not clarity కొలిక్కి రాలే!
ABN , Publish Date - Apr 19 , 2026 | 12:06 AM
not clarity మెంటాడ మండలంలోని మూడు గ్రామాల మీదుగా హెచ్‌పీసీఎల్ పైపులైను ఏర్పాటుకు సంబంధించి భూముల సేకరణ విషయంలో అధికారులకు సవాల్ ఎదురైంది. తాజాగా శనివారం ఏర్పాటుచేసిన ప్రజాభిప్రాయ సేకరణలో పంపింగ్, ఫిల్లింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అంగీకరించేది లేదని స్థానికులు తెగేసి చెప్పారు. దీంతో వ్యవహారం కొలిక్కి రాకుండానే సభ అసంపూర్తిగా ముగిసింది.
కొలిక్కి రాలే!
హెచ్ప్‌సీఎల్ పైపులైను నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ
హాజరైన ఆర్డీఓ, సంస్థ ప్రతినిధులు
ఆందోళన వ్యక్తం చేసిన స్థానికులు
అసంపూర్తిగా ముగిసిన సమావేశం
మెంటాడ మండలంలోని మూడు గ్రామాల మీదుగా హెచ్‌పీసీఎల్ పైపులైను ఏర్పాటుకు సంబంధించి భూముల సేకరణ విషయంలో అధికారులకు సవాల్ ఎదురైంది. తాజాగా శనివారం ఏర్పాటుచేసిన ప్రజాభిప్రాయ సేకరణలో పంపింగ్, ఫిల్లింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అంగీకరించేది లేదని స్థానికులు తెగేసి చెప్పారు. దీంతో వ్యవహారం కొలిక్కి రాకుండానే సభ అసంపూర్తిగా ముగిసింది.
మెంటాడ, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి):
విశాఖ నుంచి రాయపూర్ వరకు 540 కిలోమీటర్ల పొడవున హెచ్పీసీఎల్ పైపులైను ఏర్పాటుకు చురుగ్గా సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మండలంలోని రాబంద, కొంపంగి, మీసాల పేట తదితర గ్రామాల మీదుగా ఆరు కిలోమీటర్ల మేర పైపులైను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు ఆరు ఎకరాల భూమి అవసరమవుతుందని ప్రాథమిక అంచనా వేశారు. ఈనేపథ్యంలో శనివారం బొబ్బిలి ఆర్డీవో రామ్మోహనరావు,హెచ్పీసీఎల్ ఉన్నతాధికారుల బృందం ఇక్కడ పబ్లిక్ హియరింగ్(ప్రజాభిప్రాయ సేకరణ) ఏర్పాటు చేసింది.
పైపులైను ఏర్పాటు వల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని హెచ్పీసీఎల్ డిప్యూటీ మేనేజర్ జి.ఎల్ నాయుడు స్పష్టం చేశారు. సేకరించిన భూమికి నష్టపరిహారం చెల్లిస్తారని చెప్పారు. పైపులైను వల్ల గ్యాస్ లీకు, ప్రమాదాలు వంటివాటిపై రైతులు, ప్రజలు అనుమానం వ్యక్తం చేశారు. వీటిని అధికారుల బృందం నివృత్తి చేసింది. ఆరునెలలుగా ప్రాసెస్ జరుగుతోందని రైతులు ఇదివరకు అంగీకారం తెలిపారని, గ్రీవెన్స్‌లో ఫిర్యాదు ఇవ్వడంతో మరోసారి అవగాహన, అభిప్రాయ సేకరణ చేపడుతున్నట్లు చెప్పారు. నష్టపరిహారాన్ని పెంచాలని రైతులు డిమాండ్ చేశారు. దీనిపై చర్చిస్తామని అధికారులు తెలిపారు.
- పైపులైను ఏర్పాటులో భాగంగా ఆ మూడు గ్రామాల్లో ఒకచోట పంపింగు, ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారన్న ఊహాగానాలపై స్పష్టత ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. అలాంటిదేమీ లేదని, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఉండేందుకు గదులు, ప్రహారీ మాత్రమే ఏర్పాటు చేస్తామని,ఆయిల్ ట్యాంకర్‌ల రాకపోకలు, పొల్యూషన్ సమస్య ఉండదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫిల్లింగ్ స్టేషన్ లేనపుడు ఎనిమిది ఎకరాలను ఎందుకు సేకరిస్తున్నారని గ్రామస్థులు ప్రశ్నించారు. భవిష్యత్ అవసరాలకని దాటవేశారు.
- కొందరు రైతులు మాత్రం భవిష్యత్తులో వాయు కాలుష్యం,ప్రమాదాలకు ఆస్కారం ఉన్నందున పైపులైను ఏర్పాటుకు భూమి ఇచ్చినా, పంపింగ్,ఫిల్లింగ్ స్టేషన్‌లకు భూమి సమకూర్చలేమని స్పష్టం చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు చలుమూరి వెంకట్రావు జోక్యం చేసుకొని, పంటపొలాలు మీదుగా పైపులైను అంటే సహజంగానే అందరికీ భయాందోళనలు ఉంటాయన్నారు. కొండ ప్రాంతంలో జనసంచారంలేని చోట స్టేషన్ ఏర్పాటు చేయాలని, దీనికి ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా సహకరిస్తామని అన్నారు. వైస్ ఎంపీపీ సారిక ఈశ్వరరావు మాట్లాడుతూ, రైతుల నుంచి బలవంతపు భూ సేకరణ వద్దని, ప్రత్యామ్నాయ మార్గాలపై ఆలోచించాలని సూచించారు.
- ఆర్డీవో రామ్మోహానరావు మాట్లాడుతూ, స్థానికుల అభిప్రాయాలపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని, అట్నుంచి వచ్చే సూచనల మేరకు ముందుకు వెళ్తామని తెలిపారు.