Nomination నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ
ABN , Publish Date - Nov 15 , 2026 | 12:29 AM
Nomination Filing Begins Today పంచాయతీల్లో ఎన్నికల సందడి నెలకొంది. జిల్లాలో మొదటిదశ పల్లెపోరుకు సర్వం సిద్ధమైంది. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభించనున్నారు. తొలిదశలో పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల పరిధిలోని బలిజిపేట, సీతానగరం, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం జియ్యమ్మవలస, గురుగుబిల్లి, కొమరాడ, కురుపాం మండలాల పరధిలో ఉన్న పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.
పల్లెపోరుకు సర్వం సిద్ధం
ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
పార్వతీపురం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): పంచాయతీల్లో ఎన్నికల సందడి నెలకొంది. జిల్లాలో మొదటిదశ పల్లెపోరుకు సర్వం సిద్ధమైంది. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభించనున్నారు. తొలిదశలో పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల పరిధిలోని బలిజిపేట, సీతానగరం, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం జియ్యమ్మవలస, గురుగుబిల్లి, కొమరాడ, కురుపాం మండలాల పరధిలో ఉన్న పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు నేటి నుంచి 17 తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ స్వీకరణ చేపట్టనున్నారు. ఇందుకోసం 60 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా 18న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. 21న మద్యాహ్నం మూడు గంటల్లోపు ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదేరోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటిస్తారు. పోటీలో ఉండే అభ్యర్థుల ప్రకటన అనంతరం గుర్తును కేటాయిస్తారు. అవే గుర్తులతో అభ్యర్థులు ప్రచారాలు నిర్వహిస్తారు. ఈ నెల 26న పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు మధ్యాహ్నం నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. కాగా మొదటి దశలో 226 పంచాయతీలకు సంబంధించి 2116 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. 3.46 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కను వినియోగించుకోనున్నారు. సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు పదవులకు ఎన్నికలు జరగనున్నాయి.
పటిష్ఠ భద్రత : ఎస్పీ
బెలగాం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా.. పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టామని, ఈ మేరకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ .. నామినేషన్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. అవసరమైన చోట సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి శాంతిభ ద్రతలకు విఘాతం కలగకుండా చూస్తామని వెల్లడించారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు కేవలం ఇద్దరు ప్రతినిధులను మాత్రమే కేంద్రంలోకి అనుమతి ఉంటుందన్నారు. నామినేషన్ కేం ద్రాల వద్దకు ర్యాలీలు, ఊరేగింపులు, గుంపులుగా రాకూడదని తెలిపారు.
వేలం పాడి.. ఏకగ్రీవం చేసుకుని..
పార్వతీపురం రూరల్, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): సుమారు 400 మంది ఓటర్లు ఉన్న కవిటిభద్ర పంచాయతీ రూ.12 లక్షలకు ఏకగ్రీవమైంది. టీడీపీ మద్దతుదారు శనివారం వేలం పాట ద్వారా రూ. 12 లక్షలకు ఏకగ్రీవం చేసుకుని సర్పంచ్ పదవిని సొంతం చేసుకున్నారు. సదరు వ్యక్తి ఈ నగదు మొత్తాన్ని గ్రామ పంచాయతీకి విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. కాగా గత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నాయకుడు వేలం పాట ద్వారా రూ.8 లక్షలకు ఏకగ్రీవం చేసుకుని సర్పంచ్ పదవిని పొందారు. కాగా ఇదే మండలంలోని మరో పంచాయతీ కూడా ఏకగ్రీవమైంది. సుమారు రూ. 13 లక్షలకు వేలం పాడి టీడీపీ మద్దతుదారు పుట్టూరు పంచాయతీని ఏకగ్రీవం చేసుకుని.. సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు.
19, 20 తేదీల్లో ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ ఎన్నిక
పార్వతీపురం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈనెల 19, 20 తేదీల్లో ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. పరోక్ష పద్ధతిలో కో ఆప్షన్ సభ్యులు, అధ్యక్ష, ఉపాఽధ్యక్షులను ఎన్నుకోనున్నారు. దీనికి సంబంధించి శనివారం కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మండలాల్లో ఈనెల 19న ఉదయం 10 గంటలకు కో-ఆప్షన్ సభ్యులు ఎన్నిక ప్రక్రియ ప్రారంభమ వుతుంది. అదే రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలోని 15 మండలాలకు ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. ఇక ఈనెల 20న కలెక్టరేట్‌లో జిల్లా ప్రజా పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. కలెక్టర్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తారు.