చిన్నారులకు బలమైన ఆహారం
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:12 AM
అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను చేపడుతోంది.
- అంగన్‌వాడీ కేంద్రాల్లో మారిన మెనూ
- రక్తహీనత, పోషకాహార లోపాన్ని అధిగమించడమే లక్ష్యం
- పూర్వప్రాథమిక చేరికలకు దోహదం
రాజాం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో పోషకాహారం లోపం నియంత్రించడమే లక్ష్యంగా పలు సంస్కరణాలను తీసుకొచ్చింది. అందులో భాగంగా మెనూలో సమూల మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటికే గర్భిణులు, శిశువులు, బాలింతల విషయంలో ప్రత్యేక ఆహార మెనూను పాటిస్తోంది. క్రమం తప్పకుండా కోడిగుడ్లు, పాలు, ఇతరత్రా ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా అందిస్తోంది. ఇందుకుగాను ప్రత్యేక యాప్‌ను వినియోగిస్తోంది. పౌష్టికాహారం అందించడమే కాదు. సక్రమంగా అందుతుందా? లేదా? అని కూడా ఆరాతీస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు పూర్వ ప్రాథమిక విద్యకుగాను కేంద్రాలకు వస్తున్న వారిపై కూడా ప్రత్యేకంగా దృష్టిపెట్టి ఆహారాన్ని అందించాలని నిర్ణయించింది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 2,500 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నా యి. ఆరు నెలల్లోపు చిన్నారులు 6,113 మంది, ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు 35,163 మంది, మూడేళ్ల నుంచి 6 సంవత్సరాల్లోపు పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న వారు 15,475 మంది ఉన్నారు. వీరికి మాత్రం కేంద్రాల్లోనే ఆహారం తయారుచేసి పెడుతున్నారు. చిన్నారు లు మరింత ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేందుకు తగినంతగా ప్రొటీన్లు, ఐరన్‌తో కూడిన ఆహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రుచికరమైన ఆహారం అందించడం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు పిల్లలు పెరిగే అవకాశం ఉంది. రక్తహీనత, పోషకాహార లోపాన్ని సైతం కొంతవరకూ అధిగమించవచ్చు.
సమూల మార్పులు..
ఆహార మెనూలో సమూల మార్పులు తీసుకొచ్చారు. మంగళవారం, శనివారం ఎగ్‌ఫైడ్‌రైస్ అందించాలని నిర్ణయించారు. ఉడికించిన శనగలను వారంలో రెండురోజుల పాటు ఉదయం పూట అల్పాహారంగా అందిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం పోషకాహారం అందేలా 100 మిల్లీలీటర్ల పాలను అందిస్తున్నారు. అన్నం, పప్పుతో పాటు కూరను మధ్యాహ్న భోజనంగా తినిపిస్తున్నారు. మునగాకు న్యూట్రీషియన్ పొడిని సైతం అందిస్తున్నారు. మునగాలో విటమిన్ ఏ, కాల్షియం, ఐరన్ ఉంటాయి. పిల్లల కంటిచూపు, జీర్ణ వ్యవస్థ మెరుగుకు, ఎముకులు, దంతాల పటుత్వానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఉదయాన్నే శనగలు, రాగిజావ, పాలు ఇవ్వడం ద్వారా చిన్నారుల శారీరక ఎదుగుదల, బాగుంటుంది. రోజంతా చురుగ్గా కూడా ఉంటారు.