Share News

not records రికార్డుల్లేవంట!

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:31 PM

not records మెంటాడ మండలంలోని గుర్లగెడ్డ మినీ రిజర్వాయర్‌ భూముల ఆక్రమణ వ్యవహారం కొత్తమలువు తిరిగింది. ఈ జలాశయం ఎర్త్‌ బండ్‌కు సంబంధించిన 18 ఎకరాల భూమి వివరాలు అటు రెవెన్యూ, ఇటు ఇరిగేషన్‌ రికార్డుల్లో లేవని తేలిపోయింది. తాజాగా సర్వే నిర్వహించిన అధికారులే చావుకబురు చల్లగా చెప్పినట్టు ఈ విషయాన్ని వెల్లడించారు.

not records రికార్డుల్లేవంట!
ఆక్రమణకు గురైన రిజర్వాయర్‌ భూమి

రికార్డుల్లేవంట!

చేతులెత్తేసిన రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు

గుర్లగెడ్డ మినీ రిజర్వాయర్‌ భూముల కబ్జాల్లో కొత్త ట్విస్ట్‌

యంత్రాంగం తీరుపై రైతుసంఘాల నిరసన

ఆక్రమణలపై పోరు ఆగదని స్పష్టీకరణ

మెంటాడ మండలంలోని గుర్లగెడ్డ మినీ రిజర్వాయర్‌ భూముల ఆక్రమణ వ్యవహారం కొత్తమలువు తిరిగింది. ఈ జలాశయం ఎర్త్‌ బండ్‌కు సంబంధించిన 18 ఎకరాల భూమి వివరాలు అటు రెవెన్యూ, ఇటు ఇరిగేషన్‌ రికార్డుల్లో లేవని తేలిపోయింది. తాజాగా సర్వే నిర్వహించిన అధికారులే చావుకబురు చల్లగా చెప్పినట్టు ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో జలాశయం భూముల విషయంలో నిర్లక్ష్యం మేటవేసినట్టు స్పష్టమవుతోంది. ప్రాథమిక పరిశీలన దశలోనే ఇన్ని ట్విస్టులు రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

మెంటాడ, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి):

మెంటాడతో పాటు ప్రస్తుతం అల్లూరి జిల్లా అనంతగిరి మండలాల సరిహద్దు గ్రామాలకు చెందిన సుమారు మూడువేల ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా 2000 సంవత్సరంలో గుర్లగెడ్డ మినీ రిజర్వాయర్‌ నిర్మాణం ప్రారంభించారు. రూ.4.30 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. ఇందుకోసం 268 ఎకరాలు అవసరమని గుర్తించగా అందుబాటులో ఉన్న 138 ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు రైతులవద్ద 130 ఎకరాలు కొనుగోలు చేసి పనులను ప్రారంభించారు. అయితే రైతుల నుంచి కొనుగోలు చేసిన భూములను రెవెన్యూ రికార్డుల్లో రిజర్వాయర్‌ భూములుగా బదలాయించలేదు. ఈ విషయాన్ని పసిగట్టిన బడాబాబులు రైతులను, అటు కొందరు అధికారులను మేనేజ్‌ చేసుకొని వాటిని చవకగా కొనుగోలు చేసింది చాలక అదేదో సొంత ఆస్తి అయినట్టుగా ఇష్టారాజ్యంగా అమ్మకాలు పెట్టేసారు. ఇప్పటివరకు ముగ్గురు చేతులు మారడమే దీనికి రుజువు.

సుమారు 40 ఎకరాలను కొనుగోలు చేసిన మూడో వ్యక్తినుంచి రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఐదెకరాలు కొనుగోలు చేసి ప్లాట్లు వేసింది. ఇందులో సుమారు ఎకరా రిజర్వాయర్‌ ఎడమకాలువ భూమి ఆక్రమించినట్లు రూఢీ అయ్యింది. మిగిలిన 35 ఎకరాలు ఎర్తబండ్‌, కుడికాలువకు ఆనుకొని ఉన్నాయి. ఈ బడాబాబులంతా తాము రైతులపేరుమీద ఉన్న భూములను రైతుల వద్దనుంచి కొంటే, మధ్యలో మీకేంటి అభ్యంతరమంటూ ఆక్రమణలపై ప్రశ్నించేవారిపై ఎదురుదాడికి వెనకాడకపోడం మరో వింత. రిజర్వాయర్‌ భూములుగా మ్యుటేషన్‌ చేయని చిన్న కారణాన్ని ఆసరాగా తీసుకుని ఇలా ఎవరిష్టం వచ్చినట్టు వారు రిజర్వాయర్‌ భూములను చట్టబద్ధంగా చెరబట్టిన నేపథ్యంలో మున్ముందు ఇంకెన్ని రాబందులు వాలుతాయో, జలాశయం భూములు ఇంకెందరి చేతులు మారుతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

- బొబ్బిలి భూసేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కార్యాలయం నుంచి తమకు అందిన రికార్డుల్లో ఆ 18 ఎకరాల వివరాలు లేవని ప్రాజెక్టు డీఈ నవీన్‌ తమతో చెప్పారని అక్రమణలపై ఆందోళన బాటపట్టిన వివిధ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. కబ్జారాయళ్లు చెరబట్టిన భూమిని స్వాధీనం చేసుకునేవరకు పోరు సాగిస్తామని సీపీఎం నాయకుడు రాకోటి రాములు తదితరులు స్పష్టం చేశారు. మొత్తమ్మీద మ్యుటేషన్‌లో జరిగిన జాప్యం బడాబాడులకు కలసిరాగా రైతులకు శాపంగా మారింది. రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు ఇప్పటికైనా సమన్వయంతో ముందుకు వెళ్లకపోతే మున్ముందు జలాశయానికి చెందిన మరిన్ని భూములకు రెక్కలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- గుర్ల గెడ్డ మినీ రిజర్వాయర్‌ పరిస్థితిపై ఇరిగేషన్‌ డీఈఈ నవీన్‌ ఆంధ్రజ్యోతి మాట్లాడుతూ ఎర్తబండ్‌ ఎదురుగా భూమి ఆక్రమణ గురైయిందని భావించామని, ఆ రికార్డులు ప్రస్తుతం లభ్యం కాలేదన్నారు. వెతుకుతున్నామని బొబ్బిలి భూసేకరణ కార్యాలయం అధికారులు చెప్పారు. ఎడమ కాలువ సుమారు ఎకరా వరకు ఆక్రమణకు గురైంది.

----------------------

Updated Date - Feb 03 , 2026 | 11:31 PM