Share News

Oh God… దేవుడా.. ఎంత పనిచేశావ్‌!

ABN , Publish Date - May 13 , 2026 | 11:52 PM

Oh God… What Have You Done! డీజిల్‌ కోసం వెళ్లొస్తానని చెప్పిన ఆ విద్యార్థి తిరిగి ఇంటికి చేరుకోలేదు. తోటి స్నేహితునితో కలిసి తిరిగొస్తుండగా.. మృత్యువాతపడ్డాడు. దీంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ‘దేవుడా .. ఎంత పనిచేశావ్‌..!’ అంటూ గుండెలవిసేలా రోదించారు.

Oh God…   దేవుడా.. ఎంత పనిచేశావ్‌!
రోహిత్‌ (ఫైల్‌)

  • కారు ఢీకొని విద్యార్థి మృతి

  • గుచ్చిమి వద్ద ఘటన

  • కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు

పార్వతీపురం రూరల్‌/సీతానగరం, మే 13 (ఆంధ్రజ్యోతి): డీజిల్‌ కోసం వెళ్లొస్తానని చెప్పిన ఆ విద్యార్థి తిరిగి ఇంటికి చేరుకోలేదు. తోటి స్నేహితునితో కలిసి తిరిగొస్తుండగా.. మృత్యువాతపడ్డాడు. దీంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ‘దేవుడా .. ఎంత పనిచేశావ్‌..!’ అంటూ గుండెలవిసేలా రోదించారు. ఈ విషాద ఘటన సీతానగరం మండలంలో చోటుచేసుకుంది. గుచ్చిమి పెట్రోల్‌ బంకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పార్వతీపురం మండలం జమదాల గ్రామానికి చెందిన రాము, వరలక్ష్మి దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి పెద్ద కుమారుడు అల్లు రోహిత్‌ (16) పార్వతీపురంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి పూర్తిచేశాడు. రెండో తనయుడు అదే గ్రామంలోని పాఠశాలలో చదువుతున్నాడు. కాగా ఇంటి పనుల్లో చేదోడు వాదోడుగా ఉండే రోహిత్‌ బుధవారం నాయనమ్మ, తల్లిని ఊరులోని ఉపాధి పనులు జరిగే ప్రదేశానికి దగ్గరుండి పంపించాడు. అనంతరం తమకున్న ట్రాక్టర్‌ డీజిల్‌ కోసం స్నేహితుడు జెన్ని చందుతో కలిసి బైక్‌పై జమదాల నుంచి పులిగుమ్మి మీదుగా సీతానగరం మండలం గుచ్చిమి వచ్చారు. అక్కడ పెట్రోల్‌ బంక్‌లో డీజిల్‌ కొనుక్కొని బైక్‌పై రోడ్డు ఎక్కుతుండగా.. అదే సమయంలో బొబ్బిలి నుంచి పార్వతీపురం వెళ్తున్న కారు బలంగా ఢీకొట్టింది. దీంతో రోహిత్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. చందుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో అక్కడున్న వారు షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకుని క్షతగాత్రుడిని పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలు సుకున్న విద్యార్థి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. కాగా విగత జీవిగా పడి ఉన్న రోహిత్‌ను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. డీజిల్‌ కోసం వెళ్లిన కుమారుడు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ‘లే కన్నా.. ఇంటి కెళ్దాం’ అంటూ భోరున విలపించిన తీరు స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. సమాచారం తెలుసుకున్న ఏఎస్‌ఐ లక్ష్మణరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. రోహిత్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - May 13 , 2026 | 11:52 PM