Share News

Oh.. June! అమ్మో.. జూన్‌!

ABN , Publish Date - Jun 02 , 2026 | 12:28 AM

Oh.. June! ‘నాన్నా.. బ్యాగు చిరిగిపోయింది కొత్త బ్యాగు కావాలి. డాడీ నా షూ చాలడం లేదు. కొత్తది కొనాలి. అమ్మా.. వాటర్‌ బాటిల్‌, క్యారీయర్‌ బాగాలేవు. కొత్తవాటిని కొనాల్సిందే..’ ప్రస్తుతం ఏ ఇంట విన్నా ఇవే మాటలు చెవిన పడుతున్నాయి. జూన్‌ రావడంతో విద్యాసంస్థలు ప్రారంభంకానున్నాయి. పిల్లలు తమకు కావాల్సినవన్నీ అడగడం ప్రారంభించారు. స్కూల్‌ ఫీజులు అదనం. దీంతో పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు అప్పుల వేట ప్రారంభించారు.

Oh.. June! అమ్మో.. జూన్‌!

అమ్మో.. జూన్‌!

ఖర్చుల నెల వచ్చింది

తల్లిదండ్రుల్లో ఒకటే టెన్షన్‌

పిల్లల చదువు కోసం అప్పుల బాట

ఫీజులు, యూనిఫారం, పుస్తకాల ఖర్చులు తడిసిమోపెడు

- రాజాంకు చెందిన కృష్ణారావుకు ఇద్దరు పిల్లలు. ఆయన దినసరి కూలీ. పెద్ద అబ్బాయి ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రెండో అబ్బాయి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. ఇంటర్‌లో ప్రవేశం కల్పించాల్సి ఉంది. ఇద్దరికీ ఫీజుల రూపంలో రూ.50 వేలు కట్టాలి. దీంతో కృష్ణారావు అయోమయంలో పడ్డాడు. అప్పు కోసం ప్రయత్నిస్తున్నాడు.

- రాజాంలోని ఓ జూట్‌ పరిశ్రమలో కార్మికుడుగా ఉన్న పైడితల్లి తన ఇద్దరు పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నాడు. భార్య సైతం ఉపాధి పనులకు వెళుతోంది. జూన్‌లో పిల్లల చదువుల కోసం రూ.30 వేలను అప్పు చేశాడు.

‘నాన్నా.. బ్యాగు చిరిగిపోయింది కొత్త బ్యాగు కావాలి. డాడీ నా షూ చాలడం లేదు. కొత్తది కొనాలి. అమ్మా.. వాటర్‌ బాటిల్‌, క్యారీయర్‌ బాగాలేవు. కొత్తవాటిని కొనాల్సిందే..’ ప్రస్తుతం ఏ ఇంట విన్నా ఇవే మాటలు చెవిన పడుతున్నాయి. జూన్‌ రావడంతో విద్యాసంస్థలు ప్రారంభంకానున్నాయి. పిల్లలు తమకు కావాల్సినవన్నీ అడగడం ప్రారంభించారు. స్కూల్‌ ఫీజులు అదనం. దీంతో పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు అప్పుల వేట ప్రారంభించారు.

రాజాం, జూన్‌1 (ఆంధ్రజ్యోతి):

పిల్లల చదువు కోసం తల్లిదండ్రుల యాతన మొదలైంది. ఈ నెల 1న కొన్ని జూనియర్‌ కాలేజీలు తెరుచుకోగా 12న పాఠశాలలు మొదలు కానున్నాయి. దీంతో జూన్‌ నెల అంటేనే తల్లిదండ్రులు వణుకుతున్నారు. సాధారణంగా ఒకటో తారీఖు అంటే ప్రతినెలా కాస్త ఆందోళనే.. జూన్‌ ఒకటి వస్తే మాత్రం మరింత టెన్షన్‌. రెగ్యులర్‌ నెల ఖర్చులతో పాటు అదనంగా డబ్బులు కావాల్సి ఉంటుంది. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ చేతిలో పెట్టుకొని రెడీగా ఉండాలి. పిల్లలు పాఠశాలల్లో చేరికతో వారి ఫీజులు, పుస్తకాలు, బ్యాగులు, బూట్లు ఒకటేమిటి అన్ని ఖర్చులు తప్పదు. ఈ నెల ఎలా అధిగమించగలమో అన్న భయం పట్టుకుంది. ఎక్కువ మంది అప్పులను ఆశ్రయిస్తున్నారు. కొందరు ముందుగానే రుణాలు తీసుకున్నారు.

పెరుగుతున్న ఫీజులు..

