ఒడిశా ఆర్టీసీ బస్సు బోల్తా
ABN , Publish Date - Feb 15 , 2026 | 11:20 PM
ఒడిశాకు చెందిన ఆర్టీసీ బస్సు సాలూరు వద్ద ఆదివారం వేకువజామున బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు.
ఏడుగురి ప్రయాణికులకు గాయాలు
సాలూరు వద్ద ఘటన
సాలూరు, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ఒడిశాకు చెందిన ఆర్టీసీ బస్సు సాలూరు వద్ద ఆదివారం వేకువజామున బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు, బస్సు డ్రైవర్ భాస్కరరావు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కనగిరి (ఒడిశా) నుంచి విశాఖపట్నంకు 29 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు ఆదివారం వేకువజామున 2.30 గంటలకు సాలూరు డంపింగ్ యార్డు సమీపంలోకి వచ్చేసరికి స్టీరింగ్ లాకైపోయింది. దీంతో బస్సును నియంత్రించేందుకు డ్రైవర్ ఎంత ప్రయత్నించినా వీలుపడలేదు. బస్సు కుడి వైపునకు దూసుకువెళ్లి బోల్తాపడింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని 108 వాహనంలో సాలూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని విజయనగరం ఆస్పత్రికి వైద్యులు రిఫర్ చేశారు. మిగిలిన ప్రయాణికులను మరో బస్సులో విశాఖకు పంపించేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. పట్టణ సీఐ అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.