Nomination నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
ABN , Publish Date - Oct 16 , 2026 | 11:56 PM
Nomination Process Begins జిల్లాలోని పురపాలక సంఘాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం తొలిరోజు పార్వతీ పురంలో ఐదుగురు కౌన్సిలర్ల స్థానాలు కోసం , ఒకరు చైర్ పర్సన్ కోసం నామినేషన్లు దాఖలు చేశారు. సాలూరులో చైర్ పర్సన్ స్థానం కోసం ఒకటి, కౌన్సిలర్లకు ఐదు నామినేషన్లు వచ్చాయి. పాలకొండలో మాత్రం బోణీ పడలేదు. ఎవరూ నామినేషన్ పత్రాలు అందించలేదని సంబంధిత అధికారులు తెలిపారు.
తొలిరోజు పార్వతీపురంలో ఆరు.. సాలూరులో ఆరు పత్రాల దాఖలు
పాలకొండలో నిల్
పార్వతీపురం/పార్వతీపురం టౌన్/సాలూరు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పురపాలక సంఘాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం తొలిరోజు పార్వతీ పురంలో ఐదుగురు కౌన్సిలర్ల స్థానాలు కోసం , ఒకరు చైర్ పర్సన్ కోసం నామినేషన్లు దాఖలు చేశారు. సాలూరులో చైర్ పర్సన్ స్థానం కోసం ఒకటి, కౌన్సిలర్లకు ఐదు నామినేషన్లు వచ్చాయి. పాలకొండలో మాత్రం బోణీ పడలేదు. ఎవరూ నామినేషన్ పత్రాలు అందించలేదని సంబంధిత అధికారులు తెలిపారు. కాగా శనివారం కూటమి పార్టీలు, వైసీపీ నుంచి ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. పార్వతీపురం మునిసిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారి రామ్ గోపాల్ ఆధ్వర్యంలో నామినేషన్లు స్వీకరించారు. వైసీపీ తరఫున 3, 9, 13, 14వ వార్డుల నుంచి వై.త్రినాఽథరావు, పి.సత్యవతి, పి. తిరుపతి, ఆర్.దయామణితో పాటు 31వ వార్డు సీపీఎం అభ్యర్థిగా జి.వెంకట రమణ నామినేషన్లను దాఖలు చేశారు. వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థిగా సంగంరెడ్డి లక్ష్మీపార్వతి నామినేషన్ పత్రాలు అందించారు. మునిసిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు అడిషనల్ ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. మొదటి రోజు నామినేషన్ల ప్రక్రియ పరిశీలించిన అంతరం విలేఖర్లతో మాట్లాడారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు సబ్ డివిజన్లోని పోలీసు యంత్రాంగమంతా తమ బాధ్యతలను నిర్వహిస్తుంద న్నారు. ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు మునిసిపల్ ఎన్నిక లను ప్రశాంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సాలూరులో మునిసిపల్ కార్యాలయంలో ఎలక్షన్ సూపర్వైజర్ ఎ.రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం నామినేషన్ల స్వీకరణ కార్య క్రమం ప్రారంభమైంది. ఎనిమిదో వార్డు నుంచి కౌన్సిలర్ అభ్య ర్థులుగా సీపీఐ (ఎం) తరఫున జలగడుగుల రాణి, దేవిక నామి నేషన్ వేశారు. 12వ వార్డు నుంచి వైసీపీ తరఫున మజ్జి అప్పారావు, 20వ వార్డు నుంచి పువ్వల పైడితల్లి శ్రీనివాస్ భరత్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ కౌన్సిలర్ల స్థానాల కోసం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వైసీపీ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా భవిరెడ్డి రిబ్కారాణి నామినేషన్ వేశారు.
నేడు కూటమి పార్టీల అభ్యర్థులకు అందజేత
పార్వతీపురం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులకు శనివారం బీఫారాలు అందనున్నాయి. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరెవరికీ బీ ఫారాలు దక్కుతాయన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా బీఫారాలు పొందిన తర్వాత కొంతమంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే నామినేషన్లు వేసి వారు బీఫారాలను అధికారులకు నేరుగా అందిస్తారు. బీఫారాలు ఎవరికి వచ్చినా అందరూ కలిసి పని చేయాలని పార్టీ అధిష్ఠానాలు ఆదేశించిన నేపథ్యంలో పార్వతీపురం, సాలూరుతో పాటు పాలకొండలో శ్రేణులు ఎలా వ్యవహరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. చైర్పర్సన్ సీటు కోసం టీడీపీ అత్యధికంగా ఆశావహులు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో బీ ఫారం పొందని వారు కూటమి అభ్యర్థి విజయం కోసం ఏ మేరకు కృషి చేస్తారో.. ఎంతవరకు సహకరిస్తారో వేచి చూడాల్సి ఉంది.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చ రించారు. రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, అనుమతులు లేకుండా ప్రచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం , ఓటర్లకు డబ్బు, బహుమతులు పంపిణీ చేయడం నేరమని తెలిపారు. సభలు, ఊరేగింపులకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. అభ్యర్థులు రోజువారీ ప్రచార వ్యయ రికార్డులను పక్కాగా నిర్వహించాలని సూచించారు. పరిమితికి మించి ఖర్చు చేయకూడదని పేర్కొన్నారు. ప్రైవేటు భవనాలు, స్థలాలపై యజమాని అనుమతి పత్రం పొందకుండా, ఎన్నికల అధికారులకు సమాచారం ఇవ్వకుండా జెండాలు, బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేయరాదన్నారు.