుపుల వద్ద రక్షణ గోడలను నిర్మించింది. అయితే గిరిశిఖర ప్రాంతాల్లోనే ఆయా రహదారులు ఉండడంతో ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఏజెన్సీలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు, ఐటీడీఏ ఉన్నతాఽధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అవగాహన సదస్సులతో పాటు ఏజెన్సీలోని జెడ్‌, ఎస్‌, హెయిర్‌పిన్‌ వంటి మలుపుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టాలని, డబ్ల్యూఎంఎం క్రేష్‌ బేరియర్స్‌, రక్షణ గోడలు ఏర్పాటు చేస్తే బావుంటుందని గిరిజనసంఘాల నాయకులు కోరుతున్నారు.

డీఎస్పీ ఏమన్నారంటే..

పాలకొండ డివిజన్‌ పరిధిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలపై పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు మాట్లాడుతూ.. ‘ డివిజన్‌ పరిధిలో రహదారి ప్రమాదాల నివారణకు ఆయా పోలీస్‌స్టేషన్‌ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. దీనిపై ప్రత్యేక డ్రైవ్‌ కూడా నిర్వహి స్తున్నాం. సీతంపేట ఏజెన్సీలోని ఘాట్‌రోడ్లలో ప్రయాణించే వాహనాల డ్రైవర్‌లకు అవగాహన కల్పించాం. లగేజ్‌ తరలించే వాహనాల్లో పాసింజర్‌లను ఎక్కిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించాం. నిత్యం వాహనాల తనిఖీలతో పాటు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు కూడా ముమ్మరంగా చేస్తున్నాం. రోడ్డు ప్రమాదాలపై ప్రజలు కూడా అవగాహన కలిగి ఉండాలి. పోలీసులకు పూర్తిగా సహకరించాలి. అని కోరారు.

Updated Date - May 10 , 2026 | 12:19 AM