ఆక్రమించి.. అద్దెలకిస్తూ
ABN , Publish Date - Apr 28 , 2026 | 11:32 PM
రాజాం పట్టణంలో నాలుగు ప్రధాన రోడ్లు ఆక్రమణలతో కుచించుకుపోతున్నాయి.
- రాజాం ప్రధాన రోడ్లపై ఇష్టారాజ్యం
- ఆక్రమణకు గురవుతున్న ఫుట్‌పాత్‌లు
- బడ్డీలకు అద్దెకు ఇస్తున్న వైనం
- రహదారులపైనే ఆటోల పార్కింగ్
- చోద్యం చూస్తున్న అధికారులు
రాజాం రూరల్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): రాజాం పట్టణంలో నాలుగు ప్రధాన రోడ్లు ఆక్రమణలతో కుచించుకుపోతున్నాయి. ఫుట్‌పాత్‌లపై తాత్కాలిక, శాశ్వత కట్టడాలు సైతం ఎక్కువైపోతున్నాయి. రాజాం మెయిన్‌రోడ్ తొలిదశ విస్తరణకు సుమారు రూ.20 కోట్లు, రెండోదశకు మరో రూ.20 కోట్లు వెచ్చించారు. నాలుగు ప్రధాన మార్గాల్లో డివైడర్ల కోసం ఐదు అడుగులు కేటాయించారు. ఇరువైపులా ఫుట్‌పాత్‌ల కోసం కేటాయించిన పది అడుగులు ఆక్రమణకు గురయ్యాయి. వీటి ముందు సుమారు మరో 15 అడుగుల మేర ఆటోలు, ద్విచక్ర వాహనాలతో చిరు వ్యాపారులకు చెందిన నాలుగు చక్రాల వాహనాలను నిలిపివేస్తున్నారు. 80 అడుగులు ఉండాల్సిన రహదారి 30 అడుగులు ఆక్రమణలకు గురికాగా, ఇరువైపులా చెరో 25 అడుగులకు మించి కనిపించని పరిస్థితి నెలకొంది. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై మున్సిపల్ యంత్రాంగం దృష్టి సారించడం లేదు. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి కొంతమంది చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటుండగా, మరికొంతమంది ఆక్రమించిన స్థలాన్ని అద్దెలకిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చిన్నపాటి బడ్డీ పెట్టుకునే స్థలం రూ.3 వేలు అద్దె పలుకుతుంది. పాలకొండ రోడ్‌లో బడ్డీ పెట్టుకునే స్థలం రూ.5 వేలకు పైమాటే పలుకుతోంది. ఫుట్‌పాత్‌లను ఆనుకుని ఇళ్లు, ఖాళీ స్థలాలు ఉన్న వారు వాటిని అద్దెలకిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా తెలిసినా ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆటోలతో ట్రాఫిక్ సమస్య..
రాజాం రోడ్లపై రాకపోకలు సాగించాలంటే జనం భీతిల్లిపోతున్నారు. కొందరు ఆటో డ్రైవర్లు వారికి ఎక్కడ నచ్చితే అక్కడ వాహనాన్ని నిలిపివేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. మరి కొందరు ఆటో వాలాలు రాంగ్‌రూట్‌లో రాకపోకలు సాగిస్తున్నారు. మెయిన్‌రోడ్‌లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పశువుల ఆసుపత్రి, మాధవబజార్ జంక్షన్, సంపత్‌భవన్, పాలకొండ రోడ్‌లో జేజే ఇనోటెల్ వరకూ, శ్రీకాకుళం రోడ్‌లో అంబేడ్కర్ జంక్షన్ మొదలుకుని కరూర్ వైశ్యాబ్యాంక్, బొబ్బిలి జంక్షన్, చీపురుపల్లిరోడ్‌లో ఎర్రచెరువుగట్టు వరకూ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆటోలను పార్కింగ్ చేసి డ్రైవర్లు వెళ్లిపోతున్నారు. దీంతో తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. ఇటీవల ట్రాఫిక్ నియంత్రణ కోసం అంబేడ్కర్ జంక్షన్ నుంచి సంపత్‌భవన్ వరకూ పాలకొండ రోడ్‌లో కొంతమంది పోలీసుల్ని నియమించినా సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు. ఆర్టీఏ, పోలీసు అధికారులు తనిఖీలు చేయకపోవడంతో కొంతమంది ఆటో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మైనర్లు సైతం ఇష్టారాజ్యంగా వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.