Share News

Officials Required అధికారులు కావలెను

ABN , Publish Date - Sep 02 , 2026 | 12:19 AM

Officials Required జిల్లాకేంద్రం పార్వతీపురం మున్సిపాల్టీ పరిస్థితి దయనీయంగా మారింది. అధికారుల కొరతతో పాలన పూర్తిగా గాడి తప్పింది. దీంతో పుర వాసులకు పూర్తిస్థాయిలో సేవలందడం లేదు. వారి సమస్యలూ పరిష్కారం కావడం లేదు. ప్రధానంగా మున్సిపాల్టీలో తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.

Officials Required అధికారులు కావలెను
పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయం

  • కీలక విభాగాల పోస్టులు ఖాళీ

  • ఇంజనీరింగ్‌, రెవెన్యూ, ప్రణాళిక విభాగాల నుంచి సేవలు నిల్‌

  • గాడి తప్పిన తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ

  • ప్రత్యేకాధికారిపైనే ఆశలు

పార్వతీపురం టౌన్‌, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రం పార్వతీపురం మున్సిపాల్టీ పరిస్థితి దయనీయంగా మారింది. అధికారుల కొరతతో పాలన పూర్తిగా గాడి తప్పింది. దీంతో పుర వాసులకు పూర్తిస్థాయిలో సేవలందడం లేదు. వారి సమస్యలూ పరిష్కారం కావడం లేదు. ప్రధానంగా మున్సిపాల్టీలో తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పురపాలక కార్యాలయంలోని మున్సిపల్‌ కమిషనర్‌తో పాటు ఇంజనీరింగ్‌, రెవెన్యూ, ప్రణాళిక విభాగాల్లో పూర్తిస్థాయిలో అధికారులు లేరు. గత ఏడాది నుంచి మున్సిపల్‌ పరిపాలన అంతా కాగితాలపైనే నడుస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ తర్వాత శాశ్వత ప్రాతిపదిక కమిషనర్‌ నియామకాలు జరగడం లేదు. ఎఫ్‌ఏసీ కమిషనర్లే కొనసాగుతుండడంతో మున్సిపాల్టీలో పలు విభాగాలకు సంబంధించిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

- పార్వతీపురం మున్సిపాల్టీలో 30 వార్డులున్నాయి. ఆ సంఖ్యను 36కు పెరిగే అవకాశం ఉంది. కాగా పట్టణంలో 54వేల 555 మంది జనాభా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అనధికారికంగా 70 వేల నుంచి 80 వేల మంది వరకు ఉంటారనేది అంచనా. పట్టణ నడిబొడ్డుతో పాటు శివారు కాలనీ వాసులకు రోజుకు 2 లక్షల లీటర్ల నీటిని అందించాల్సి ఉంది. అయితే నాలుగు నుంచి ఐదురోజుల కొకసారైనా కుళాయిల ద్వారా 50 లీటర్ల తాగునీటి అందించలేకపోతున్నారు.

- రెండేళ్ల కిందట విశాఖపట్నం జీవీఎంసీ నుంచి ఇంజనీరింగ్‌ విభాగండీఈగా శ్రీనివాసరాజు పార్వతీపురం మున్సిపాల్టీకి వచ్చారు. అయితే డీఈగా కంటే ఎఫ్‌ఎసీ కమిషనర్‌గానే ఎక్కువ రోజులు పనిచేశారు. ఇటీవల ఆయనతో పాటు ఇదే విభాగంలో ఏఈ అప్పారావు కూడా సెలవుపై వెళ్లారు. దీంతో తాగునీటి సరఫరా పరిస్థితి రోజురోజుకూ దారుణంగా మారుతుంది.

- వీధిలైట్ల నిర్వహణ చేపట్టిన ఏఈ సన్యాసిరావు ఇటీవల ఉద్యోగ విరమణ చేశారు. ఆ విభాగంలో పర్యవేక్షణ కొరవడడంతో ప్రస్తుతం పట్టణ ప్రధాన రహదారితో పాటు పలు వీధుల్లో సక్రమంగా వీధి దీపాలు వెలగడం లేదు.

