Oh God... please don't let death come during the rainy season.దేవుడా.. వర్షాకాలంలో చావు రానివ్వొద్దు
ABN , Publish Date - Sep 25 , 2026 | 12:23 AM
Oh God... please don't let death come during the rainy season. దత్తిరాజేరు, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలన్నా.. వర్షాకాలం అన్నా వారికి చాలా బెంగ. ఆ సమయంలో గ్రామంలో ఎవరూ మృతిచెందకూడదని వారు దేవుళ్లకు మొక్కుతుంటారు. అంతిమయాత్రలో వారు ఎదుర్కొంటున్న అగచాట్లే వారి కోరికకు కారణం. శ్మశానానికి దారిలేక భౌతిక దేహాలను ప్రమాదకర పరిస్థితిలో తరలిస్తుంటారు.
దేవుడా..
వర్షాకాలంలో చావు రానివ్వొద్దు
వేడుకుంటున్న పెదకాద గ్రామస్థులు
శ్మశానానికి దారిలేక అంతిమయాత్రకు ఇక్కట్లు
ఛాతిలోతు నీటిలో మృతదేహాన్ని మోసుకెళ్లాల్సిందే
సాటి మనిషి మరణిస్తే సాగనంపే వేళ గుండెలను పిండేసే బాధ ఉంటుంది. కానీ ఆ గ్రామంలో ‘అయ్యో.. ఈ వర్షాకాలంలో చనిపోయారేంటి?’ అనే ఆందోళన కూడా ఉంటుంది. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేరు. కానీ ‘దేవుడా! వర్షాకాలంలో మా ఊర్లో ఎవరికీ చావు రానివ్వకు. ఆ చావేదో వర్షాలు తగ్గినాక ఇవ్వు’ అని ఆ గ్రామస్థులు వేడుకుంటున్నారంటే అక్కడి పరిస్థితి ఎంత నరకప్రాయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దత్తిరాజేరు మండలం పెదకాద గ్రామంలో మరణం కంటే మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లడమే అత్యంత భయానక పరీక్షగా మారింది.
చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాల్సిన సమయంలో.. నీటి ప్రవాహంలో పాడె కొట్టుకుని పోతుందేమోనన్న భయంతో అంతిమయాత్ర సాగించాల్సిన దుస్థితి మాది. ప్రాణాలు పణంగా పెట్టి వాగు దాటుతున్నాము.
- పెదకాద గ్రామస్థులు
దత్తిరాజేరు, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలన్నా.. వర్షాకాలం అన్నా వారికి చాలా బెంగ. ఆ సమయంలో గ్రామంలో ఎవరూ మృతిచెందకూడదని వారు దేవుళ్లకు మొక్కుతుంటారు. అంతిమయాత్రలో వారు ఎదుర్కొంటున్న అగచాట్లే వారి కోరికకు కారణం. శ్మశానానికి దారిలేక భౌతిక దేహాలను ప్రమాదకర పరిస్థితిలో తరలిస్తుంటారు. ఛాతిలోతులో ఏడొంపులగెడ్డ ఆవలకు వెళ్లాల్సిందే. ఈ క్రమంలో ఏ అపాయం వస్తుందోనని తరలిస్తున్న వారి పట్ల కుటుంబ సభ్యులు కలవరపడుతుంటారు. తాజా ఘటన వారి కష్టాలకు మరో నిదర్శనం. గ్రామంలో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సామిరెడ్డి పరదేశమ్మ (65), మంగిరెడ్డి లక్ష్ముంనాయుడు(62)లు గురువారం మృతిచెందారు. దీంతో వారికి అంత్యక్రియలు చేసేందుకు బంధువులు, గ్రామస్థులు ఉపక్రమించారు. ఏడొంపులగెడ్డ ఆవల శ్మశానవాటిక ఉంది. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ఏడొంపులగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైనప్పటికీ తప్పని పరిస్థితుల్లో ఏడొంపులగెడ్డ ఆవల ఉన్న శ్మశానవాటికకు ఇద్దరి మృతదేహాలను చేర్చారు. ఛాతిలోతులో దిగి ప్రమాదకర పరిస్థితిలో తరలించారు. దశాబ్దాలుగా వర్షాకాలంలో ఈ సమస్య ఎదుర్కొంటున్నామని, మృతదేహాలను శ్మశానవాటికకు తీసుకువెళ్లాలంటే ప్రాణాలను పణంగా పెట్టి దాటాల్సిందేనని గ్రామస్థులు వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి దారి ఏర్పాటు చేయాలని కోరారు. పెదకాద గ్రామ పంచాయతీలో సుమారు 840 గృహాలు, 3,600 మంది జనాభా ఉంటారు. శ్మశాన వాటికకు సరైన దారి లేక ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు.
