ఇక్కడ వద్దు..ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లండి
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:27 AM
శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో పని చేస్తున్న ఓ వైద్యుడు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 8.30 వరకు, సాయంత్రం 4.30 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రైవేటు ఆసుపత్రిలో ఉంటున్నారు.
- డాక్టర్లు అక్కడకే వస్తారు
- ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రోగులను పంపిస్తున్న వైనం
- కొందరి వైద్యులపై ఆరోపణలు
- ప్రైవేట్ ఇన్‌పేషేంట్లకు ఇక్కడ బెడ్లు కేటాయింపు
- పీజీఆర్‌ఎస్, రాష్ట్ర ఆరోగ్య శాఖకు ఫిర్యాదులు
- శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో పని చేస్తున్న ఓ వైద్యుడు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 8.30 వరకు, సాయంత్రం 4.30 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రైవేటు ఆసుపత్రిలో ఉంటున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు మీకు అందిస్తున్నాం. ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయవచ్చా?. దీనిపై స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ వైద్యుడి బయోమెట్రిక్ హాజరు, డ్యూటీ రోస్టర్, ఓపీ డ్యూటీలు, అత్యవసర విధులు వంటి రికార్డులను పరిశీలించాలి. ఇక్కడ పని చేస్తున్న మరో కీలక వైద్యుడు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. వీరి గురించి ఆసుపత్రి ముఖ్య వైద్యాధికారికి తెలిసినా చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై విచారణ జరగాలి.
- ఇటీవల ఓ వ్యక్తి ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అందించిన విన్నపమిది.
శృంగవరపుకోట, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఈ ఫిర్యాదును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి జిల్లా అధికారులు పంపించారు. దీనిపై విచారణ చేపట్టేందుకు జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి చెందిన సీనియర్ వైద్యురాలిని నియమించారు. ఈమె ఇప్పటికే క్షేత్రస్థాయి విచారణ చేపట్టారు. ఈ విషయాన్ని స్థానిక సంబంధిత ఆసుపత్రి వర్గాలు గోప్యంగా ఉంచాయి. ఆ ఇద్దరి వైద్యాధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో బయటపడలేదు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మారని తీరు..
శృంగవరపుకోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఇదేమీ కొత్తకాదు. సామాజిక ఆసుపత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఇదే తంతు. ఒక వైద్యుడిని చూసి మరొక వైద్యుడు అడ్డదారులు తొక్కుతున్నారు. ఒక వైపు ప్రభుత్వ వైద్యులుగా పని చేస్తూనే మరోవైపు ప్రైవేటు ఆసుపత్రులు, క్లీనిక్‌లు, కన్సల్టెన్సీలను నడిపేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బయోమెట్రిక్ హాజరు వేసిన తరువాత ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారు. ఎవరైనా అడిగితే అత్యవసర విభాగంలో ఉన్నారని, వార్డుల్లోని రోగులను చూసేందుకు వెళ్లారని సిబ్బందితో చెప్పిస్తున్నారు. గట్టిగా అడిగితే ఫోన్ ద్వారా సమాచారం అందుకొని పరుగున వచ్చేస్తున్నారు. అప్పుడు కూడా రోగులను సరిగా చూడడం లేదు. వారిపై కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక్కడైతే రోగం నయం కావడం కష్టమని, డాక్టర్ గారి సొంత ఆసుపత్రులకు వెళ్లండని చెప్పేందుకు ప్రత్యేకంగా అక్కడ పని చేస్తున్న సిబ్బందిలో ఒకరిని నియమించుకున్నారు. ఇక్కడకు వచ్చేవారిని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లేలా చేస్తున్నారు.
వ్యాపారంగా మారిన వైద్యం
పేదలకు ఉచితంగా అందాల్సిన వైద్యాన్ని వ్యాపారంగా మార్చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే రోగుల్లో కొందరిని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్‌పేషేంట్లగా ఉంచుతున్నారు. ఇక్కడే వారికి బెడ్లు కేటాయించి, ఆరోగ్య పరీక్షలు చేసి వైద్యం, మందులు అందిస్తున్నారు. వీటికయ్యే ఖర్చును రోగుల నుంచి వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ వీరిపై ఎటువంటి చర్యలు లేవు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.
జిల్లా కేంద్రాసుపత్రికి రిఫరెల్..
శృంగవరపుకోట ఆస్పత్రిలో నిపుణులైన వైద్యులు ఉన్నప్పటికీ రోగులను జిల్లా కేంద్రాసుపత్రికి రిఫరెల్ చేస్తున్నారు. వైరల్ జ్వరాల సమయంలోనే రోగులు అధికంగా ఇక్కడికి వస్తుంటారు. మిగిలిన సమయంలో ఆసుపత్రి ఖాళీగా కనిపిస్తుంది. అయినప్పటికీ బెడ్‌లు ఖాళీగా లేవంటూ రోగులను ఇంటికి పంపించేస్తున్నారు. దీనిపై వైద్యులను ప్రశ్నిస్తే.. వంద మందికి సరిపడా బెడ్లు ఉంటే 150 నుంచి 200 మంది వరకు ఇన్‌పేషేంట్లు వచ్చేస్తున్నారని చెబుతున్నారు. ఇన్‌పేషేంట్లు ఈ స్థాయిలో ఉంటే ఔట్ పేషేంట్లు రోజుకు 500మంది దాటి రావాలి. కానీ, ఆ పరిస్థితి ఇక్కడ లేదు.
ఖాళీ ఓపీ కౌంటర్లు..
ఆసుపత్రిని శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ సందర్శించింది. ఉదయం 11.45గంటల సమయంలో ఓపీ కౌంటర్లు ఖాళీగా కనిపించాయి. సిబ్బందిని అడిగితే సోమ, మంగళ, బుధవారాల్లో ఓపీ ఎక్కువగా, మిగిలిన రోజుల్లో తక్కువగా ఉంటుందని సమాధానమిచ్చారు. ఈ ఆసుపత్రికి ఎస్.కోట, ఎల్.కోట, వేపాడ, జామి, కొత్తవలస, గంట్యాడ మండలాల నుంచి రోగులు వస్తుంటారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు, అనంతగిరి, డుబ్రిగుడ మండలాల నుంచి కూడా ఆశ్రయిస్తుంటారు. అయితే, కొంతమంది వైద్యుల తీరుతో ఆస్పత్రిపై నమ్మకం కోల్పోతున్నారు. ప్రైవేటు వైద్యుల్లా వ్యవహరిస్తుండడంతో ఇక్కడకు రావాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.