Share News

Ceremony Dates Finalized ప్రమాణ స్వీకారాలకు ముహూర్తం ఖరారు

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:27 PM

Oath-Taking Ceremony Dates Finalized జిల్లాలో ఎంపీపీలు, జడ్పీ చైర్మన్‌ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు , 20న జడ్పీ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశాలు జారీ చేశారు. ఆయా తేదీల్లోనే జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణస్వీకారాలు చేయించాలని ఎన్నికల సంఘం సూచించిన షెడ్యూల్‌ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

  Ceremony Dates Finalized  ప్రమాణ స్వీకారాలకు  ముహూర్తం ఖరారు
జడ్పీ కార్యాలయం

  • జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో సమావేశాలు

పార్వతీపురం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎంపీపీలు, జడ్పీ చైర్మన్‌ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు , 20న జడ్పీ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశాలు జారీ చేశారు. ఆయా తేదీల్లోనే జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణస్వీకారాలు చేయించాలని ఎన్నికల సంఘం సూచించిన షెడ్యూల్‌ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 19న ఉదయం 10 గంటల్లోపు ప్రత్యేక సమావేశం అనంతరం ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను ఎన్నుకుంటారు. ఏకగ్రీవం కానిచోట మాత్రమే ఎన్నిక నిర్వహించి.. ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను ప్రకటిస్తారు. తర్వాత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రత్యేక అధికారులు వారికి స్వాగతం పలికి తమ బాధ్యతలు నుంచి తప్పుకోనున్నారు.

- గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీపీతో పాటు ఇద్దరు ఉపాధ్యక్షులు ఉండేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మండలానికి ఒకరే ఉపాధ్యక్షుడు ఉండాలని జీవోను జారీ చేశారు. దీంతో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీతో పాటు కోఆప్షన్‌ మెంబర్‌ను ఎన్నుకోవలసి ఉంది. మొత్తంగా ఈ నెల 19 నుంచి మండలాల్లో ఎంపీపీల పాలన ప్రారంభం కానుంది. కాగా మండల పరిషత్‌లకు ఈ నెల 5న ఎన్నికలు, 7న ఓట్లు లెక్కింపు నిర్వహించిన సంగతి తెలిసిందే.. 226 ఎంపీటీసీ స్థానాలకు గాను 123 టీడీపీ , జనసేన 37 , బీజేపీ 2 , వైసీపీ 62 , ఇతరులు 2 స్థానాల్లో గెలుపొందారు.

- ఎంపీపీలుగా ఎవరిని ఎన్నిక చేయాలోనే దానిపై ఆయా పార్టీలకు చెందిన అధిష్ఠానాలు నిర్ణయిస్తాయి. గుమ్మలక్ష్మీపురం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైసీపీకి ఏడు కూటమికి ఏడు స్థానాలు వచ్చాయి. దీంతో అక్కడ ఎంపీపీ పీఠం కోసం ఇరు పార్టీలు ప్రయత్నించే పరిస్థితి ఉంది. కొత్త నిబంధనల ప్రకారం.. ఎంపీతో పాటు ఎమ్మెల్యేలు ఓటు వేయలేని పరిస్థితి. దీంతో సమాన ఎంపీటీసీ సభ్యులు ఉన్న మండలాల్లో ఎంపీపీతో పాటు వైస్‌ ఎంపీపీ ఎన్నిక ‘నువ్వా-నేనా’ అనే విధంగా ఉండనుంది.

- జిల్లాలో కొత్తగా ఏర్పాటైన జిల్లా పరిషత్‌ పాలకవర్గం పాలన 20న ప్రారంభం కానుంది. తొలుత 15 మంది జడ్పీటీసీలతో సమావేశం నిర్వహిస్తారు. అదే రోజున సభ్యులతో ప్రమాణ స్వీకారం చేసి.. జడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కో-ఆప్షన్‌ సభ్యుడిని ఎన్నుకుంటారు. ఈ నెల 19, 20 తేదీల్లో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌, కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జడ్పీ సీఈవో సుధాకర్‌ తెలిపారు.

Updated Date - Nov 10 , 2026 | 11:27 PM