Oh God... దేవుడా .. ఇక మాకెవరు దిక్కు..
ABN , Publish Date - May 31 , 2026 | 11:28 PM
Oh God... Who Will Stand By Us Now? ‘డ్యూటీకి వెళ్లొస్తా.. మీరంతా జాగ్రత్త’ అని చెప్పి విధులకు బయల్దేరిన ఆ కుటుంబ పెద్ద తిరిగి ఇంటికి చేరలేదు. మరికొద్ది గంటల్లో స్వగ్రామానికి చేరుకోవాల్సిన ఆయన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు.
ఆగి ఉన్న లారీని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు
సాలూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ మృతి
కన్నీరుమున్నీరవుతున్న భార్యాపిల్లలు
శోక సంద్రంలో కుటుంబ సభ్యులు
తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న మరో డ్రైవర్
సాలూరు, మే31(ఆంద్రజ్యోతి): ‘డ్యూటీకి వెళ్లొస్తా.. మీరంతా జాగ్రత్త’ అని చెప్పి విధులకు బయల్దేరిన ఆ కుటుంబ పెద్ద తిరిగి ఇంటికి చేరలేదు. మరికొద్ది గంటల్లో స్వగ్రామానికి చేరుకోవాల్సిన ఆయన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. అయితే ఎప్పటిలానే డ్యూటీ నుంచి వస్తారని ఎదుదుచూస్తున్న ఆ కుటుంబానికి పిడుగులాంటి వార్త తెలియడంతో కుప్ప కూలిపోయారు. విశాఖపట్నం పరిధి గాజువాకలోని శ్రీనగర్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాలూరుకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ రాయిపల్లి రాంబాబు (50) మృతి చెందారు. తన భర్త ఇక లేడని తెలిసి భార్య అప్పలకొండ స్పృహ కోల్పోయింది. కుమార్తె స్వాతి, కుమారుడు జ్యోతిప్రకాష్ కన్నీరుమున్నీరయ్యారు. రాంబాబు మృతదేహం చూసి భోరున విలపించారు. ‘ఇలా వచ్చావా నాన్నా..? ఇక మాకు దిక్కెవరు?’ అంటూ కుమార్తె, కుమారుడు రోదించడం చూసి బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
సాలూరు పట్టణానికి చెందిన రాంబాబు గత పదేళ్లుగా పార్వతీపురం ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. కుమార్తె స్వాతి సచివాలయంలో, కుమారుడు జ్యోతిప్రకాష్ ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నారు. కాగా ఎప్పటిలానే శనివారం రాంబాబు ఇంటి నుంచి డ్యూటీకి వెళ్లారు. ఉదయం 11 గంటలకు పార్వతీపురం డిపో నుంచి రాజమండ్రి బస్సుతో బయల్దేరారు. ఆయన వెంట పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన మరో డ్రైవర్ జమ్మయ్య ఉన్నారు. రాజమండ్రి చేరుకున్న వారు శనివారం రాత్రి 10.30 గంటలకు అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఆదివారం తెల్లవారుజామున 4.10 గంటలకు గాజువాక సమీపంలో ఆగి ఉన్న లారీని ప్రమాదవశాత్తు బస్సు ఢీ కొట్టింది. దీంతో రాంబాబు మృతి చెందగా.. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న మరో డ్రైవర్ జమ్మయ్య కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. కాగా ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు అంబులెన్స్ ద్వారా సాలూరులో స్వర్గధామానికి రాంబాబు మృతదేహాన్ని తీసుకొచ్చారు. అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. అనంతరం ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు.
మృత్యువుతో పోరాడుతున్న మరో డ్రైవర్ జమ్మయ్య
పార్వతీపురం రూరల్, మే 31(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఎస్.జమ్మయ్య మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆయన కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆయనకు తల్లి నల్లమ్మ, భార్య గౌరీ ప్రియ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు, కుమార్తె విశాఖలోనే ఇంటర్ చదువుతున్నారు. కాగా జమ్మయ్య ప్రమా దానికి గురైనట్లు విషయం తెలుసుకున్న తల్లి నల్లమ్మ స్పృహ కోల్పోయింది. కుటుంబ సభ్యులు, స్థానికులు వచ్చి ఆమెకు సపర్యలు చేశారు. మరో వైపు భార్య గౌరీప్రియ షాక్‌కు గురైంది. వెంటనే తేరుకుని విశాఖ కేజీహెచ్‌కు బయల్దేరింది. జమ్మయ్య ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని దేవుడిని మొక్కుకుంటున్నారు.
