Share News

ఊహూ.. కొలిక్కి రాలే!

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:40 AM

విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు టీడీపీకి సవాలుగా మారింది.

 ఊహూ.. కొలిక్కి రాలే!
చర్చల్లో పాల్గొన్న మంత్రులు అనిత, శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు మురళీమోహన్‌, లలితకుమారి, అదితి తదితరులు

రెండో రోజూ టీడీపీ కార్యాలయంలోనే పడిగాపులు

సీట్ల సర్దుబాటుపై బీజేపీ, జనసేన అసంతృప్తి

చర్చల నుంచి అలిగి వెళ్లిపోయిన జనసేన నేత

విజయనగరం ఆశావహుల్లో వీడని ఉత్కంఠ

విజయనగరం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక, కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు టీడీపీకి సవాలుగా మారింది. గత మూడు రోజులుగా అభ్యర్థుల జాబితా కోసం ఆశావహులు ఎదురుచూస్తుండగా, శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా స్పష్టత రాకపోవడంతో తొలిరోజు పలువురు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారు. మరోవైపు సీట్ల కేటాయింపుపై బీజేపీ, జనసేన అసంతృప్తి వ్యక్తం చేయడం, చర్చల మధ్యలోనే జనసేన నాయకురాలు పాలవలస యశస్వి బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఆశావహులు, వారి అనుచరులు టీడీపీ కార్యాలయంలోనే పడిగాపులు కాశారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఒకరిద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించి, అనంతరం కూటమి నేతల సమావేశానికి వెళ్లిపోయారు. మిగిలిన అభ్యర్థుల పేర్లు వెల్లడికాకపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగింది. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చల్లో రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్‌, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, తణుకు ఎమ్మెల్యే ఆలిమిల్లి రాధాకృష్ణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగార్జున, ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, కోండ్రు మురళీమోహన్‌, ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసుల నాయుడు, అదితి గజపతిరాజు, లోకం నాగమాధవి, బేబీ నాయన, జడ్పీ మాజీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.

సీట్ల సర్దుబాటుపై అసంతృప్తి

విజయనగరం నగరపాలక సంస్థలో మొత్తం 62 డివిజన్లు ఉన్నాయి. వీటిలో టీడీపీకి 54, జనసేనకు 5, బీజేపీకి 3 స్థానాలు కేటాయించాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే జనసేన 8, బీజేపీ 5 స్థానాలు కోరినట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనకు ఎమ్మెల్యే అంగీకరించకపోవడంతో రెండు పార్టీల నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన తరఫున త్రిసభ్య కమిటీ సభ్యురాలు పాలవలస యశస్వితో పాటు గురాన అయ్యలు, ఇతర నాయకులు చర్చల్లో పాల్గొన్నారు. బీజేపీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు రాజేష్‌వర్మ, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. తాము కోరిన స్థానాలు కేటాయించకుండా, పార్టీ నిర్ణయించిన స్థానాల్లోనే పోటీ చేయాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని యశస్వి ప్రశ్నించినట్లు తెలిసింది. 8 ఏళ్లుగా ఇక్కడ జనసేన తరఫున పనిచేస్తున్నానని పేర్కొంటూ ఆమె అసంతృప్తితో సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆమె వెంట జనసేన నాయకులు కూడా బయటకు వచ్చారు. రాత్రి 9 గంటల తర్వాత జనసేన, బీజేపీ నాయకులతో మరోసారి చర్చలు కొనసాగాయి.

Updated Date - Oct 17 , 2026 | 12:40 AM