Governance ఇక ‘ ప్రత్యేక ’ పాలన
ABN , Publish Date - Mar 17 , 2026 | 11:50 PM
Now ‘Special’ Governance జిల్లాలో పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఇక ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానుంది. వైసీపీ పాలకవర్గాల పదవీ కాలం మంగళ వారంతో ముగియడంతో బుధవారం ప్రత్యేకాధికారులు కొలువుదీరనున్నారు.
పార్వతీపురం, మార్చి17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఇక ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానుంది. వైసీపీ పాలకవర్గాల పదవీ కాలం మంగళ వారంతో ముగియడంతో బుధవారం ప్రత్యేకాధికారులు కొలువుదీరనున్నారు. పార్వతీపురం పుర పాలక సంఘానికి జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సాలూరు మునిసిపాలిటీకి పార్వతీపురం సబ్ కలెక్టర్ వైశాలి ప్రత్యేకాధికారులుగా నియామకమైన సంగతి తెలిసిందే. కాగా మంగళవారం పాలకొండ నగర పంచాయతీ ప్రత్యేకాధికారిగా సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ విధుల్లో చేరారు. పాలకొండలో కొన్ని నెలల కిందట చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి పార్టీ నేతలు కైవసం చేసుకున్నారు. జిల్లాలో మిగతా రెండు పురపాలక సంఘాల్లో కొనసాగుతున్న వైసీపీ పాలకవర్గాల పదవీకాలం మాత్రం నేటితో ముగిసింది. మొత్తంగా ఇక ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లావాసులు వారిపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా తాగునీరు, పారిశుధ్యం తదితర సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని కోరుతున్నారు.
అభివృద్ధి, సంక్షేమంపై దిశానిర్దేశం
సాలూరు రూరల్, మార్చి 17(ఆంధ్రజ్యోతి): సాలూరు మునిసిపల్ అభివృద్ధి, ప్రజాసంక్షేమంపై ప్రత్యేకాధికారి, పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి మంగళవారం అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పార్వతీపురంలోని తన కార్యాలయంలో మునిసిపల్ కమిషనర్ రత్నకుమార్, ఆర్వో ఆశీష్‌కుమార్, డీఈ ప్రసాద్, శానిటరీ ఇన్స్‌పెక్టర్ లావేటి బాలకృష్ణతో చర్చించారు. స్వచ్ఛ సర్వే క్షణ్‌లో ఉత్తమ ర్యాంక్ సాధనకు కృషి చేయాలన్నారు. పట్టణంలో శానిటేషన్ మెరుగ్గా ఉండేలా చూడాలని సూచించారు. మొండి బకాయిల వసూలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలన్నారు.