- రెవెన్యూ విభాగంలో ఆర్‌వో ఉద్యోగ విరమణ తర్వాత ఆర్‌ఐ ఈశ్వరరావు మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే రెవెన్యూ విభాగం మొత్తం ఆర్‌ఐ వినయ్‌తోపాటు సచివాలయ విభాగం సిబ్బందితో నడుస్తుంది. దీంతో పన్నుల వసూళ్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

- పట్టణ ప్రణాళిక విభాగం టీపీఎస్‌గా వెంకట నారాయణ ఓ ఏడాది కిందట విశాఖపట్నం నుంచి డిప్యుటేషన్‌పై వచ్చారు. అయితే బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మళ్లీ వెనక్కి వెళ్లిపోవాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. వారం రోజుల కిందట అనారోగ్యం బాగోలేదని ఆయన సెలవుపై వెళ్లిపోయారు. ప్రస్తుతం సచివాలయ ప్రణాళిక విభాగాల సిబ్బందితో సేవలు అందిస్తున్నారు.

- పూర్తిస్థాయి కమిషనర్‌ పావనీని ఎన్నికల పర్యవేక్షణ అధికారిగా ఇటీవల విజయవాడకు డిప్యూటేషన్‌పై పంపించారు. ఆ స్థానంలో ఇంజనీరింగ్‌ విభాగం డీఈ, ఎఫ్‌ఏసీ కమిషనర్‌గా శ్రీనివాసరాజుకు బాధ్యతలు అప్పగించారు. అయితే మూడు రోజుల కిందట జేఈవో అశోక్‌కుమార్‌ను ఎఫ్‌ఏసీ కమిషనర్‌గా నియమించారు. మొత్తంగా పూర్తిస్థాయి కమిషనర్‌ లేకపోవడంతో ఆ ప్రభావం పురపాలనపై పడుతోంది.

ప్రత్యేకాధికారి ఏం చేస్తారో..

ఈ ఏడాది ఏప్రిల్‌లో పాలకవర్గం రద్దయిన తర్వాత కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి మున్సిపల్‌ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టారు. అయితే జిల్లా పరిపాలన బాధ్యతలు పెరుగుతుండడంతో ఇటీవల ఆర్డీవో మాధురిని మున్సిపల్‌ ప్రత్యేకాధికారిగా నియమించారు. అయితే పట్టణ ప్రజలకు అవసమైన తాగునీటి సరఫరా, వీధిలైట్ల నిర్వహణకు సంబంధించి ప్రత్యేకాధికారి పక్కా ప్రణాళికలను సిద్దం చేసుకోవాల్సి ఉంది.కీలక విభాగాలకు సంబంధించి అధికారులను నియమించి.. పూర్తిస్థాయిలో ప్రజలకు సేవలందించాల్సి ఉంది. మొత్తంగా పుర పాలనను తిరిగి గాడిలో పెట్టే బాధ్యత ప్రత్యేకాధికారి చేతుల్లోనే ఉంది.

ప్రత్యేకాధికారికి వివరిస్తాం..

ఇంజనీరింగ్‌, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక విభాగాల్లో అధికారుల కొరత విషయమై మున్సిపల్‌ ప్రత్యేకాధికారి , ఆర్డీవో మాధురికి వివరిస్తాం. తాగునీటి సరఫరా, తదితర సమస్యలకు సంబంధించి ప్రస్తుతం కార్యాలయంలో అందుబాటులో ఉన్న అధికారులు, సచివాలయ సిబ్బందితో చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషిస్తాం.

- అశోక్‌కుమార్‌, ఇన్‌చార్జి కమిషనర్‌, పార్వతీపురం మున్సిపాల్టీ

Updated Date - Sep 02 , 2026 | 12:19 AM