Nomination రెండోరోజు జోరుగా.. నామినేషన్లు
ABN , Publish Date - Oct 18 , 2026 | 12:23 AM
Nomination Filing Gains Momentum on Day Two జిల్లాలోని పురపాలక సంఘాల్లో రెండో రోజు శనివారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. పార్వతీ పురంలో కౌన్సిలర్ల స్థానాలకు 57 , చైర్పర్సన్ కోసం రెండు , సాలూరులో కౌన్సిలర్ స్థానాల కోసం 58, చైర్పర్సన్ స్థానం కోసం రెండు, పాలకొండ నగర పంచాయతీలో చైర్పర్సన్ స్థానం కోసం ఒకటి, కౌన్సిలర్లు స్థానాలకు 17 నామినేషన్ పత్రాలు వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య నామినేషన్ల ప్రక్రియ సాగింది.
పార్వతీపురం/పార్వతీపురం టౌన్/సాలూరు/పాలకొండ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పురపాలక సంఘాల్లో రెండో రోజు శనివారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. పార్వతీ పురంలో కౌన్సిలర్ల స్థానాలకు 57 , చైర్పర్సన్ కోసం రెండు , సాలూరులో కౌన్సిలర్ స్థానాల కోసం 58, చైర్పర్సన్ స్థానం కోసం రెండు, పాలకొండ నగర పంచాయతీలో చైర్పర్సన్ స్థానం కోసం ఒకటి, కౌన్సిలర్లు స్థానాలకు 17 నామినేషన్ పత్రాలు వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య నామినేషన్ల ప్రక్రియ సాగింది. కౌన్సిలర్ల స్థానాలకు వైసీపీ నుంచి 36 , టీడీపీ 3, జేఎస్పీ 3, బీజేపీ3, సీపీఐ(ఎం) 2, సీపీఐ 1 , కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటి, ఇండిపెండెంట్లు 8 నామినేషన్ పత్రాలు వచ్చాయి. బీజేపీ నుంచి ద్వారపురెడ్డి జ్యోతి, కాంగ్రెస్ నుంచి పాలకొండ సంధ్య మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థులుగా నామినేష్లను దాఖలు చేశారు. కాగా అతి చిన్న వయస్కురాలైన కోరాడ వినీలా (23 ఏళ్లు) కౌన్సిలర్‌గా నామినేషన్ దాఖలు చేయడం చర్చనీ యాంశమైంది. సాధారణ ఎన్నికల రాష్ట్ర పరిశీలకుడు ఎస్.చిన్నరాముడు నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించినట్లు తెలిపారు. సాలూరు మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ల స్థానాలకు టీడీపీ నుంచి 23, బీజేపీ ఒకటి, ఇంటిపెండెంట్ ముగ్గురు, వైసీపీ నుంచి 31 నామినేషన్లు వచ్చాయి. చైర్పర్సన్ అభ్యర్థిత్వానికి వైసీపీ నుంచి ప్రేమా జీరీసా, టీడీపీ తరఫున కుసుమశ్రీ నామినేషన్ వేశారు. 28వ వార్డు కౌన్సిలర్‌గా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముగడ గంగమ్మ నామినేషన్ వేశారు. పాలకొండ నగర పంచాయతీలో కౌన్సిలర్ స్థానాలకు 17 నామినేషన్లు దాఖల య్యాయి. వైసీపీ నుంచి 12, జనసేన 2, ఇండిపెండెంట్లు ముగ్గురు నామినేషన్లు వేశారు. వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థిగా పాలవలస ఇందుమతి నామినేషన్ వేసినట్లు కమిషనర్ నూకరాజు తెలిపారు.
పార్వతీపురం చైర్పర్సన్ టీడీపీ అభ్యర్థిగా కరుణ
పార్వతీపురం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం పురపాలక సంఘం చైర్పర్సన్ టీడీపీ అభ్యర్థిగా బెలగాం కరుణను ఖరారు చేస్తూ టీడీపీ అధిష్ఠానం శనివారం రాత్రి జాబితా విడుదల చేసింది. గతంలో కరుణ పార్వతీపురం మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశారు. ఆమె భర్త బెలగాం జయప్రకాష్ నారాయణ (జయబాబు) పార్వతీపురం మున్సిపల్ వైస్ చైర్మన్‌గా గతంలో పనిచేశారు. పార్వతీపురం చైర్పర్సన్ సీటు కోసం నలుగురు పోటీ పడగా.. ఎమ్మెల్యే విజయచంద్ర , పార్టీ శ్రేణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత బీసీ సామాజిక వర్గానికి చెందిన కరుణ పేరును అధిష్ఠానం ఆమో దించింది. ఆమె ఎంబీఏ పూర్తి చేశారు. పార్వతీపురంలోనే నివసిస్తున్నారు. కాగా తనపై ఎంతో నమ్మకంతో సీటు ఇచ్చిన టీడీపీ అధిష్ఠానానికి కరుణ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం నామినేషన్ దాఖలు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆమె కోరారు. విద్యావంతురాలైన కరుణ పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ ఎంపిక చేయడంపై కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రశాంతంగా జరిగేలా చర్యలు: ఎస్పీ
బెలగాం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. శనివారం పార్వతీపురం మున్సిపల్ కార్యాల యంలో నామినేషన్ల స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లు, కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు, అభ్యర్థులు, వారి అనుచరులు రాకపోకలు ట్రాఫిక్ నియంత్రణ, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలీస్ అధికారులు, సిబ్బంది పక్కా ప్రణాళికలతో ఉండాలని ఎస్పీ ఆదేశించారు. నామినేషన్ దాఖలు సమయంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పరిస్థితులకు అనుగుణంగా బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. నగదు, మద్యం, ఇతర వస్తువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని, ఇందుకోసం ఏడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. అక్రమాలను అరికట్టేందుకు స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు ఏర్పాటు చేశామని, 24 గంటల పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ బి.రాంగోపాల్, ఎస్బీ సీఐ రమణమూర్తి, పార్వతీపురం పట్టణ, రూరల్ సీఐలు వెంకటరావు, రఘునాథం తదితరులు పాల్గొన్నారు.
నేటితో ముగియనున్న ప్రక్రియ
పార్వతీపురం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): నామినేషన్ల ప్రక్రియ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరికొంతమంది ఆశావహులు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. కాగా కూటమి పార్టీలో అభ్యర్థులకు ఎక్కువగా ఉన్నారు. నామినేషన్లు వేసిన తర్వాత ఉపసంహరించుకుంటారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. పార్వతీపురం పురపాలక సంఘాన్ని టీడీపీకి కేటాయించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు సతీమణి జ్యోతి చైర్పర్సన్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అదే విధంగా టీడీపీలో చాలా మంది సీనియర్ నాయకులు తమ సతీమణులు లేదా కుటుంబ సభ్యుల్లోని మహిళలతో నామినేషన్లు వేయించేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని రెండు పురపాలక సంఘాలతో పాటు నగర పంచాయతీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.