Share News

not proper construction ‘కట్టు’కథలే..

ABN , Publish Date - Apr 13 , 2026 | 12:04 AM

not proper construction నగరపాలక సంస్థ పరిధిలోని ధర్మపురి కూడలిలో రోడ్డు పక్కన ఓ షాపింగ్‌మాల్‌కు యజమాని జీప్లస్‌టు నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. ఆ భవనానికి సెల్లార్‌ కోసం 1.05 మీటర్ల స్థలం ఉంచాలి. కానీ .05 మాత్రమే ఉంచారు. దీనిపై పిర్యాదు అందుకున్న అధికారులు ఆ భవన నిర్మానానికి కొలత వేయించారు. ఆ తరువాత ఏమైందో, ఏమో కాని ఆ యజమాని యథావిధిగానే నిర్మాణం చేసుకుంటున్నారు.

 not proper construction ‘కట్టు’కథలే..
ధర్మపురి కూడలి వద్ద నిర్మాణంలో ఉన్న భవనానికి కొలతలు తీస్తున్న ప్రణాళికా విభాగం సిబ్బంది

‘కట్టు’కథలే..

అనుమతులు ఒకలా... పనులు మరోలా

ఇష్టారాజ్యంగా భవన యజమానులు, బిల్డర్లు

నోటీసులకే పరిమితమైన అధికారులు

సిబ్బంది చేతివాటం

తూతూమంత్రంగా అధికారుల పర్యవేక్షణ

విజయనగరం టౌన్‌, ఏప్రిల్‌12(ఆంధ్రజ్యోతి):

- నగరపాలక సంస్థ పరిధిలోని ధర్మపురి కూడలిలో రోడ్డు పక్కన ఓ షాపింగ్‌మాల్‌కు యజమాని జీప్లస్‌టు నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. ఆ భవనానికి సెల్లార్‌ కోసం 1.05 మీటర్ల స్థలం ఉంచాలి. కానీ .05 మాత్రమే ఉంచారు. దీనిపై పిర్యాదు అందుకున్న అధికారులు ఆ భవన నిర్మానానికి కొలత వేయించారు. ఆ తరువాత ఏమైందో, ఏమో కాని ఆ యజమాని యథావిధిగానే నిర్మాణం చేసుకుంటున్నారు.

- తోటపాలెంలోని ఇంటర్‌ కళాశాల భవనంపై నాలుగో అంతస్తు నిర్మాణానికి అనుమతులు లేకపోయినా పనులు సాగిస్తున్నారు. దాదాపు భవన నిర్మాణం పూర్తి చేసేశారు.

- ఐస్‌ ఫ్యాక్టరీ కూడలిలో ఓ ప్రైవేటు ఆసుపత్రి భవనం కింద పార్కింగ్‌కు సెల్లార్‌ ఉంచామంటూ అనుమతులు తీసుకున్నారు. సెల్లార్‌ భాగమంతా ఆసుపత్రి రిసెప్సన్‌కు వినియోగించుకుంటున్నారు. వాహనాలకు రోడ్డుపై పార్కింగ్‌ చేయిస్తున్నారు.

విజయనగరంలో భవన నిర్మాణాలు చాలాచోట్ల నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయి. పట్టణ ప్రణాళికా విభాగం ఉదాసీనతతో కార్పొరేషన్‌ ఆదాయనికి గండి పడుతోంది. ఏటా కోట్ల రూపాయల్లో కార్పొరేషన్‌కు ఆదాయం చేరడం లేదు. ఇంటి నిర్మాణానికి (జీప్లస్‌టు)అనుమతులు తీసుకుని అపార్టుమెంట్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ఆకాశ్శన్నంటే భవనాలను రియలర్ట్‌లు నిర్మించి అమ్మకాలు సాగిస్తున్నారు. జీప్లస్‌టూకు ఒకలా.. బహుళ అంతస్థులకు మరో కేటగిరీలో పన్ను ఉంటుంది. అలాగే ఇంటి నిర్మాణానికి ఒక విధంగా, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, కమర్షియల్‌ కాంప్లెక్సులకు మరోలా పన్నులున్నాయి. ఇవేవీ పక్కాగా అమలు కావడం లేదు. అధికారులు తెలిసే చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. మామూళ్లు అందుతున్నాయన్నది ప్రధాన విమర్శ. ఫిర్యాదులు వచ్చినా పూర్తిస్థాయిలో చర్యలు ఉండడం లేదు. అరకొరగా పిల్లర్లను విరగ్గొట్టడం లేదా స్లాబ్‌ను సుత్తితో కొంతమేర పగలుకొట్టడం ఆ తరువాత బేరసారాలు జరిపి జేబులు నింపుకోవడం పరిపాటిగా మారుతోంది.

- సచివాలయాల్లోని ప్లానింగ్‌ సెక్రటరీలు ప్రభుత్వ పథకాలు అమలు మాటేమోగాని కార్పొరేషన్‌ పరిధిలో చేతివాటానికి అలవాటు పడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో 61 సచివాలయాలు ఉండగా 50 డివిజన్లు ఉన్నాయి. ఈఏభై డివిజన్లలో ఏటా సుమారు నాలుగు వేలనుండి ఐదు వేలవరకూ భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎక్కడ ఏ భవన నిర్మాణం చేపట్టినా ప్లానింగ్‌ సెక్రటరీ వెళ్లి నిర్మాణదారుడితో ఒప్పందానికి వస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. వీరికి పట్టణ ప్రణాళికా విభాగంలోని కొంతమంది అధికారులు సపోర్టు చేస్తున్నట్లు సమాచారం.

అనుమతులు లేనివి బోలెడు

మా ప్రాంతంలో అనుమతులు లేకుండా అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికీ సుమారు పదికి పైగా ఉన్నాయి. ఇష్టారీతిలో బిల్డర్లు నిర్మాణాలు సాగించడంతో కాలువలు లేక మురుగు రోడ్డుపైకి వస్తోంది. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా కార్పొరేషన్‌ ప్రజారోగ్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.

- వి.శ్రీనివాసరావు, విశ్రాంత బ్యాంకు ఉద్యోగి, రింగురోడ్డు

ఇళ్ల మధ్య వాణిజ్య భవనాలు

మా ప్రాంతంలో గ్రూప్‌ హౌస్‌ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. వీటిలో అనుమతులు ఒకలా ఉంటే నిర్మాణాలు మరోలా జరుగుతున్నాయి. ఇంకోవైపు ఇళ్ల మధ్య కమర్షియల్‌ భవనాలకు అనుమతులు ఎలా ఇచ్చారో అర్థంకావడం లేదు. దీనిపై కార్పొరేటర్‌కు, అధికారులకు ఫిర్యాదులు చేశాం. పట్టించుకోవడం లేదు.

- రమణమూర్తి, విశ్రాంత రెవెన్యూ ఉద్యోగి, కేఎల్‌పురం

నోటీసులు ఇస్తున్నాం

సెల్లార్‌ స్థలాన్ని వదలని భవన యజమానులకు నోటీసులు ఇస్తున్నాం. నగరంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటున్నాం. మాకు ఫిర్యాదులు వస్తే స్పందిస్తున్నాం. రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఇబ్బందులు పడుతున్నాం. ఎప్పటికప్పుడు సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నాం.

- హరిబాబు, టీపీవో, పట్టణ ప్రణాళికా విభాగం, విజయనగరం

Updated Date - Apr 13 , 2026 | 12:04 AM