Ocean of Tears కన్నీటి సంద్రం
ABN , Publish Date - May 01 , 2026 | 11:40 PM
Ocean of Tears జంపరకోటలో రోదనలు మిన్నంటాయి. బరువెక్కిన హృదయాలతో ఆ గ్రామం కన్నీటి సంద్రమైంది. ఘాట్‌రోడ్డులో జరిగిన ఆటో ప్రమాదంలో మృతి చెందిన ఉర్లక శాంతి, కొండగొర్రె శ్రావణి, ఆరిక ఆదిలక్ష్మితో పాటు గురువారం మధ్యాహ్నం సీతంపేట మండలం వాబ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సుఢీకొని మృతి చెందిన అదే గ్రామానికి చెందిన జీలకర్ర మోహనరావుకు శుక్రవారం జంపరకోటలో సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు.
జంపరకోట, డోలమడలో విషాదచాయలు
పాలకొండ, మే1(ఆంధ్రజ్యోతి): జంపరకోటలో రోదనలు మిన్నంటాయి. బరువెక్కిన హృదయాలతో ఆ గ్రామం కన్నీటి సంద్రమైంది. ఘాట్‌రోడ్డులో జరిగిన ఆటో ప్రమాదంలో మృతి చెందిన ఉర్లక శాంతి, కొండగొర్రె శ్రావణి, ఆరిక ఆదిలక్ష్మితో పాటు గురువారం మధ్యాహ్నం సీతంపేట మండలం వాబ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సుఢీకొని మృతి చెందిన అదే గ్రామానికి చెందిన జీలకర్ర మోహనరావుకు శుక్రవారం జంపరకోటలో సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. పాలకొండ, వీరఘట్టం, భామిని, సీతంపేట తదితర గ్రామాలకు చెందిన గిరిజనులు, మైదాన ప్రాంత ప్రజలు అక్కడకు భారీగా చేరుకున్నారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు రోడ్డు ప్రమా దాల్లో మృతి చెందడంతో బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. ఇక డోల మడకు చెందిన ఆటో డ్రైవర్ అక్కుపల్లి రమణకు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
జంపరకోటలో బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పరామర్శించి ఓదార్చారు. ఒక్కో కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం రూ.10 వేల చొప్పున అందించారు. బాధిత కుటుం బాలకు ప్రభుత్వం నుంచి త్వరితగతిన ఆర్థికసహాయం అందేలా చూస్తామన్నారు.
అరకు పార్లమెంటరీ అధ్యక్షురాలు తేజోవతి, టీడీపీ నాయకులు భూదేవి, కర్నేన అప్పల నాయుడు, గండి రామినాయుడు తదితరులు పాలకొండ ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రులతో మాట్లాడారు. అనంతరం జంపరకోట, డోలమడ గ్రామాలకు చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు బత్తిన మోహన్ ఏరియా ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. కాగా ఈ ఘటనపై సీతంపేట మండలం దోనుబాయి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అమ్మకావాలి..!
ఆటో ప్రమాదంలో మృతి చెందిన కొండగొర్రె శ్రావణి పిల్లలు రుషికుమార్, హేమలత పాలకొండ ఆసుపత్రిలోనే వైద్యసేవలు పొందుతున్నారు. తల్లి మృతి చెందిన విషయం తెలియని చిన్నారులు అమ్మ కావాలని.. పదేపదే బంధువులను అడుగుతున్నారు. గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు తండ్రి భాస్కరరావు వెళ్లడంతో.. ఆసుపత్రిలో పిల్లల పరిస్థితి చూసి బంధువులు, గ్రామస్థులు కన్నీటిపర్యంతమవుతున్నారు. అదే గ్రామానికి చెందిన కొండగొర్రె మౌనిక, నిమ్మక చాందినిలు శ్రీకాకుళం రిమ్స్ ఆసుప త్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఆటో ప్రమాదంలో మృతదేహాలకు శుక్రవారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆ సమయంలో ఏరియా ఆసుపత్రి వద్ద జంపరకోట, డోలమడ గ్రామస్థులతో పాటు పలు గ్రామాలకు చెందిన ప్రజలు అక్కడకు పెద్దఎత్తున చేరుకున్నారు.