Now, 4 rows. ఇక 4 వరుసలు
ABN , Publish Date - Oct 08 , 2026 | 10:55 PM
Now, 4 rows. అదో అంతర్రాష్ట్ర రహదారి. ఒడిశా, చత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుంచి పార్వతీపురం, బొబ్బిలి, రామభద్రపురం మీదుగా శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం చేరుకునే ఆ రహదారిలో భారీ వాహనాలు నిత్యం గొలుసుకట్టుగా రాకపోకలు సాగిస్తుంటాయి.
ఇక 4 వరుసలు
చిలకపాలెం-రామభద్రపురం- రాయగడ (సీఆర్‌ఆర్) రోడ్డుకు మహర్దశ
60 అడుగులకు విస్తరణ..డీపీఆర్ సిద్ధం
రూ.863 కోట్లతో 131 కి.మీ. మేర పనులు
అదో అంతర్రాష్ట్ర రహదారి. ఒడిశా, చత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల నుంచి పార్వతీపురం, బొబ్బిలి, రామభద్రపురం మీదుగా శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం చేరుకునే ఆ రహదారిలో భారీ వాహనాలు నిత్యం గొలుసుకట్టుగా రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలో చిన్న వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగిస్తున్నారు. రోడ్డ ఇరుకు వల్ల గమ్యం చేరే వరకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొంటున్నారు. ఇకపై ఆ పరిస్థితి ఉండబోదు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 60 అడుగులకు (నాలుగు లైన్లు)విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.863 కోట్లతో 131 కి.మీ. మేర పనులు త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉంది.
బొబ్బిలి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి):
చిలకపాలెం-రామభద్రపురం-బొబ్బిలి-పార్వతీపురం-రాయగడ రాష్ర్టీయ రహదారి మొత్తం పొడవు 131 కిలోమీటర్లు. రామభద్రపురం నుంచి రాజాం వరకు(40కిలోమీటర్లు) మినహా మిగిలిన రహదారంతా ప్రమాదకరంగా మారింది. ఇరుకైన రోడ్డులో ఎక్కడికక్కడే గోతులతో నిండిపోయింది. నిత్యం ప్రమాదాలకు కేరాఫ్‌గా పేరొందింది. వర్షాకాలంలో భారీ వాహనాలు గోతుల్లో దిగబడిపోవడం.. ట్రాఫిక్ స్తంభించడం సర్వసాధారణమైపోయింది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లైన్లుగా విస్తరణకు నిర్ణయించింది. రూ.863 కోట్లతో పీపీపీ విధానంలో పనులు చేపట్టేందుకు డీపీఆర్‌ను రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు రోడ్లను ప్రాఽధాన్యంగా తీసుకోగా వాటిలో ఈ రోడ్డును కూడా చేర్చింది. దీంతో మూడు జిల్లాలకు చెందిన ప్రజలు, సరిహద్దు ఒడిశా రాష్ట్ర ప్రజలకు మేలు జరుగనుంది. ఈ రహదారి రాజాం, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపల్ పట్టణాలు, రామభద్రపురం, సీతానగరం వంటి మేజర్ పంచాయతీల మీదుగా వెళుతుంది. ఈ రహదారిలో అన్ని రకాల వాహనాలతో పాటు భారీ వాహనాల రాకపోకలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. రోడ్డు సామర్థ్యానికి మించిన బరువుతో వాహనాలు పెద్దసంఖ్యలో రాకపోకలు సాగిస్తుండడంతో రోడ్డు మరింతగా పాడవుతోంది. గుంతల్లో పడి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. బొబ్బిలి మీదుగా విశాఖ పోర్టుకు, స్టీల్‌ప్లాంట్‌కు వెళ్లే భారీ వాహనాలు కూడా ఈ రోడ్డుపై కొంతవరకు రాకపోకలు సాగిస్తున్నాయి. బొబ్బిలి గ్రోత్‌సెంటరు నుంచి కూడా భారీ వాహనాలు వెళుతున్నాయి. వీటి ప్రభావంతో ఆటోలు, టూవీలర్లు, కార్ల వాహనదారులు బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది. గతంలో రోజుకు దాదాపు పదివేల వాహనాలు తిరిగేవి. నేడు సుమారు 20 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. దీంతో నిత్యం ప్రమాదకర పరిస్థితుల నడుమ జనజీవనం సాగుతోంది.
- చిలకపాలెం నుంచి బొబ్బిలి, పార్వతీపురం వెళ్లడానికి ప్రస్తుతం మూడు గంటలకు పైగా సమయం పడుతోంది. 4 లేన్ రోడ్డు వస్తే ఆ సయమం దాదాపుగా సగానికి తగ్గిపోతుంది. రాయగడలో ప్రముఖ పుణ్యక్షేత్రం మజ్జిగౌరమ్మ ఆలయానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వెళుతుంటారు. అలాంటి వారికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. రోడ్లు బాగోలేని కారణంగా భక్తులు రైళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. బొబ్బిలి, రామభద్రపురం ప్రాంతాలలో పండే కూరగాయలు, ఇతర పంటలను రాయగడ, శ్రీకాకుళం మార్కెట్‌లకు తరలించడానికి రవాణా కూడా సులభం అవుతుంది.
- ఈ రోడ్డును 20 మీటర్లకు (60 అడుగులు) విస్తరించే ప్రతిపాదన అమలు జరిగితే దారి పొడవునా సుమారు వందకిలోమీటర్లకు పైగా భూముల ధరలు గణనీయంగా పెరుగుతాయి. రోడ్డు నిర్మాణ సమయంలో స్థానికులు ఉపాధి కలుగుతుంది. వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రోడ్డు పొడవునా ఉన్న ప్రాంతాల ప్రజలు విస్తరణపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.