పల్లె పోరుకు నేడే నోటిఫికేషన్
ABN , Publish Date - Nov 13 , 2026 | 12:20 AM
జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది.
- తొలి విడత ఆరు మండలాల్లో నిర్వహణ
- 227 పంచాయతీలు, 2,026 వార్డులకు ఎన్నికలు
-2,046 పోలింగ్ కేంద్రాలు కేటాయింపు
-ఓటర్లు 2,88,004 మంది
పార్వతీపురం, నవంబరు 12 (ఆంధ్రజ్యో తి): జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. మొదటి దశ పంచాయతీ పో రుకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 15 నుంచి 17 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అనంతరం 21వ తేదీ వరకూ ఉపసంహరణకు గడువు ఇస్తారు. అదే రోజు సాయంత్రం అభ్య ర్థుల తుదిజాబితా ప్రకటిస్తారు. మొదటి విడత పోలింగ్ ఈనెల 26న జరగనుంది. అదేరోజే మధ్యాహ్నం 3 గంటల తర్వాత కౌంటింగ్ నిర్వ హిస్తారు. మొదటి దశలో 227 పంచాయతీలతో పాటు 2,026 వార్డులకు ఎన్నికలు జరగను న్నాయి. 2,046 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,88,004 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,39,422 మంది, మహిళా ఓటర్లు 1,48, 529 మంది, ఇతరులు 53 మంది ఉన్నారు.
ఆరు మండలాల్లో..
మొదటి దశ ఎన్నికలు పాలకొండ డివిజన్ పరిధిలోని భామిని, సీతంపేట, పాలకొండ, వీర ఘట్టం, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలా ల్లో జరగనున్నాయి. వీటి పరిధిలో 227 పంచాయతీలు ఉన్నాయి.
పార్టీలకు ప్రతిష్ఠాత్మకమే..
జిల్లాలో పంచాయతీ పోరును ప్రధాన రాజ కీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనున్నాయి. ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపుబావుట ఎగురవేశారు. 162 ఎంపీటీసీ, 10 జడ్పీటీసీ స్థానాల్లో గెలుపొందారు. వైసీపీ కేవలం ఐదు జడ్పీటీసీ, 62 ఎంపీటీసీ స్థానాలకే పరిమితమైంది. ఇవి కూడా కూటమి పార్టీల్లో కుమ్ములాట్ల కారణంగానే వైసీపీకి దక్కాయి. అయితే, ఈసారి పంచాయతీ ఎన్నికల్లో సత్తాచాటాలని వైసీపీ భావిస్తుండగా, మునిపల్, పరిషత్ ఫలితాలే వస్తాయని కూటమి అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఒక్కొక్క పంచాయతీ నుంచి అనేక మంది కూటమి నాయకులు సర్పంచ్ స్థానంపై ఆశలు పెట్టుకున్న పరిస్థితి జిల్లాలో ఉంది. దీనిపై పార్టీల పెద్దలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి కూటమి నేతల మధ్య సఖ్యత కుదర్చాల్సిన అవసరం ఉంది. అప్పుడే కూటమి మద్దతుదారులే విజయం సాధిస్తారు. లేదంటే వైసీపీ లాభపడే అవకాశం ఉంది.
పకడ్బందీగా నిర్వహించాలి
- ఇప్పటి నుంచే ఏర్పాట్లు పూర్తి చేయాలి: ఎస్‌ఈసీ
బెలగాం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 26న గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనీల్‌చంద్రపునేఠా ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో ఆయ న గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. ఇప్పటి నుంచే ఏర్పాట్లు పూర్తి చేయా లని ఆదేశించారు. నామినేషన్ల ప్రక్రియలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బెదిరింపులకు పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎటువం టి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాకు సం బంధించి బందోబస్తు వివరాలకు ఎస్పీ మాధవరెడ్డి వివరించారు.