Share News

Occupied.. built buildings! ఆక్రమించి.. భవనాలు కట్టేసి!

ABN , Publish Date - Feb 19 , 2026 | 11:42 PM

Occupied.. built buildings! జామి-కొట్టాం రహదారిని ఆనుకుని కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూమి ఆక్రమణ అవుతుంటే గత ఏడాది రెవెన్యూశాఖ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసింది. ఇప్పుడు అందులో ఏకంగా భవనాలే నిర్మించేశారు. ఆగ్రహారం, ఇనాం భూముల్లో ఇళ్లు కట్టడానికి వీలు లేదని తెలిసి వేర్వేరు సర్వేనెంబర్లతో గజాల్లో రిజిష్ట్రేషన్‌ చేయించేసి దర్జాగా భవనాలు కట్టేసుకుంటున్నారు.

Occupied.. built buildings! ఆక్రమించి.. భవనాలు కట్టేసి!
గతంలో హెచ్చరిక బోర్డు వేసిన స్థలంలో సాగుతున్న నిర్మాణాలు

ఆక్రమించి.. భవనాలు కట్టేసి!

ప్రభుత్వ, కాలువ స్థలాల్లో ఆక్రమ కట్టడాలు

సర్వే నెంబర్లు మార్చేసి రిజిస్ట్రేషన్లు

పట్టించుకోని అధికారులు

జామి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి):

జామి-కొట్టాం రహదారిని ఆనుకుని కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూమి ఆక్రమణ అవుతుంటే గత ఏడాది రెవెన్యూశాఖ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసింది. ఇప్పుడు అందులో ఏకంగా భవనాలే నిర్మించేశారు. ఆగ్రహారం, ఇనాం భూముల్లో ఇళ్లు కట్టడానికి వీలు లేదని తెలిసి వేర్వేరు సర్వేనెంబర్లతో గజాల్లో రిజిష్ట్రేషన్‌ చేయించేసి దర్జాగా భవనాలు కట్టేసుకుంటున్నారు.

జామి నుంచి ఎస్‌.కోట మండలం కొట్టాం వెళ్లే రహదారిలో కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూమి ఆక్రమణదారుల పాలైంది. ప్రభుత్వ భూమితో పాటు జేఏ చానెల్‌ (జామి-అన్నంరాజుపేట కాలువ)ను కబ్జా చేసి బిల్డింగ్‌లు కట్టేశారు. గత ఏడాది ఇదే భూమిలో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. కొద్దిరోజులకే వాటిని ఆక్రమణదారులు పీకి పడేశారు. ఆ భూముల వెనుక ఉన్న సర్వేనెంబర్లు వేసి రిజిస్ట్రేషన్‌ చేయించేసుకుని భవనాలు నిర్మిస్తున్నారు. 60 అడుగులు ఉండే జేఏ చానెల్‌ కాలువ ఇప్పటికే కుంచించుకు పోయిందని, కాలువను మూసి నిర్మాణాలు చేయడంతో పెద్దఎత్తున వరదలు వస్తే పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

అధికారులు ఏమన్నారంటే

జేఏ చానెల్‌ ఆక్రమణ విషయంపై జేఈ సంతోష్‌ మాట్లాడుతూ చానెల్‌ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని, వాటిని స్వాధీనం చేసుకోవాలని ఈ ఏడాది జనవరిలో లేఖ రాశామన్నారు. సర్వే నెంబర్‌ 680లో పెద్దఎత్తున కట్టడం జరుగుతోందని తెలిసిందని, దీనిపై విచారించి ఆ స్థలం తమ శాఖకు అప్పగించాలని రెవెన్యూ, పంచాయతీ, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

పంచాయతీ ఈవో ప్రసాద్‌ మాట్లాడుతూ ఈ స్థలం విషయంపై తమకు ఫిర్యాదులు వచ్చాయని, పరిశీలించి లోపాలుంటే పంచాయతీ కఠిన చర్యలు చేపడతామన్నారు.

ఇదే విషయంపై తహసీల్దార్‌ కృష్ణంరాజు వివరణ కోరగా దీనిపై ఆర్‌ఐను నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు. ప్రభుత్వ భూములుగా నిర్దారణ అయితే స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆక్రమణ దారులపై చర్యలు చేపడతామని తెలిపారు.

Updated Date - Feb 19 , 2026 | 11:42 PM