Not Fetching Remunerative Prices! గిట్టుబాటు కావట్లే!
ABN , Publish Date - May 17 , 2026 | 11:47 PM
Not Fetching Remunerative Prices! జీడి పంటకు గిట్టుబాటు ధర కరువైంది. దీంతో గిరిజన రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో సుమారు 65 వేల ఎకరాల్లో జీడితోటలు ఉన్నాయి.
సిండికేట్‌గా మారిన వ్యాపారులు
నష్టపోతున్న గిరిజన రైతులు
ఆదుకోవాలని విన్నపం
గుమ్మలక్ష్మీపురం, మే17(ఆంధ్రజ్యోతి): జీడి పంటకు గిట్టుబాటు ధర కరువైంది. దీంతో గిరిజన రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో సుమారు 65 వేల ఎకరాల్లో జీడితోటలు ఉన్నాయి. గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, కొమరాడ, పాచిపెంట, మక్కువ తదితర మండ లాల్లో గిరిజన రైతులు ఈ సాగుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం దిగుబడి వస్తున్నా.. కిలో జీడిపిక్కల ధర రూ.130 ఉండడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో కిలో రూ.160 ఉన్న ధర నేడు ఒక్కసారిగా తగ్గిపోయింది. మరోవైపు వ్యాపారులు సిండికేట్‌గా మారి అతి తక్కువ ధరకే జీడి పిక్కలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాస్తవంగా ఈ ప్రాంతంలో సాగైన జీడి పంటకు మంచి డిమాండ్ ఉంది. నాణ్యతతో పాటు మంచి రుచి కూడా ఉండడంతో వ్యాపారులు పంటను కొనుగోలు చేసేందుకు పోటీ పడుతుంటారు. ఇక్కడి సంతల్లో గిరిజనుల నుంచి జీడి పిక్కలను కొనుగోలు చేసి.. లారీల ద్వారా ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ర్టాలకు రవాణా చేస్తుంటారు. ఇంత వ్యాపారం జరిగినా రైతులకు మాత్రం గిట్టుబాటు కావడం లేదు.
- ఐటీడీఏ ఆధ్వర్యంలో గతంలో గుమ్మలక్ష్మీపురం మండలం జేకేపాడు, ఇరిడి గ్రామాల్లో జీడిపిక్కల ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అయితే నిర్వహణ లోపంతో అవి అనతి కాలంలోనే మూతపడ్డాయి. గత ఏడాది పార్వతీపురంలో జీడిపిక్కల ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసినా.. నిర్వహణ అంతంతమాత్రమే ఉంది. వెలుగు ద్వారా జీడిపిక్కల కొనుగోలు నామమాత్రంగానే ఉంది.
- ఎకరా జీడితోటలో సుమారు మూడు నుంచి ఐదు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ మేరకు జిల్లాలో 18 వేలు టన్నుల జీడి పిక్కలు దిగుబడి వస్తుందని ఒక అంచనా. అయితే ప్రభుత్వం సంస్థల జీడిపిక్కలు కొనుగోలు చేస్తే తమకు గిట్టుబాటు ధర దొరకుతుందని గిరిజన రైతులు భావిస్తున్నారు. గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సాలూరు, కొమరాడ మండలాల్లో జీడిపిక్కల ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తే గిరిజన యువతకు ఉపాధి కూడా దొరుకుతుంది. దీనిపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని గిరిజన సంఘ నాయకులు కోరుతున్నారు. ఈ అంశంపై వెలుగు ఏపీఎం కె.సతీష్‌ను వివరణ కోరగా.. మార్కెట్ రేట్‌ను బట్టి వెలుగు సంఘాల ద్వారా గిరిజన రైతుల నుంచి జీడి పిక్కలను కొనుగోలు చేస్తున్నామన్నారు.