గత ఏడాది ఓ మోస్తారు ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థి ఫీజు రూ.12,000గా ఉండేది. ఈ ఏడాది రూ.20,000 చేసేశారు. చిన్నపాటి ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక తరగతులకు రూ.10 వేలు లోపే ఫీజుగా ఉండేది. కానీ కార్పొరేట్‌ సంస్థల ఫీజులు చూసి ప్రైవేటు పాఠశాలలు సైతం పెంచేస్తున్నాయి. ఇప్పటికే కార్పొరేట్‌ విద్యాసంస్థలు అడ్మిషన్ల కోసం పీఆర్వోలను రంగంలోకి దించాయి. మరికొన్ని యాజమాన్యాలు నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులకే ఫోన్లు చేస్తున్నాయి. ముందస్తుగా ఫీజు కట్టాలని.. అడ్మిషన్లు రాయించుకోవాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఆలస్యం చేస్తే అడ్మిషన్లు ఉండవని తేల్చిచెబుతున్నాయి. దీంతో ఆందోళనకు గురవుతున్న తల్లిదండ్రులు ఫీజు కట్టి అడ్మిషన్‌ రాయించుకుంటున్నారు.

ఫ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకటో తరగతి నుంచి 3వ తరగతి వరకూ గ్రామీణ ప్రాంతాల్లో రూ.6 వేలు, మండల కేంద్రాల్లో రూ.7,500, పట్టణాల్లో రూ.8,500గా నిర్ధారించారు. 4-5 తరగతులకు గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.9 వేలు, పట్టణాల్లో రూ.10,500, జిల్లా కేంద్రంలో రూ.12 వేలు, ఆరో తరగతికి గ్రామీణ ప్రాంతాల్లో రూ.9 వేలు, మండల కేంద్రాల్లో రూ.9,500, జిల్లా కేంద్రాల్లో రూ.11,100లను ఫీజులుగా నిర్ధారించారు. కాగా ఇంతకు మించే డిమాండ్‌ చేస్తున్నారు.

50 శాతం పెరిగిన ధరలు

నోటు పుస్తకాల ధరలు అమాంతం పెరిగాయి. గత ఏడాది రూ.50గా ఉండే పుస్తకం రూ.75పైమాటే. గత ఏడాది ఆరో తరగతి విద్యార్థులకు రూ.1000 వరకూ నోటుపుస్తకాలకు ఖర్చయ్యేది. ఇప్పుడు పెరిగిన ధరతో రూ.2,000 పైమాటే. ఇది ఒక్క నోటుపుస్తకాలకే. ఇంకా పెన్నులు, పెన్సిళ్లు, ఇతరత్రా వస్తువుల కొనుగోలు అదనం. గత ఏడాది స్కూల్‌ బ్యాగు రూ.300 వరకూ దొరికేది. ఈ ఏడాది రూ.500 లేనిదే బ్యాగు దొరకదు అని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక బూట్లు, క్యారేజ్‌ బాక్సుల గురించి చెప్పనక్కర్లేదు. విద్యార్థుల రవాణాకు సంబంధించి చార్జీలు కూడా పెరగనున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయని చెబుతూ ప్రైవేటు విద్యాసంస్థలు బస్‌ చార్జీలను పెంచుతున్నాయి. ఇదే అదునుగా విద్యార్థులను తరలించే ఆటోలు, నాలుగు చక్రాల వాహనాల చార్జీలు సైతం పెంచేశారు. గత ఏడాది ఐదు కిలోమీటర్ల దూరానికి నెలకు రూ.700 తీసుకునేవారు. ఈ ఏడాది రూ.1000 వరకూ తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలైతే మేలు

కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తల్లికి వందనం సాయం కింద రూ.15 వేలు అందిస్తోంది. ఆపై విద్యార్థులకు తగ్గట్లు ఉపాధ్యాయులను నియమించింది. ఉత్తమ విద్యాబోధన, వెనుకబడిన విద్యార్థులపై దృష్టి, పాఠ్య, నోటు పుస్తకాల కిట్లు, యూనిఫాం, బూట్లు అందిస్తోంది. ఆపై మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేస్తోంది. రక్షిత మంచినీరు, మరుగుదొడ్ల నిర్వహణ వంటివి చేపడుతోంది. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తే ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది.

నిబంధనలు పాటించాలి

విద్యాసంస్థలు నిబంధనలు పక్కాగా పాటించాలి. ఇప్పటికే అన్ని యాజమాన్యాల విద్యాసంస్థలకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ఎక్కడైనా ఫీజుల కోసం బలవంతంపెడితే ఫిర్యాదు చేయాలి. కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం నిర్దేశించిన ధరలనే ఫీజుగా తీసుకోవాలి. లేకుంటే చర్యలు తప్పవు.

- మాణిక్యంనాయుడు, డీఈవో, విజయనగరం

--------------

Updated Date - Jun 02 , 2026 | 12:28 AM