O Aditya Deva… ఆదిత్య దేవా.. ఆరోగ్యమివ్వు..
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:38 AM
O Aditya Deva… Grant Good Health జిల్లాలో సూర్యనామం మర్మోగింది. ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామిని భక్తిశ్రద్ధలతో ప్రజలు కొలిచారు. ఆదివారం రథసప్తమిని ఘనంగా జరుపుకున్నారు.
భక్తులతో సూర్యపీఠం కిటకిట
స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు
వైభవంగా కల్యాణోత్సవం
పార్వతీపురం టౌన్, జనవరి 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సూర్యనామం మర్మోగింది. ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామిని భక్తిశ్రద్ధలతో ప్రజలు కొలిచారు. ఆదివారం రథసప్తమిని ఘనంగా జరుపుకున్నారు. క్షీరాన్నం, పంచామృతం, ఇతర వంటకాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మరికొందరు ఆలయాలకు వెళ్లి విశేష పూజలు, అర్చనలు చేశారు. పార్వతీపురం పట్టణ శివారులో ఉన్న సూర్యపీఠానికి భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 15 వేల మందికి పైగా తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచే భక్తజనం తాకిడి కనిపించింది. గంటల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షించిన అనంతరం వారు ఆదిత్యుడిని దర్శించుకుని పులకించిపోయారు. ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఊంజల్, పూలంగి సేవలు..
సూర్య పీఠంలో ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతి వేమకోటి నరహరశాస్త్రి ఆధ్వర్యంలో ఆదిత్యునికి సుప్రభాత, ప్రాతఃకాలార్చన నిర్వహించారు. ఉదయం 8 గంటలకు సౌర దీక్షలు చేపట్టిన వారితో పాటు దంపతులతో స్వామి వారికి క్షీరాభిషేకాలు చేశారు. ఉదయం 10 గంటలకు సూర్య భగవానుడి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపాలంకరణ చేశారు. అనంతరం స్వామి వారికి ఊంజల్, పూలంగి సేవ కార్యక్రమం జరిపారు. రాత్రి 7 గంటల నుంచి సత్యసాయి సేవా సమితి సభ్యులతో భజన, వికాస తరంగిణి సభ్యులతో సామూహిక విష్ణు సహస్ర నామా స్త్రోత పారాయణాలు చేపట్టారు. రాత్రి 8 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమంతో సూర్య జయంతి వేడుకలు ముగిశాయి.
ఆదిత్యుని కల్యాణోత్సవంలో హై కోర్టు జడ్జి
సూర్యపీఠంలో వేంచేసిన ఆదిత్యుడిని హైకోర్టు జడ్జి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారికి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఆయన వెంట జిల్లా కోర్టు న్యాయాధికారి దామోదరరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బెలగాం జయప్రకాష్ నారాయణ, ఉత్సవ కమిటీ సభ్యులు పి.వెంకటనాయుడు, డి. వెంకటనాయుడు, మల్లేశ్వరరావు, తదితరులు ఉన్నారు.