Share News

దేవుడా! ఏం పాపం చేశాం

ABN , Publish Date - Nov 25 , 2026 | 12:17 AM

అంతవరకు తమ కళ్లముంగిట ఆడుతూపాడుతూ ఉన్న తమ పిల్లలు 20 నిమిషాల్లోనే విగతజీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రుల గుండె తట్టుకోలేకపోతోంది.

దేవుడా! ఏం పాపం చేశాం
వర్ష, ధనుజ్‌(ఫైల్‌)

- మాకెందుకు ఇంత శిక్ష

- గెడ్డలో పడిపోయిన అన్న.. కాపాడబోయిన చెల్లెలు

- ఇద్దరూ ప్రాణాలు కోల్పోయిన వైనం

- కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

- వీపీరేగలో విషాదం

గరివిడి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): అంతవరకు తమ కళ్లముంగిట ఆడుతూపాడుతూ ఉన్న తమ పిల్లలు 20 నిమిషాల్లోనే విగతజీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రుల గుండె తట్టుకోలేకపోతోంది. ‘మేము ఏం పాపం చేశాం... మాకెందుకు ఇంత శిక్ష’ అంటూ గుండెలను బాదుకుంటూ వారు రోదిస్తున్న తీరుని చూసి అక్కడనున్న వారు కంటతడి పెట్టుకున్నారు. వెంకుపాత్రుని రేగ (వీపీ.రేగ)లో మంగళవారం గెడ్డలో పడి అన్నాచెల్లెళ్లు ఎర్రబోలు ధనుజ్‌ (8), ఎర్రబోలు వర్ష(6) మృతి చెందారు. గ్రామస్థుల వివరాల మేరకు.. వీపీ రేగకు చెందిన ఎర్రబోలు రాజు, రమా దంపతులకు కుమారుడు ధనుజ్‌, కుమార్తె వర్ష ఉన్నారు. రాజు లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ధనుజ్‌ 3వ తరగతి, వర్ష ఒకటో తరగతి చదువుతున్నారు. మంగళవారం పాఠశాలకు సెలవు కావడంతో పిల్లలిద్దరూ ఉదయం ఇంటి వద్దనే తల్లిదండ్రుల కళ్ల ఎదురుగా ఆడుతూ పాడుతూ ఎంతో ఉషారుగా గడిపారు. 10 గంటల సమయంలో గ్రామానికి ఆనుకొని ఉన్న గెడ్డ వద్దకు బహిర్భూమికని ధనుజ్‌, వర్ష వెళ్లారు. అనంతరం శుభ్రం చేసుకోవడానికి ధనుజ్‌ గెడ్డ దగ్గరకు వెళ్లగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయాడు. దీనిని గమనించిన వర్ష అన్నయ్యను కాపాడేందుకు పరిగెత్తుకొని వెళ్లింది. ధనుజ్‌కు చెయ్యి ఇవ్వబోయి తను కూడా నీటిలో పడిపోయింది. ఇద్దరూ కేకలు వేస్తుండడంతో దగ్గరలో పొలాల్లో పనిచేస్తున్న గ్రామస్థులు పరిగెత్తుకుంటూ వచ్చి గెడ్డలో పడిపోయిన పిల్లలను బయటకు తీశారు. అప్పటికే పిల్లలిద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. తల్లిదండ్రులతో పాటు గ్రామ పెద్దలు 108కు సమాచారం ఇచ్చారు. వాహనం వచ్చేలోగా ద్విచక్ర వాహనాలపై పిల్లలను తీసుకుని చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి బయలుదేరారు. మార్గమధ్యలో తాటిగూడ సమీపంలో ఎదురుగా 108 వాహనం రావడంతో పిల్లలను అందులోకి ఎక్కించి చీపురుపల్లి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పిల్లలు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు పెద్దగా రోదించడం మొదలుపెట్టారు. పిల్లలు మృతి చెందడాన్ని తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్థులు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో వీపీరేగలో విషాదచాయలు నెలకొన్నాయి.

Updated Date - Nov 25 , 2026 | 12:17 AM