Share News

Not a single paisa received..! పైసా రాలే..!

ABN , Publish Date - Nov 23 , 2026 | 11:54 PM

Not a single paisa received..! రాజాం మునిసిపాల్టీకి 21 సంవత్సరాల తరువాత ఎన్నికలు జరుగుతున్నాయి. వార్డుల విభజనతో సంఖ్య 32కు చేరుకుంది. చైర్‌పర్సన్‌కు ఐదుగురు పోటీలో ఉండగా.. 32 వార్డులకు 89 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పూర్తిగా బ్యాలెట్‌తో జరుగుతున్న ఎన్నికల ఖర్చు అధికమే. కానీ ఇంతవరకూ ఎన్నికల నిర్వహణ నిధులు విడుదల కాలేదు.

Not a single paisa received..! పైసా రాలే..!
రాజాం మునిసిపల్‌ కార్యాలయం

పైసా రాలే..!

ఎన్నికల ఖర్చు విడుదల చేయని ప్రభుత్వం

రూ.లక్షల్లో వ్యయం

మల్లగుల్లాలు పడుతున్న మునిసిపల్‌ అధికారులు

రాజాం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి):

రాజాం మునిసిపాల్టీకి 21 సంవత్సరాల తరువాత ఎన్నికలు జరుగుతున్నాయి. వార్డుల విభజనతో సంఖ్య 32కు చేరుకుంది. చైర్‌పర్సన్‌కు ఐదుగురు పోటీలో ఉండగా.. 32 వార్డులకు 89 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పూర్తిగా బ్యాలెట్‌తో జరుగుతున్న ఎన్నికల ఖర్చు అధికమే. కానీ ఇంతవరకూ ఎన్నికల నిర్వహణ నిధులు విడుదల కాలేదు. దీంతో అధికారులు సొంత ఖర్చులు భరించుకోవాల్సి వస్తోంది. ఇప్పటివరకూ రూ.3 లక్షలకుపైగా ఖర్చయినట్టు అధికారులు చెబుతున్నారు. ఎన్నికల రిటర్నింగ్‌ జిల్లా అధికారిగా ఉన్న కలెక్టర్‌ ఈ నిధులు విడుదల చేయాలి. కానీ జాప్యం జరుగుతుండడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

ముందస్తుగానే ఏర్పాట్లు..

రెండో విడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రాజాంకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే చాలారోజులు ముందు నుంచే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. నామినేషన్‌ పత్రాల దరఖాస్తులు, జిరాక్సులు, ఇతరత్రా సామగ్రిని సైతం కొనుగోలు చేశారు. ఇరుకుగా ఉన్న మునిసిపల్‌ కార్యాలయంలోనే వార్డుల ఏర్పాట్లు, అందుకు తగ్గట్టుగా సీసీ కెమెరాల నిర్వహణ, ఫర్నీచర్‌ ఏర్పాటు, కంప్యూటర్లు, ప్రింటర్ల మరమ్మతులు, కొత్తవి కొనుగోలు, స్టేషనరీ వంటి వాటికి ఖర్చు చేశారు. వీటికి రూ.3 లక్షలు దాటినట్టు తెలుస్తోంది. ఇక రోజువారీగా ఎన్నికల విధుల్లో సిబ్బందికి భోజనాలు, షామియానాలు, లైటింగ్‌ వంటి వాటికి సైతం అధికారులే సొంతంగా ఖర్చుచేస్తున్నారు. వీటికి డబ్బులు ఎక్కడ నుంచి తీయాలో తెలియడం లేదు. మునిసిపల్‌ జనరల్‌ ఫండ్‌ ఖర్చుచేసే అవకాశమే లేదు. ఈ నెల 26న పోలింగ్‌, ఆ ముందురోజు శిక్షణకు మరింత ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇప్పటికైనా రిటర్నింగ్‌ అధికారి స్పందించి ఎన్నికల నిర్వహణ ఖర్చును విడుదల చేయాలని కోరుతున్నారు.

నిధులు విడుదల కాలేదు..

ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇంతవరకూ నిధులు విడుదల కాలేదు. దీంతో ఖర్చులకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఎలాగోలా సర్దుబాటు చేస్తున్నాం. నిధులు విడుదలైన వెంటనే అందరికీ అందిస్తామని చెబుతున్నాం. ఇంకా మూడు రోజులు ఉండడంతో ఖర్చు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.

- రామచంద్రరావు, కమిషనర్‌, రాజాం

Updated Date - Nov 23 , 2026 | 11:54 PM