Share News

బాబోయ్‌ జ్వరాలు

ABN , Publish Date - Jul 02 , 2026 | 11:31 PM

సీతంపేట మన్యంలో గిరిజనులపై జ్వరాలు పంజా విసిరాయి.

 బాబోయ్‌ జ్వరాలు
జ్వరంతో మంచంపట్టిన గిరిజన చిన్నారులు

- సీతంపేట మన్యంలో వణికిస్తున్న మలేరియా

- మంచంపై మూలుగుతున్న గిరిపుత్రులు

- ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు

సీతంపేట రూరల్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): సీతంపేట మన్యంలో గిరిజనులపై జ్వరాలు పంజా విసిరాయి. ఏజెన్సీలోని దోనుబాయి పీహెచ్‌పీ పరిధిలోని గిరిజన గ్రామాల్లో మలేరియా జ్వరపీడితులు ఎక్కువగా ఉన్నారు. మానాపురం, చాపరాయిగూడ, కిల్లాడ, పొంగలంగూడ గ్రామాల్లో జ్వరపీడితులు మంచంపై మూలుగుతున్నారు. చాపరాయిగూడలో ఆరిక అవినాష్‌, రాహుల్‌, ఆరిక సుబ్బారావు, ఎల్లారు, సావిత్రి, సవర సమీర్‌, ఆరిక ముత్యమ్మలు జ్వరాలతో బాధపడుతున్నారు. ఇదే గ్రామానికి చెందిన సవర చంద్రయ్య అనే గిరిజనుడు వీరఘట్టంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో రక్తపరీక్ష చేయించుకోగా మలేరియా పాజిటివ్‌ వచ్చింది. వైద్యులు ఇచ్చిన మందులు వాడడంతో జ్వరం తగ్గినట్లు చంద్రయ్య చెప్పాడు. పొంగలంగూడకు చెందిన బిడ్డిక భవాణి, కిల్లాడ గ్రామానికి చెందిన బిడ్డిక మహేశ్వరి అనే చిన్నారి కూడ మలేరియా జ్వరంతో సీతంపేటలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పొల్ల ఆశ్రమ పాఠశాలలో..

సీతంపేట ఐటీడీఏ పరిధిలోని పొల్ల గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో పలువురు విద్యార్థులు జ్వరాలతో బాధపడుతున్నారు. ఏడో తరగతి చదువుతున్న కొండగొర్రి ప్రవీణ్‌, ఆరిక మనోహర్‌కు జ్వరం రావడంతో పాఠశాల సిబ్బంది వారిని సమీపంలో ఉన్న సబ్‌సెంటర్‌కు తీసుకెళ్లి రక్తపరీక్షలు చేయించారు. ఆర్‌డీటీ కిట్‌ ద్వారా చేసిన రక్తపరీక్షల్లో ఇద్దరు విద్యార్థులకు మలేరియా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో గురువారం దోనుబాయి పీహెచ్‌పీకి తీసుకువెళ్లారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కూడా మలేరియా పాజిటివ్‌గా తేలడంతో వైద్యులు మందులు అందచేసి పాఠశాలకు పంపించేశారు. మనోహర్‌ను పాఠశాల సిబ్బంది అనుమతితో తన తండ్రి స్వగ్రామం చాపరాయిగూడకు తీసుకెళ్లిపోయాడు.

మెరుగైన సేవలు అందిస్తున్నాం..

పీహెచ్‌సీకి వచ్చే జ్వరపీడితులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. గ్రామాల్లో కూడా మా సిబ్బందిని అప్రమత్తం చేశాం. మలేరియా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన కేసులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచుతున్నాం.

-శివశంకర్‌, ఇన్‌చార్జి వైద్యాధికారి, దోనుబాయి పీహెచ్‌సీ

Updated Date - Jul 02 , 2026 | 11:31 PM