అమ్మో హైవే!
ABN , Publish Date - May 02 , 2026 | 12:17 AM
జాతీయ రహదారులు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. రోడ్డు ఎక్కాలంటేనే వాహన చోదకులు, ప్రయాణికులు హడలిపోయే పరిస్థితి నెలకొంటుంది.
- జాతీయ రహదారులపై నిత్యం ప్రమాదాలు
- ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు
- వంతెనలు, సర్వీసు రోడ్ల వద్ద కానరాని సూచికలు
- చాలాచోట్ల వెలగని విద్యుత్ లైట్లు
- కొరవడిన అధికారుల పర్యవేక్షణ
గత నాలుగేళ్లలో జరిగిన ప్రమాదాలు
సంవత్సరం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు
2023 668 213 826
2024 633 230 815
2025 618 230 743
2026(ఏప్రిల్) 322 100 488
- గత నెల 29న భోగాపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ద్విచక్ర వాహనం స్వగ్రామానికి వెళ్తుండగా ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
- గత నెల 27న పూసపాటిరేగ మండలం పేరాపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. శ్రీకాకుళం నుంచి విశాఖ వస్తున్న కారు అర్ధరాత్రి సమయంలో టీ తాగి రోడ్డుపైకి వస్తున్న ఇద్దర్ని ఢీకొట్టింది. అనంతం ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో రోడ్డుపై ఉన్న ఇద్దరితో పాటు కారులో ఉన్న మరో ఇద్దరు చనిపోయారు. మరొకరు ప్రాణాలతో పోరాడుతున్నారు.
- గత నెల 25న విశాఖ జిల్లా పెందుర్తి మండలానికి చెందిన కుటుంబం లగేజీ ఆటోలో దైవదర్శనం కోసం శ్రీకాకుళం వెళ్లారు. తిరిగి వస్తుండగా టీ తాగేందుకు భోగాపురం మండలం నారుపేట వద్ద జాతీయ రహదారిపై ఆటోని నిలిపారు. అతివేగంగా వచ్చిన ఓ కారు ఆటోను బలంగా ఢీ కొట్టింది దీంతో ఆటోలో ఉన్న 11 మందికి గాయాలయ్యాయి.
విజయనగరం/భోగాపురం, మే 1 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారులు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. రోడ్డు ఎక్కాలంటేనే వాహన చోదకులు, ప్రయాణికులు హడలిపోయే పరిస్థితి నెలకొంటుంది. ప్రధానంగా జాతీయ రహదారి-16 నిత్యం రక్త మోడుతోంది. అదే విధంగా ఎన్‌హెచ్-23, విశాఖ-విజయనగరం-పాలకొండ రహదారిపై ప్రతి రోజూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత మూడేళ్లలో 1,919 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 673 మంది మృత్యువాత పడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో సింహభాగం ప్రమాదాలు జాతీయ రహదారులపై జరిగినవే. కొన్నేళ్ల కిందట జాతీయ రహదారి-16ను ఆరు లైన్లగా విస్తరించారు. 30 వంతెనలు నిర్మించారు. పరిమిత సంఖ్యలో యూటర్న్‌లు ఏర్పాటు చేశారు. అయితే యూటర్న్‌ల వద్ద సూచిక బోర్డులు లేవు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు. చాలా దూరం వెళ్లిన తరువాత తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారుల పక్కనే డాబాలు, టీ, టిఫిన్ దుకాణాలు తదితర షాపులు ఉండడంతో భోజనాలు, అల్పాహారం కోసం లారీలతో పాటు ఇతర వాహనాలను ఎక్కడిపడితే అక్కడే ఆపేస్తున్నారు. కొందరు లారీ డ్రైవర్లు రాత్రి వేళల్లో సిగ్నల్ ఇండికేటర్ వేయకుండా వాహనాలను నిలిపివేస్తున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. భోగాపురం సమీపంలో సర్వీసు రహదారిని ఆనుకొని లారీలను నిలుపుదల చేసి డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవడానికి భవనం (రెస్టు ఏరియా) ఉన్నా వివాదం కారణంగా అది నిరుపయోగంగా వదిలేశారు. విశ్రాంతి తీసుకోవడానికి సరైన స్థలాలు లేకపోవడంతోనే జాతీయ రహదారిపై ఎక్కడబడితే అక్కడ వాహనాలు నిలుపుదల చేయడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని వాహన చోదకులు, స్థానికులు వాపోతున్నారు.
- అతివేగం, వేగ నియంత్రణ చర్యలు, పోలీసుల తనిఖీలు లేకపోవడంతో హైవేలపై ప్రమాదాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల్లోపు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్టు పోలీసులు సైతం గుర్తించారు. సర్వీసు రోడ్లు ప్రారంభం, ముగింపుల వద్ద భారీ బోర్డులు కనిపించేలా ఏర్పాటు చేయడం లేదు. చిన్నపాటి బోర్డులు ఏర్పాటు చేయడంతో వాహనదారులు గుర్తించడం లేదు. అందుకే జిల్లా వ్యాప్తంగా హైవేపై సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
- హైవేల నుంచి గ్రామాలకు వెళ్లే సర్వీసు రోడ్లు, వంతెనల వద్ద వందలాది విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. వాటికి ఎల్‌ఈడీ లైట్లను అమర్చారు. ప్రారంభంలో ఇవి బాగానే వెలిగాయి. కానీ తరువాత నిర్వహణ బాగా లేకపోవడంతో వెలగడం మానేశాయి. దాదాపు అన్ని జంక్షన్‌ల వద్ద ఇదే పరిస్థితి. చాలాచోట్ల ఈ దీపాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్యూజు బాక్సులు సైతం అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇప్పటికైనా వంతెనలు, సర్వీసు రోడ్ల వద్ద సూచిక బోర్డులు, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.
-హైవేపై గస్తీ కాసే కొందరు పోలీసులు సైతం విధులు సక్రమంగా నిర్వహించడం లేదనే విమర్శలు ఉన్నాయి. హైవేపై ప్రమాదాలు నివారించేందుకు, ఏవైన వాహనాలు మరమ్మతులకు గురై రోడ్డుపై నిలిచిపోతే అక్కడ ప్రమాద సూచికలను ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను మళ్లించాల్సిన అవసరం ఉంది. కానీ, కొందరు హైవే పోలీసులు తమ వాహనాలను చెట్ల కింద నిలిపి వేసి అందులో సేదతీరుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
చర్యలు తీసుకుంటాం
జాతీయ రహదారి-16పై లారీలను నిలుపుదల చేయకుండా చర్యలు తీసుకుంటాం. వాహన చోదకులు కూడా నెమ్మదిగా వెళ్లాలి. అతివేగం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతారు. దీనిపై వాహనచోదకులకు అవగాహన కల్పిస్తున్నాం.
-కె.దుర్గా, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, భోగాపురం