Share News

Nomination ముగిసిన నామినేషన్ల ఘట్టం

ABN , Publish Date - Oct 18 , 2026 | 11:34 PM

Nomination Process Comes to an End పురపోరులో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈ మేరకు చివరిరోజు ఆదివారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలకు చెందిన చైర్‌పర్సన్‌, కౌన్సిలర్ల అభ్యర్థులతో నగర పంచాయతీ, మున్సిపల్‌ కార్యాలయాలు కిటకిటలాడాయి.

Nomination   ముగిసిన నామినేషన్ల ఘట్టం
పార్వతీపురం చైర్‌పర్సన్‌ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేస్తున్న కరుణ

  • పాలకొండలో 124, సాలూరులో 213, పార్వతీపురంలో 205 మంది దాఖలు

  • కిటకిటలాడిన మున్సిపల్‌ కార్యాలయాలు

పార్వతీపురం/ పార్వతీపురం టౌన్‌/సాలూరు/పాలకొండ, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): పురపోరులో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈ మేరకు చివరిరోజు ఆదివారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలకు చెందిన చైర్‌పర్సన్‌, కౌన్సిలర్ల అభ్యర్థులతో నగర పంచాయతీ, మున్సిపల్‌ కార్యాలయాలు కిటకిటలాడాయి. మధ్యాహ్నం మూడు గంటలలోగా నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించారు. కాగా అధికారులు సోమవారం వాటిని పరిశీలి స్తారు. ఇక 21న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది.

- సాలూరు మున్సిపాల్టీలో చైర్‌పర్సన్‌ అభ్యర్థులుగా టీడీపీ నుంచి 6, జనసేన పార్టీ 3, కాంగ్రెస్‌ పార్టీ ఒకటి, వైసీపీ నుంచి 3, స్వతంత్ర అభ్యర్థులుగా ఇద్దరు మొత్తంగా 15 మంది నామినేషన్లు వేశారు. కౌన్సిలర్ల అభ్యర్థులుగా 198 పత్రాలు దాఖలయ్యాయి. అందులో టీడీపీ నుంచి 84, జనసేన 20, బీజేపీ 4, వైసీపీ 72, సీపీఎం 2, స్వతంత్ర అభ్యర్థులుగా 16మంది నామినేషన్లు వేశారు. నామినేషన్‌ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మూడంచెల బందోబస్తు నిర్వహించామని ఏఎస్పీ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ, స్ర్టాంగ్‌ రూములను సెంట్రల్‌ ఎలక్షన్‌ అబ్జర్వర్‌ చినరాముడు పరిశీలించారు. మొత్తంగా చివరి రోజున సాలూరు పుర పాలక సంఘంలో కౌన్సిలర్లు అభ్యర్థులుగా 131 మంది, చైర్‌పర్సన్‌ అభ్యర్థులుగా 12 మంది నామినేషన్లు వేశారు.

- పాలకొండ నగర పంచాయతీలో చివరి రోజు 103 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులుగా నామి నేషన్‌ దాఖలు చేశారు. చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా జనసేన నుంచి ఒకరు, వైసీపీ నుంచి ఒకరు, ఇద్దరు ఇండిపెండెంట్లు నామినేషన్లు పత్రాలు అందించారు. మొత్తంగా కౌన్సిలర్‌ స్థానాల కోసం 120 మంది, చైర్‌పర్సన్‌ సీటు కోసం నలుగురు నామినేషన్లు వేశారు.

