not working pattu industry ‘పట్టు’ వదిలేశారు
ABN , Publish Date - Sep 20 , 2026 | 11:39 PM
not working pattu industry రాజాంలో పట్టు పురుగుల కేంద్రాన్ని గాలికొదిలేశారు. దానికున్న ప్రాధాన్యతను, అవసరాన్ని ప్రభుత్వాలు ఎప్పుడో విస్మరించాయి. ఫలితంగా ఉత్సవ విగ్రహంలా మారింది. పైగా విలువైన భూమిపై అక్రమార్కుల కన్నుపడింది. గతంలో పదుల సంఖ్యలో సిబ్బంది, 70 మంది వరకూ కార్మికులు పనిచేసేవారు.
‘పట్టు’ వదిలేశారు
కళతప్పిన పట్టుపురుగుల కేంద్రం
ఏళ్ల తరబడి నిరుపయోగం
తొమ్మిదేళ్ల కిందట మూత
తెరిచే ప్రయత్నాలు చేయని ప్రభుత్వాలు
రాజాం, సెప్టెంబరు20 (ఆంధ్రజ్యోతి):
రాజాంలో పట్టు పురుగుల కేంద్రాన్ని గాలికొదిలేశారు. దానికున్న ప్రాధాన్యతను, అవసరాన్ని ప్రభుత్వాలు ఎప్పుడో విస్మరించాయి. ఫలితంగా ఉత్సవ విగ్రహంలా మారింది. పైగా విలువైన భూమిపై అక్రమార్కుల కన్నుపడింది. గతంలో పదుల సంఖ్యలో సిబ్బంది, 70 మంది వరకూ కార్మికులు పనిచేసేవారు. క్రమేపీ సిబ్బంది పదవీ విరమణ చేశారు. కాంట్రాక్టు సిబ్బందిని తొలగించేశారు. ఆపై నిర్వహణను ప్రభుత్వాలు గాలికొదిలేయడంతో ఈ కేంద్రం పూర్తిగా నిరుపయోగంగా మారింది. ఈ కేంద్రాన్ని పరిసర ప్రాంతాలలో ఉన్నవారు సొంతానికి వినియోగించుకుంటున్నారు. ఇక్కడ నియమించిన ఏఎస్‌వో జాడ కూడా కనిపించడం లేదు. కేంద్రానికి పూర్వ వైభవం తెచ్చే ఆలోచనే ప్రభుత్వాలకు లేదనేది అందరి నుంచి వినిపిస్తున్న మాట.
మూడు దశాబ్దాల కిందట..
రాజాం వస్త్రపురి కాలనీలో పట్టుపురుగుల కేంద్రానికి అప్పట్లో ప్రభుత్వం రెండు ఎకరాలను కేటాయించింది. 1993 అక్టోబరు 10న అప్పటి యువజన సంక్షేమ క్రీడలు స్వయం ఉపాధి శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. భవనంతో పాటు పట్టు పురుగుల పెంపకానికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ సాగుకు స్థలం కూడా కేటాయించారు. ఆ స్థలంలో బావి ఏర్పాటుచేశారు. బోరు కూడా తవ్వించారు. చాలా ఏళ్ల పాటు పరిశ్రమ బాగానే పనిచేసింది. 30 మంది వరకూ అక్కడ పనిచేసేవారు. కానీ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ కేంద్రంలో ఆధునిక సౌకర్యాలు ఏర్పాటుచేయకపోవడం, సిబ్బంది పదవీవిరమణ చేసినా వారి స్థానంలో కొత్తవారి నియామకం లేకపోవడం, నిధుల కొరత కారణంగా పూర్తిగా ఈ కేంద్రం నీరసించి పోయింది. తొమ్మిదేళ్ల కిందట పూర్తిగా మూతపడింది. ఈ కేంద్రం సమీపంలో బోరు ఏర్పాటు చేసి మల్బరీ సాగుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పేవారు. కానీ పూర్తిగా గాలికి వదిలేసారు.
తొలిరోజుల్లో..
తొలి రోజుల్లో ఒక సూపర్‌వైజర్, ఇన్‌స్పెక్టర్లు, నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లు ఉండేవారు. వారిలో చాలా మంది పదవీ విరమణ చేశారు. మరికొందరు ఇక్కడ నుంచి బదిలీపై వెళ్లిపోయారు. క్రమేపీ కేంద్రం కళ తప్పింది. నిర్వహణకు నిధులు రాకపోవడంతో తిరోగమనంలో పడింది. ఈ కేంద్రం పూర్తిస్థాయిలో వినియోగంలో ఉన్నప్పుడు రాజాం, రేగిడి, సంతకవిటి, వంగరలో మల్బరీ సాగుకు ఎంతగానో ప్రోత్సాహం అందేది. ఇక్కడ పెంచి సేకరించిన మల్బరీ ఆకులను సీతంపేట తీసుకెళ్లి విక్రయించేవారు. రైతులు కూడా పట్టు పెంపకంపై ఎంతగానో ఆసక్తి చూపేవారు. పేదలకు ఉపాధి బాగా దొరికేది. ప్రస్తుతం ఈ కేంద్రాన్ని పూర్తిగా విదిలేశారు. బావిలోని మోటారు దొంగలపాలైంది. అధికారుల పర్యవేక్షణ లేక విలువైన స్థలం ఆక్రమణలకు గురవుతోంది. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కేంద్రానికి సంబంధించి కంచె దాటి నిర్మాణాలు చేపడుతున్నారు. కార్యాలయ పర్యవేక్షణకు ఒక టెక్నికల్ అసిస్టెంట్‌ను నియమించినట్టు తెలుస్తోంది. అయినా పర్యవేక్షణ లేక ఈ కేంద్రం పూర్తిగా నీరుగారిపోయింది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
సిబ్బంది ఎక్కడో?
స్థలం ఆక్రమణలకు గరికాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ కొంతమంది సిబ్బందిని నియమించారు. మళ్లీ పూర్వవైభవం తీసుకువస్తామని అధికారులు చెప్పేవారు. అయితే ఇక్కడ నియమించిన సిబ్బంది జాడే కనిపించడంలేదు. అక్కడ నివాసం ఉంటున్న కొంతమంది ఆ భవనంను సొంతపనులకు వాడుకుంటున్నారు.
ప్రత్యేక దృష్టి
పట్టుపురుగుల కేంద్రంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాం. దీని విషయంపై ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే మరమ్మతులు చేపట్టడానికి చర్యలు తీసుకుంటాం. గతంలో సెరీకల్చర్ విభాగంలో జిల్లా వ్యాప్తంగా 70 మంది వరకు అధికారులు, సిబ్బంది పని చేసేవారు. విజయనగరం జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం జిల్లాలకు సిబ్బందిని సర్దుబాటు చేయాల్సి వస్తోంది. సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. పదవీ విరమణ చేసిన వారి స్థానంలో కొత్తవారిని నియమించకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. ఇక్కడి కేంద్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందించాం. భూమి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. మల్బరీ సాగుకు ప్రాధాన్యం ఇస్తాం.
- సాల్మాన్‌రాజు, ఏడీ, సెరీకల్చర్, విజయనగరం