Share News

Nomination Fever నామినేషన్ల సందడి

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:26 AM

Nomination Fever జిల్లాలో తొలివిడత పల్లెపోరు ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ఆరంభమైంది. పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల పరిధిలో మొదటి రోజు సర్పంచ్‌ పదవులకు 82, వార్డు సభ్యులకు 99 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.

Nomination Fever నామినేషన్ల సందడి

  • తొలిరోజు సర్పంచ్‌ పదవులకు 82 , వార్డు సభ్యులకు99 పత్రాల దాఖలు

పార్వతీపురం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తొలివిడత పల్లెపోరు ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ఆరంభమైంది. పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల పరిధిలో మొదటి రోజు సర్పంచ్‌ పదవులకు 82, వార్డు సభ్యులకు 99 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. సోమవారం అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే పరిస్థితి ఉంది. కాగా ఈ నెల 17 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 18న వాటిని పరిశీలిస్తారు. 21 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. 26న మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అనంతరం ఓట్లు లెక్కింపు నిర్వహించి విజేతలను ప్రకటిస్తారు. కాగా మొదటి దశలో 226 పంచాయతీలు సంబంధించి 2,116 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

మండలాల వారీగా ...

వార్డు సభ్యుల పదవులకు సంబంధించి గుమ్మలక్ష్మీపురంలో ఏడు, జియ్యమ్మవలస 18, కురుపాం 16, గరుగుబిల్లి 9, కొమరాడ ఏడు, బలిజిపేట ఐదు, పార్వతీపురం 12, సీతానగరంలో 8 నామినేషన్లు వచ్చాయి. సర్పంచ్‌ పదవుల కోసం గుమ్మలక్ష్మీపురంలో 9, జియ్యమ్మవలస 18, కురుపాంలో 8, గరుగుబిల్లి 17, కొమరాడ 12, బలిజిపేట 12, పార్వతీపురం 19, సీతానగరంలో నాలుగు చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.

‘సూడిగాం’ ఏకగ్రీవం

పార్వతీపురం రూరల్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా.. పార్వతీపురం మండలంలో ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పుట్టూరు, కవిటిభద్ర పంచాయతీలు ఏకగ్రీవమవగా.. ఆ జాబితాలో సూడిగాం పంచాయతీ కూడా చేరింది. సూడిగాం గ్రామ సర్పంచ్‌ పదవిని టీడీపీ మద్దతుదారు గురజాన శ్రీదేవి రూ. 9 లక్షలకు దక్కించుకున్నారు. పంచాయతీ ఏకగ్రీవం కోసం ఆదివారం సూడిగాంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ మేరకు పార్టీలకతీతంగా గ్రామ పెద్దలంతా శ్రీదేవిని ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. అనంతరం శ్రీదేవి తన భర్త, పెదబొండపల్లి పీఏసీఎస్‌ అధ్యక్షుడు జి.చంద్రమౌళితో కలిసి పార్వతీపురం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే విజయచంద్రను కలిశారు. పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని, తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఎమ్మెల్యే వారికి తెలిపారు. మొత్తంగా పార్వతీపురం మండలంలో మూడు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

రూ.40 లక్షలు ఇస్తారట..

గరుగుబిల్లి: గరుగుబిల్లి మండలంలో గొట్టివలసలో గ్రామానికి చెందిన వ్యక్తి పంచాయతీ ఏకగ్రీవం కోసం రూ.40 లక్షలు అందిస్తామని ప్రకటించారు. మరో వ్యక్తి ఓటుకు రూ. 5 వేలు చెల్లిస్తాం అని ప్రకటించారు. అయితే దీనిపై గ్రామస్థుల నుంచి ఎటువంటి స్పందన లేదు. ఎన్నికలు జరగాల్సిందేనని ప్రజలు చెప్పడంతో అభ్యర్థులు ఖంగుతిన్నారు.

Updated Date - Nov 16 , 2026 | 12:26 AM