- పార్వతీపురం మున్సిపాల్టీలో 196 మంది కౌన్సిలర్లు స్థానాల కోసం, తొమ్మిది మంది చైర్‌పర్సన్‌ స్థానాల కోసం నామినేషన్లు వేశారు. 36 వార్డులకు సంబంధించి కౌన్సిలర్ల అభ్య ర్థులుగా టీడీపీ నుంచి 58 మంది, వైసీపీ 67, జేఎస్పీ 22, బీజేపీ 7, సీపీఎం 5, సీపీఐ 2, ఐఎన్‌సీ 2, ఇండిపెండెంట్‌లు 33 మంది నామినేషన్లు వేశారు. చైర్‌పర్సన్‌ అభ్యర్థులుగా టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ ఒకరు, వైసీపీ మూడు , జేసీపీ ఒకరు, కాంగ్రెస్‌ ఒకరు, ఇండిపెండెంట్‌గా ఒకరు నామినేషన్‌ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి. శ్రీనివాసరావు 27వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేయడం చర్చనీయాంశమైంది. మధ్యాహ్నం 3 గంటల లోపల కేంద్రంలో అధికంగా అభ్యర్థులు ఉండడంతో రాత్రి 7.30 గంటల వరకు నామినేషన్లను స్వీకరించారు. పక్కాగా ఎన్నికల నిర్వహణ చేపడుతున్నట్లు మున్సిపల్‌ ఎన్నికల ఖర్చులు, వ్యయాల పర్యవేక్షణ అధికారి బబిత కుమారి అన్నారు. ఆదివారం రాత్రి మున్సిపల్‌ కమిషనర్‌ రామ్‌ గోపాల్‌తో పాటు సంబంధిత అధికారులతో చర్చించారు.

రెబల్స్‌ బెడద

జిల్లాలో ప్రధాన పార్టీలకు రెబల్స్‌ బెడద వెంటాడుతుంది. పార్వతీపురం పురపాలక సంఘాన్ని టీడీపీకి కేటాయించగా.. ఆ పార్టీ నుంచి చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా బెలగాం కరుణ నామినేషన్‌ వేశారు. అయితే ఇదే స్థానం కోసం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు సతీమణి జ్యోతితో పాటు వారి కోడలు దీప్తి నామినేషన్లు వేశారు. పార్వతీపురంలో వైసీపీ అధిష్ఠానం ప్రకటించిన చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఎస్‌.లక్ష్మీపార్వతితో పాటు స్థానిక నేతలు నిర్ణయించిన పట్నాల సాయిశ్రీ కూడా నామినేషన్లు వేశారు. సాలూరు పురపాలక సంఘం చైర్‌పర్సన్‌ సీటు జనసేనకు కేటాయించగా ఆ పార్టీ నుంచి జి.విజయకుమారితో పాటు మరొక అభ్యర్థి కె.వసంతి నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీకి చెందిన కె.గాయత్రీదేవి, నిమ్మాది శ్యామల, నిమ్మాది కుసుమ, కె.వరలక్ష్మి తదితరులు నామినేషన్‌ పత్రాలు అందించారు. పాలకొండ నగర పంచాయతీ జనసేన చైర్‌పర్సన్‌ అభ్యర్ధిగా పల్లా విజయనిర్మల నామినేషన్‌ దాఖలు చేశారు. ఇక్కడ కూటమికి రెబల్స్‌ బెడద లేదు.

వైసీపీ అధిష్ఠానం ఎంపిక చేసిన అభ్యర్థిని కాదని..

జిల్లా కేంద్రం పార్వతీపురంలో వైసీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఎంపిక విషయంలో కథ అడ్డం తిరిగింది. పార్టీ అధిష్ఠానం ఒకరి పేరును ప్రకటిస్తే.. స్థానిక నాయకత్వం మరొకరి పేరును ఖరారు చేసింది. అయితే అధిష్ఠానం ప్రకటించిన జాబితా ప్రకారం.. సంగంరెడ్డి లక్ష్మీపార్వతి, స్థానిక నేతలు నిర్ణయించిన పట్నాల సాయిశ్రీ చైర్‌పర్సన్‌ అభ్యర్థులుగా ఒకే పార్టీ నుంచి నామినేషన్లు దాఖలు చేయడం చర్చనీయాంశమైంది.

Updated Date - Oct 18 , 2026 | 11:34 PM