కారణాలు తెలుసుకుంటాం..
పార్వతీపురం టౌన్, మే31(ఆంరఽధజ్యోతి): విశాఖ గాజువాక సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటామని పార్వతీపురం ఆర్టీసీ డిపోమేనేజర్ లక్ష్మణరావు తెలిపారు. శనివారం పార్వతీపురం డిపో నుంచి రాజమండ్రికి బస్సు బయల్దేరిందని.. అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణమవగా.. ఆదివారం వేకువజామున ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆగి ఉన్న లారీని బస్సు ఢీ కొన్న ఘటనలో డ్రైవర్ ఆర్.రాంబాబు మృతి చెందగా, మరో డ్రైవర్ జమ్మయ్య తీవ్ర గాయాలతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.
ఎక్స్‌గ్రేషియా ప్రకటన...
పార్వతీపురం, మే31(ఆంధ్రజ్యోతి): విశాఖ సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున సాయం అందించనున్నట్లు స్పష్టం చేసింది. కాగా ఆర్టీసీ బస్సులో సాంకేతిక లోపమా? లేదంటే మరేదైనా కారణం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? అన్నది తేల్చాల్సి ఉంది. పార్వతీపురం, సాలూరు, పాలకొండ డిపోల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తున్న బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. పల్లె వెలుగుతో పాటు అల్ర్టా డీలక్స్ బస్సులు మొరా యిస్తున్నాయి. వాటి ఫిట్‌నెస్‌తో పాటు నిర్వహణపై ఆర్టీసీ అధికారులతో పాటు రవాణా శాఖాధికారులు దృష్టి కేంద్రీకరించడం లేదనే విమర్శలున్నాయి. మొత్తంగా ఆర్టీసీలో సురక్షిత ప్రయాణం ప్రకటలనకే పరిమితమైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇకనైనా ఆర్టీసీ ఉన్నతా ధికారులు స్పందించి ప్రయాణికులకు భరోసా కల్పించాల్సి ఉంది. కాలం చెల్లిన, మరమ్మతులకు గురైన బస్సులను పక్కన పెట్టి.. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉంది.
ప్రాణం తీసిన అతివేగం
విశాఖపట్నం/మహరాణిపేట, మే 31 (ఆంధ్రజ్యోతి): అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే ఘోర సంఘటనలో ముగ్గురి మృతికి, తొమ్మిది మంది గాయపడడానికి కారణమయిందని క్షతగాత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో 35 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసీ బస్సు గాజువాక శ్రీనగర్ జంక్షన్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో డ్రైవర్‌తో సహా ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఎనిమిదిమంది కేజీహెచ్‌లో, ఒకరు మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ప్రమాద ఘటనపై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు వివరించి బావురుమన్నారు. ‘రాజమహేంద్రవరంలో బస్సు బయలుదేరింది, తునిలో డ్రైవర్ మారారు. అప్పటి నుంచి అతడి డ్రైవర్ వ్యవహారశైలితో ఇబ్బందులు పడ్డాం.’ అని ప్రయాణికులు చెబుతున్నారు. మితిమీరిన వేగంతో బస్సును నడపడంతో సీట్లలో కూర్చోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రమాదానికి కొన్నిక్షణాల ముందు పెద్ద శబ్దం వచ్చిందని, ప్రాణాలు పోయా యనుకున్నానని ప్రయాణికురాలు ప్రశాంతి వెల్లడించారు. బస్సు అతివేగంతో ముందున్న లారీని ఢీకొట్టడంతో సీట్లలో నుంచి కొందరు ఎగిరిపడ్డారని, ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో హాహాకారాలు మిన్నంటాయని క్షతగాత్రుడు రామకృష్ణ తెలిపారు.
కేజీహెచ్‌కు క్షతగాత్రులు
ఉదయం ఏడు గంటల సమయానికి క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో వైద్యులు వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో బస్సు నడుపుతున్న డ్రైవర్ ఎస్.జమ్మయ్య (పార్వతీపురం)తో పాటు ప్రయాణికులు నివ్య జీవిత (విజయనగరం), లంకా ఈశ్వరమ్మ (విజయనగరం), కనకం రాజు (పార్వతీపురం), కె.రామకృష్ణ (జామి, విజయనగరం జిల్లా) తదితరులు చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన కనకం లలిత (55)ను మెడికవర్ ఆస్పత్రికి తరలించారు.