Share News

Not Received for Five Months! 5 నెలలుగా అందట్లే!

ABN , Publish Date - Apr 29 , 2026 | 11:58 PM

Not Received for Five Months! జిల్లాలో ఉపాధి హామీ వేతనదారులు వేతనాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గత కొన్ని నెలలుగా చెల్లింపులు జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండే ఎండల్లో పనులు చేస్తున్నా.. ఫలితం ఉండకపోవడంతో పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు.

Not Received for Five Months!  5 నెలలుగా అందట్లే!
పనసభద్ర పంచాయతీ చెక్కవలసలో ఉపాధి పనులు చేస్తున్న వేతనదారులు

  • బకాయిలు రూ.20 కోట్ల పైమాటే..

  • ఆందోళనలో వేతనదారులు

పార్వతీపురం, ఏప్రిల్‌29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉపాధి హామీ వేతనదారులు వేతనాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గత కొన్ని నెలలుగా చెల్లింపులు జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండే ఎండల్లో పనులు చేస్తున్నా.. ఫలితం ఉండకపోవడంతో పస్తులతో కాలం వెళ్లదీస్తున్నారు. వాస్తవానికి ఏ వారానికి ఆ వారం వారికి వేతనాలు చెల్లించాల్సి ఉంది. కానీ నూతన నిబంధనలే కారణమని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఖాతాల్లో వేతనాలు ఎప్పుడు పడతాయో తెలియక ఉపాధి వేతనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మొత్తంగా 2.07లక్షల వరకు జాబ్‌ కార్డులున్నాయి. వాటిల్లో 1.78 లక్షల కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం 1.30 లక్షల మంది వేతనదారులు పనులకు హాజరవుతున్నారు. ఈ నెలలో 32 లక్షల పని దినాలు పూర్తయినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. కాగా ఆయా వేతనదారులకు గత ఐదు నెలలుగా వేతనాలు అందడం లేదు. మొత్తంగా జిల్లాలో సుమారు రూ. 20 కోట్ల వరకు వేతన బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ‘సకాలంలో వేతనాలు అందితేనే మాకు అవసరాలు తీరుతాయి. ఇలా నెలల తరబడి చెల్లించకుంటే ఎలా బతకాలి? రోజూ పనులకు వెళ్తున్నా.. ప్రతిఫలం దక్కడం లేదు. తక్షణమే దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలి.’ అని వీరఘట్టం, కొమరాడ వేతనదారులు అప్పలనాయుడు, వెంకటనాయుడు తదితరులు కోరుతున్నారు. ఈ అంశంపై డ్వామా పీడీ రామచంద్రరావును వివరణ కోరగా.. త్వరలోనే ఉపాధి వేతనదారులకు వేతనాలు చెల్లిస్తామని తెలిపారు.

Updated Date - Apr 29 , 2026 | 11:58 PM