Obstacles Right at the Beginning ఆదిలోనే అడ్డంకులు
ABN , Publish Date - May 04 , 2026 | 10:59 PM
Obstacles Right at the Beginning జిల్లాలో పెద్దగెడ్డ జలాశయం నుంచి పైప్‌లైన్ ద్వారా సాగునీరు అందించే పనులకు అవాంతరాలు వీడడం లేదు. ఆదిలోనే అడ్డంకులు ఎదురవు తున్నాయి. ఇప్పటికి నాలుగుసార్లు టెండర్లు పిలిచినా.. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఈ పైలెట్ ప్రాజెక్టు పట్టాలెక్కడం లేదు.
నాలుగుసార్లు టెండర్లు పిలిచినా.. ముందుకు రాని కాంట్రాక్టర్లు
పైలెట్ ప్రాజెక్టుకు మోక్షం కలగని వైనం
పార్వతీపురం, మే4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెద్దగెడ్డ జలాశయం నుంచి పైప్‌లైన్ ద్వారా సాగునీరు అందించే పనులకు అవాంతరాలు వీడడం లేదు. ఆదిలోనే అడ్డంకులు ఎదురవు తున్నాయి. ఇప్పటికి నాలుగుసార్లు టెండర్లు పిలిచినా.. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఈ పైలెట్ ప్రాజెక్టు పట్టాలెక్కడం లేదు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అండ్ వాటర్ పైలెట్ ప్రాజెక్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాను ఎంపిక చేశాయి. అయితే టెండర్ల ప్రక్రియలో కాంట్రాక్టర్లు పాల్గొనలేకపోవడంతో పనులకు మోక్షం కలగడం లేదు. వాస్తవంగా పాచిపెంటలో ఉన్న పెద్దగెడ్డ జలాశయం నుంచి పాచిపెంట మండలం, విజయనగరం జిల్లాలోని రామభద్రపురం మండలంలో 7,500 ఎకరాలకు పైపులైన్ ద్వారా సాగునీరు అందించాలని నిర్ణయించారు. దీని కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటా యించాయి. జీఎస్‌టీతో కలిపి రూ.73.50 కోట్ల అడ్మినిస్ర్టేటివ్ ఆమోదంతో టెండర్లను పిలిచారు. కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతంతో కలిపి.. సుమారు రూ.56 కోట్ల విలువైన పనులను చేపట్టాల్సి ఉంది. అయితే కొన్ని నెలలుగా ఇరిగేషన్, ఇంజనీరింగ్ శాఖాధికారులు టెండర్లను పిలుస్తున్నా ఫలితం ఉండడం లేదు. తొలుత మూడు సార్లు టెండర్లు పిలిచినా .. ఒక్క కాంట్రాక్టర్ కూడా పాల్గొనలేదు. నాలుగోసారి మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక కాంట్రాక్టర్ పాల్గొన్నారు. అయితే రూ. 56 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు గాను సుమారు 26 శాతం అధిక రేట్లకు టెండర్ వేశారు. దీంతో ఇరిగేషన్ శాఖాధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పైలెట్ ప్రాజెక్టు పనుల అంచనా విలువకు ఐదు శాతం వరకు మాత్రం అధికంగా టెండర్లు ఖరారు చేసే అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ శాతం ఉంటే.. టెండర్లు ఖరారు చేసే పరిస్థితి లేదు. దీంతో ఐదోసారి టెండర్లను పిలిచేందుకు ఇరిగేషన్, ఇంజనీరింగ్ శాఖాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. అయితే ఈ పనులు ఎవరు దక్కించుకుంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
పైపుల ధర పెరగడంతో..
సాగునీరు సరఫరాకు సంబంధించి సుమారు 18 కిలోమీటర్ల మేర పైపులు వేయాల్సి ఉంది. అయితే పశ్చిమాసియాలో తాత్కాలికంగా యుద్ధం ఆగినా.. పైపులు మాత్రం ధరలు అధికంగా పెరగడంతో ప్రభుత్వం నిర్ణయించిన ధర కాంట్రాక్టర్లకు గిట్టుబాటు కావడం లేదు. దీంతో వారు టెండర్లు వేసేందుకు ముందుకు రావడం లేదని తెలిసింది. ఏదేమైనా దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంత రైతులు కోరుతున్నారు.
ఐదోసారి టెండర్లను పిలుస్తున్నాం
ఎంసీఏ డీడబ్ల్యూఎం పనులకు సంబంధించి మూడుసార్లు టెండర్లు పిలిచినప్పటికీ ఎవరు ముందుకు రాలేదు. నాలుగోసారి 26 శాతం అధికంగా ఒక కంపెనీ టెండర్ దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం ఐదు శాతం కంటే ఎక్కువ రేట్లకు టెండర్ ఖరారు చేయలేం. అందువల్ల ఐదోసారి టెండర్లను పిలుస్తున్నాం.
- డి.సురేష్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇరిగేషన్‌శాఖ