Share News

కట్టుబట్టలే మిగిలాయి

ABN , Publish Date - Nov 14 , 2026 | 12:36 AM

ఆ కుటుంబం రోజువారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

కట్టుబట్టలే మిగిలాయి

  • చంద్రంపేటలో పూరిల్లు దగ్ధం

  • రోడ్డున పడిన కుటుంబం

గంట్యాడ, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఆ కుటుంబం రోజువారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. సొంత ఇల్లు లేకపోవడంతో ఓ తోటలో పూరిగుడిసె వేసుకుంటూ నివసిస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధమవడంతో ఆ కుటుంబం కట్టుబట్టల తో మిగిలింది. ఈ ఘటన చంద్రంపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రంపేటకు చెందిన విభూది మల్లయ్య, నూకరత్నం దంపతులు తన ఇద్దరి పిల్లలతో కలిసి గ్రామ శివారులో గల ఓ తోటలోని చిన్న పూరిపాకలో నివశిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఇంటిలో దీపం వెలిగించి సమీపంలో ఉన్న పుట్ట వద్దకు పూజించేందుకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి పూరిపాక కాలి బూడిదైంది. ఇంట్లో ఉన్న నగదు, దుస్తులు, వంట సామగ్రి, పాత్రలు, ఆధార్‌ కార్డులు, బ్యాంకు పుస్తకాలు, పిల్లల పుస్తకాలు కాలి బూడిదయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు అంతా రోడ్డున పడ్డారు. అందిన ఫిర్యాదు మేరకు వీఆర్వో రొంగళి సూర్యసన్నిబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు.

Updated Date - Nov 14 , 2026 | 12:36 AM