Share News

Number one in employment ఉపాధిలో నంబరువన్‌

ABN , Publish Date - May 21 , 2026 | 12:12 AM

Number one in employment ఉపాధి హామీ పథకం అమలులో జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. అధిక సంఖ్యలో వేతనదారులకు పని కల్పించడం ద్వారా ఈ గుర్తింపు సాధించింది. రోజూ సుమారు 2.43 లక్షల మంది పనులకు హాజరవుతున్నారు. జలధార-జలహారతి కింద పనులను ముమ్మరంగా చేపడుతున్నారు. ఫిష్‌ పాండ్ల అభివృద్ధి భవిష్యత్‌లో వ్యవసాయానికి ఇతోధికంగా దోహదపడనుంది.

Number one in employment ఉపాధిలో నంబరువన్‌
ఉపాధి హామీ పనుల్లో వేతనదారులు

ఉపాధిలో నంబరువన్‌

రాష్ట్రంలో జిల్లాకు ప్రథమ స్థానం

అధిక సంఖ్యలో వేతనదారులకు పని కల్పన

రోజుకు సుమారు 2.43 లక్షల మంది హాజరు

చురుగ్గా ఫిష్‌పాండ్ల అభివృద్ధి

విజయనగరం కలెక్టరేట్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం అమలులో జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. అధిక సంఖ్యలో వేతనదారులకు పని కల్పించడం ద్వారా ఈ గుర్తింపు సాధించింది. రోజూ సుమారు 2.43 లక్షల మంది పనులకు హాజరవుతున్నారు. జలధార-జలహారతి కింద పనులను ముమ్మరంగా చేపడుతున్నారు. ఫిష్‌ పాండ్ల అభివృద్ధి భవిష్యత్‌లో వ్యవసాయానికి ఇతోధికంగా దోహదపడనుంది.

జిల్లాలోని ఫిష్‌ పాండ్లలో మొత్తం 1,265 పనులను గుర్తించగా 1,068 పనులకు పరిపాలన అనుమతులు లభించాయి. ప్రస్తుతం 146 పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. మరో 51 పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం కనీసం 60 శాతం పనులను వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేటాయించాలి. ఇందులో భాగంగానే చేపల చెరువుల తవ్వకం పనులను చురుగ్గా చేపట్టారు. వేసవి కాలంలో ఇతర వ్యవసాయ పనులు లేకపోవడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులకు వేతనదారుల నుంచి భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఈ తరుణంలో శ్రామికులకు చేతి నిండా పని కల్పిస్తూనే మరో వైపు భూగర్భ జల మట్టాలను పెంచాలనే ద్వంద్వ లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప్రతి మండలంలో ఈ ఫిష్‌ పాండ్‌ పనులను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. గతంలో బొబ్బిలి మండలం పారాది గ్రామ పంచాయతీలో తవ్విన చేపల చెరువు ద్వారా అద్భుతమైన ఫలితాలు రాగా అదే అనుభవంతో ఇప్పుడు చాలా మండలాల్లో ఈ పనులు ముమ్మరంగా సాగిస్తున్నారు. వర్షాకాలం నాటికి ఈ ఫిష్‌ పాండ్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేయనున్నారు. తద్వారా వర్షపు నీటిని సమర్థంగా సంరక్షించి, భూగర్భ జలాలను పెంపొందించడానికి వీలు కలుగుతుంది.

Updated Date - May 21 , 2026 | 12:12 AM