Not even half the seats are filled! సగం సీట్లూ నిండలే!
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:16 AM
Not even half the seats are filled! రాజాం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కనీస స్థాయిలో కూడా అడ్మిషన్లు కాలేదు. ఇక్కడ ఐదు గ్రూపులు ఉన్నాయి. బీఎస్సీతో పాటు బీఏ, బీకాం వంటి సంప్రదాయ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. 240 సీట్లు ఉండగా కేవలం 98 సీట్లు భర్తీ కావడం గమనార్హం.
సగం సీట్లూ నిండలే!
ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు అంతంతమాత్రం
పెద్దగా ఆసక్తిచూపని విద్యార్థులు
కౌన్సెలింగ్‌లో జాప్యమూ కారణమే
రాజాం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కనీస స్థాయిలో కూడా అడ్మిషన్లు కాలేదు. ఇక్కడ ఐదు గ్రూపులు ఉన్నాయి. బీఎస్సీతో పాటు బీఏ, బీకాం వంటి సంప్రదాయ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. 240 సీట్లు ఉండగా కేవలం 98 సీట్లు భర్తీ కావడం గమనార్హం.
రాజాం, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రాజాం ప్రభుత్వ డిగ్రీ కాలేజీతో పాటు నాలుగు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ సీట్లు భర్తీ కాలేదు. కనీసం 30 శాతం ప్రవేశాలు జరగకపోవడం ఆశ్చర్యం కలుగుతోంది. ఇంటర్ ఫలితాలు వచ్చి ఐదు నెలలైంది. దీంతో వారంతా డిగ్రీ కౌన్సెలింగ్ కోసం చాలా రోజులు నిరీక్షించారు. ఎప్పటికీ స్పష్టత రాకపోవడంతో డిగ్రీ ప్రవేశాలపై ఆ ప్రభావం పడింది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి గతం కంటే మెరుగ్గా ప్రవేశాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. నేటికీ సీట్లు భర్తీ కాకపోవడం ఆలోచించాల్సిన విషయం.
జిల్లాలో విజయనగరం, చీపురుపల్లి, రాజాం, ఎస్.కోట, గజపతినగరంలో ప్రభుత్వ డిగ్రీకాలేజీలు ఉన్నాయి. ఈ నెల 7న సీట్లు కేటాయించారు. చాలాచోట్ల సగం సీట్లు కూడా భర్తీకాలేదు. రెండోసారి కౌన్సెలింగ్ నిర్వహించినా పెద్దగా స్పందన రాలేదు. మూడోసారి చేపట్టేందుకు ఆలోచిస్తున్నారు. ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 15న విడుదలయ్యాయి. వెంటనే డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను చేపట్టలేదు. సాంకేతిక కారణాలతోనే ఆలస్యమైనట్టు చెబుతున్నారు. ఇంజనీరింగ్, వైద్య విద్య, ఇతర కోర్సుల్లో ఎక్కువ మంది చేరిపోయారు. పాలిటెక్నిక్ కోర్సులకు ముందుగా కౌన్సెలింగ్ జరగడంతో అటువైపు కూడా ఎక్కువ మంది విద్యార్థులు వెళ్లిపోయారు. వాటన్నింటికీ ప్రవేశాలు పూర్తయిన తరువాత డిగ్రీ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ వచ్చింది. ఉన్నత విద్యామండలి ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్ చేపట్టింది. అయితే ఈ మొత్తం ప్రక్రియ ఆలస్యం కావడంతో డిగ్రీలో చేరేందుకు విద్యార్థులు పెద్దగా ఆసక్తిచూపలేదు. దీనికితోడు ప్రైవేటు కాలేజీలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడంతో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కనీస స్థాయిలో అడ్మిషన్లు జరగలేదు.
ఇదీ పరిస్థితి..
విజయనగరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 10 గ్రూపులు ఉన్నాయి. మొత్తం 430 సీట్లు ఉన్నాయి. కానీ 164 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 266 సీట్లు ఖాళీగా ఉన్నాయి. చీపురుపల్లి డిగ్రీ కాలేజీలో 7 గ్రూపులకుగాను 400 సీట్లు ఉన్నాయి. 232 మాత్రమే భర్తీ అయ్యాయి. 168 సీట్లు ఖాళీగా ఉన్నాయి. గజపతినగరం కాలేజీలో 4 గ్రూపులకుగాను 190 సీట్లు ఉన్నాయి. 105 భర్తీకాగా.. 85 సీట్లు ఖాళీగా ఉన్నాయి. రాజాంలో 5 గ్రూపులకుగాను 240 సీట్లు ఉన్నాయి. కేవలం 98 సీట్లు భర్తీ జరిగి 142 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎస్.కోట కాలేజీలో 5 గ్రూపులకుగాను 240 సీట్లు ఉన్నాయి. 36 సీట్లు భర్తీ జరిగి 204 సీట్లు ఖాళీగా ఉండిపోవడం గమనార్హం. ఇప్పుడు మరోసారి ప్రవేశాలకు అవకాశం కల్పించారు. నెలాఖరులోగా ప్రక్రియ పూర్తిచేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
వసతి సమస్య ఉంది
రాజాం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. ఉత్తమ విద్యాబోధన అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. అయితే వసతి సమస్య ఉంది. సొంత భవనం నిర్మాణానికి అవసరమైన స్థలం లేదు. గుర్తించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇంటర్ ప్రభుత్వ బాలుర కళాశాలలోనే తరగతులు సాగుతున్నాయి. మొదటి విడతలో 45 సీట్లు భర్తీ అయ్యాయి.
- పి.స్వొప్నహైంధవి, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, రాజాం
భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతులు ఇచ్చాం. ముడోవిడత కౌన్సెలింగ్ పూర్తయ్యేసరికి అన్ని కళాశాలల్లో ప్రవేశాలు పూర్తిచేస్తాం. ఏ కళాశాలలోనూ సీట్లు ఖాళీగా ఉండిపోకుండా చర్యలు తీసుకుంటాం.
- పీవీజీ కృష్ణయాజీ, ఆర్జేడీ, విశాఖపట్నం