Share News

Occupying irrigation ponds but no action నాడు వదిలేసి.. నేడు మమ అనేసి

ABN , Publish Date - Jun 02 , 2026 | 11:57 PM

Occupying irrigation ponds but no action ముషిడిపల్లి పంచాయతీలో ఓ భారీ లేఅవుట్‌కు నిర్మించిన రోడ్డు ఇది. ప్రభుత్వ స్థలం ఆక్రమించి మూడేళ్ల కిందట రోడ్డు వేసేశారు. ఇన్నాళ్ల తర్వాత ‘ప్రభుత్వ భూమి(చెరువు)ని ఆక్రమించకూడదు. ఆక్రమిస్తే శిక్షార్హులు’ అంటూ బోర్డులు ఏర్పాటు చేయడం చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

Occupying irrigation ponds but no action నాడు వదిలేసి.. నేడు మమ అనేసి
ఎస్‌.కోట మండలం ముషిడిపల్లిలో లేఅవుట్‌కు నిర్మించిన రోడ్డులో సూచిక బోర్డు ఏర్పాటు చేస్తున్న అధికారులు

నాడు వదిలేసి.. నేడు మమ అనేసి

వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి చెరువులను ఆక్రమించి రోడ్డు నిర్మాణం

ఇప్పుడు సూచిక బోర్డులు ఏర్పాటు చేసిన రెవెన్యూ

అధికారుల తీరుపై విస్మయం

చెరువుకు పూర్వ రూపు తీసుకురావాలంటున్న గ్రామస్థులు

ముషిడిపల్లి పంచాయతీలో ఓ భారీ లేఅవుట్‌కు నిర్మించిన రోడ్డు ఇది. ప్రభుత్వ స్థలం ఆక్రమించి మూడేళ్ల కిందట రోడ్డు వేసేశారు. ఇన్నాళ్ల తర్వాత ‘ప్రభుత్వ భూమి(చెరువు)ని ఆక్రమించకూడదు. ఆక్రమిస్తే శిక్షార్హులు’ అంటూ బోర్డులు ఏర్పాటు చేయడం చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఆక్రమణపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పకుండా ఆక్రమిస్తే శిక్షార్హులు అని అనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై విస్మయం చెందుతున్నారు. ముందు చెరువుకు ఓ రూపు తీసుకురావాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

శృంగవరపుకోట, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ముషిడిపల్లి పంచాయతీలో ఓ భారీ లేఅవుట్‌కు అక్రమంగా నిర్మించిన రోడ్డులో ప్రభుత్వ భూమి(చెరువు)ని ఆక్రమించకూడదు.. ఆక్రమిస్తే శిక్షార్హులంటూ ఓ చోట... ఆక్రమణల వివరాలను రాసి మరోచోట రెవెన్యూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. అసలు రోడ్డును తొలగించకుండా ఆక్రమిస్తే శిక్షార్హులంటూ సూచిక బోర్డులను పాతిన అధికారుల తీరుపై స్థానికులు విస్మయానికి గురవుతున్నారు. రెవెన్యూ అధికారుల చిత్తశుద్ధిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డును తొలగించిన తరువాత ఇలా హెచ్చరిక బోర్డులు పెడితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అలా చేయకుండా కంటి తుడుపు చర్యలేంటని ప్రశ్నిస్తున్నారు. దాదాపు 160 ఎకరాల విస్తీర్ణం ఉన్న లేఅవుట్‌కు మూడేళ్ల క్రితమే వైసీపీ హయాంలో రోడ్డు నిర్మించారు. ఆ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధికి చెందిన బంధువుల భాగస్వామ్యం ఉండడంతో అధికారులు అటు చూడడం మానేశారు. బందలు, డి.పట్టాల భూములను ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు నాడు రెవెన్యూ అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ పట్టించుకోలేదు.

హైవేకు అనుసంధానంగా రోడ్డు

బొడ్డవర నుంచి విజయనగరం వరకు ఉన్న (వయా తాటిపూడి) జాతీయ రహదారి 516-బికి అనుసంధానంగా నాడు రోడ్డు నిర్మాణం చకచకా జరిగిపోయింది. జాతీయ రహదారికి ఆనుకుని ఉండడంతో ప్లాట్లకు ధర పలుకుతుందని యాజమాన్యం అడ్డదారులు తొక్కింది. 2019లో గ్రామ సచివాలయ వ్యవస్థ రాగా 2016లో ఈ రోడ్డు నిర్మాణానికి అనుకూలంగా గ్రామ పంచాయతీ ఇచ్చిన తీర్మానంలో గ్రామ సచివాలయమని సీల్‌(ముద్ర) ఉండడం విశేషం. ఆ తీర్మానంలో జిరాయితీ భూముల నుంచి రైతులు తమ సొంత ఖర్చులతో రోడ్డు నిర్మిస్తున్నట్లు పొందుపరిచారు. అప్పట్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు దీనిపై పంచాయతీ, రెవెన్యూ, కలెక్టర్‌ వరకు ఫిర్యాదులు చేశారు. 1.47 ఎకరాల విస్తీర్ణం కలిగిన పెద్ద బందలో 0.04 సెంట్లు, 3.01 ఎకరాల విస్తీర్ణం కలిగిన జగన్నాధ బందలో 0.08 సెంట్లు ఆక్రమించి రోడ్డు వేసినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. నోటీస్‌లు కూడా జారీ చేశారు. దీనిపై రోడ్డును తొలగించకుండా లేఅవుట్‌ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఇటీవల విచారణ కూడా పూర్తయింది. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని తహసీల్దార్‌కు కోర్టు సూచించింది. ఇదిలా ఉండగా మూడు రోజుల కిందట రెవెన్యూ అధికారులు ప్రభుత్వ (చెరువు) భూమిగా గుర్తించి సూచిక బోర్డులను ఏర్పాటు చేయడంపై స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డును తొలగించి బందలను(చెరువులను) పూర్వస్థితికి తీసుకొచ్చిన తరువాత ఈసూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఆ రోడ్డును తొలగించాలి

బందల స్థలంలో నిర్మించిన ఆ రోడ్డును తొలగించాలి. సాగు నీరు అందించే బందలను కప్పుతున్నప్పుడు రెవెన్యూ అధికారులు అడ్డుకోలేదు. కనీసం ఇప్పుడైనా పూర్వస్థితికి తీసుకురావాలి. చిన్న, సన్నకారు రైతులు ఆక్రమిస్తే వెంటనే తొలగించే అధికార యంత్రాంగం లేఅవుట్‌ యాజమాన్య విషయానికి వచ్చేసరికి కాలయాపన చేశారు. ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా రోడ్డు నిర్మాణానికి అవకాశం కల్పించారు. అప్పటి నుంచి ఈ సమస్యపై పోరాటం చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ సరైన పరిష్కారం చూపలేదు.

- ఇందుకూరి సుధారాణి, ఎంపీటీసీ, ముషిడిపల్లి, శృంగవరపుకోట మండలం

Updated Date - Jun 02 , 2026 | 11:57 PM