not working apps ‘యాప్’సోపాలు!
ABN , Publish Date - May 13 , 2026 | 12:19 AM
not working apps ఐసీడీఎస్ వ్యవస్థలో గత ప్రభుత్వ వైఫల్యాలు ఇంకా వెంటాడుతునే ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన బాలసంజీవిని యాప్ 2.0 సక్రమంగా పనిచేయడం లేదు.
‘యాప్’సోపాలు!
అంగన్‌వాడీ కేంద్రాల్లో ముఖ హాజరు చిక్కులు
సాంకేతిక సమస్యలతో నమోదుకాని వైనం
లబ్ధిదారులతో పాటు సిబ్బందికీ ఇక్కట్లు
జిల్లా వ్యాప్తంగా అదే పరిస్థితి
రాజాం, మే 12 (ఆంధ్రజ్యోతి):
ఐసీడీఎస్ వ్యవస్థలో గత ప్రభుత్వ వైఫల్యాలు ఇంకా వెంటాడుతునే ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన బాలసంజీవిని యాప్ 2.0 సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో ముఖహాజరు వేసుకునేందుకు లబ్ధిదారులు, అంగన్‌వాడీ సిబ్బంది అపసోపాలు పడుతున్నారు. గత ప్రభుత్వం రెండు, మూడు యాప్‌లను తీసుకొచ్చింది. వాటి పనితీరు సరిగ్గా లేకపోవడం, భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఏడాది కిందట కూటమి ప్రభుత్వం బాలసంజీవిని యాప్ 2.0ను ప్రారంభించింది. అయితే దీనికి సాంకేతిక సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. అటు లబ్ధిదారులకు, ఇటు అంగన్‌వాడీ సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు.
జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. 2,206 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. 293 మినీ కార్యాలయాలు ఉన్నాయి. 2,469 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు కొనసాగుతున్నారు. 7,924 మంది గర్భిణులు కేంద్రాల్లో సేవలు పొందుతున్నారు. మరో 7 వేలకుపైగా బాలింతలు, 80 వేలమంది పిల్లలు పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. మహిళలు గర్భం దాల్చిన తరువాత 15 నుంచి 20 రోజులకు ఈ యాప్‌లో నమోదుకావాలి. వారి వివరాలను బాల సంజీవని, పోషక్ ట్రాకర్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. తరువాత నెలలో పోషకాహార కిట్లతో పాటు సరుకులు అందిస్తారు.
కిట్ల పంపిణీపై ప్రభావం..
సాంకేతిక సమస్యలతో సరిగ్గా కిట్లు అందించలేకపోతున్నారు. ఆయా తేదీలు దాటినా.. సాంకేతిక సమస్యలతో నమోదు ఆగినా కిట్లు రావడం లేదని లబ్ధిదారులు గోల చేస్తున్నారు. గర్భిణుల వివరాలను నమోదుచేసినపడు సాంకేతిక కారణాలతో సమాచారాన్ని యాప్ తీసుకోవడం లేదు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్య ఉంది. అధిక లోడుతో కూడిన యాప్ కావడంతో స్మార్ట్‌ఫోన్లు సపోర్టు చేయడం లేదు. చివరకు అంగన్‌వాడీ సిబ్బంది హాజరు నమోదు విషయంలోనూ ఇబ్బందులు తప్పలేదు. పోషకాహార కిట్లు అందించేందుకు పోషక్ ట్రాకర్ యాప్‌లో వివరాలను నమోదుచేయాలి. ఈ క్రమంలో ఆధార్ కూడా తప్పనిసరి. కానీ ఆధార్ అనుసంధానం కావడం లేదు. ఈకేవైసీ సమయంలో మిస్ మ్యాచ్ అని వస్తోంది. దీంతో అంగన్‌వాడీ సిబ్బందికి ఏంచేయాలో పాలుపోవడం లేదు. మరోవైపు సేవలు, పోషకాహార కిట్లు అందకపోవడంతో సిబ్బందికి లబ్ధిదారుల నుంచి నిలదీతలు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా ఈ సమస్యలపై ఉన్నతాధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
ఉన్నతాధికారులకు చెప్పాం
యాప్‌లో సాంకేతిక సమస్యలపై అంగన్‌వాడీ సిబ్బంది నుంచి ఫిర్యాదులు వస్తున్న మాట నిజమే. అందుకే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సమస్య ఉంది. తప్పకుండా దీనికి ప్రభుత్వం పరిష్కార మార్గం చూపుతుంది.
- రుక్సానా బేగం, ఐసీడీఎస్ పీడీ, విజయనగరం
------------------