అస్తికలు లభించలే...
సామిరెడ్డి పరదేశమ్మను భారీ వర్షం కారణంగా పూడ్చిపెట్టగా.. కొద్దిపాటి వర్షం తగ్గిన తరువాత మంగిరెడ్డి లక్ష్ముంనాయుడు మృతదేహాన్ని దహనం చేశారు. అయితే అస్తికలను సేకరించేందుకు సాయంత్రం శ్మశానవాటికకు వెళ్లగా ఏడొంపులగెడ్డ పొంగిపొర్లడంతో అస్తికలు వరదదాటికి కొట్టుకుపోయాయి. దీంతో కుటుంబీకులు నిరాశతో వెనుతిరిగారు.
గెడ్డపై బ్రిడ్జి నిర్మించాలి
మృతదేహాలు తీసుకువెళ్లడానికి ఎన్నో ఏళ్లుగా ఇబ్బందిపడుతున్నాం. వర్షాకాలం వచ్చిందంటే ఏడొంపులగెడ్డ పొంగుతుంటుంది. మృతదేహాలను ఆవల ఒడ్డుకు తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు చాలా అవస్థలు పడుతున్నాం. గతంలో పాలకుల దృష్టికి తీసుకువెళ్లినా వాయిదా వేస్తూ వచ్చారు గానీ సమస్యకు పరిష్కారం చూపలేదు. ఏడొంపులగెడ్డపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టి సమస్య పరిష్కరించాలి.
సామిరెడ్డి ఈశ్వరరావు, పెదకాద, దత్తిరాజేరు మండలం
బ్రిడ్జిపై మంత్రి హామీ ఇచ్చారు
దశాబ్దాలుగా తాము పడుతున్న శ్మశానవాటిక సమస్యకు ఈ ప్రభుత్వమైనా పరిష్కారం చూపాలి. గతం ప్రభుత్వంలో ఎమ్మెల్యేకు విన్నవించాం. కానీ పరిష్కారం కాలేదు. ఈ ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లాం. మంత్రి శ్రీనివాస్ స్పందించి ఏడొంపులగెడ్డపై బ్రిడ్జి నిర్మాణానికి అంచనా వేయించారు. నాబార్డు నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తామన్నారు.
నగిరెడ్ల సత్యం, మాజీ ఎంపీటీసీ, పెదగాద గ్రామం, దత్తిరాజేరు మండలం
నిర్మాణానికి అంచనాలు వేశాం
శ్మశానవాటిక సమస్యను పలుమార్లు పెదకాద గ్రామస్థులు విన్నవించారు. బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు అంచనా వేశారు. నిధులు మంజూరు కాలాల్సి ఉంది. శుక్రవారం క్షేత్ర స్థాయిలో పర్యటించి శ్మశానవాటిక ఏర్పాటుకు ప్రత్యామ్నాయ స్థలం ఏదైనా ఉందా అని పరిశీలిస్తాం.
- ఎస్.తాత, ఎంపీడీవో, దత్తిరాజేరు మండలం