Share News

No Water Flow పనులు జరగవు.. నీరు పారదు

ABN , Publish Date - Jul 20 , 2026 | 11:59 PM

No Work, No Water Flow తోటపల్లి పాత రెగ్యులేటర్‌ కుడి కాలువ పరిధిలో సాగునీటి సరఫరాను నిలుపుదల చేశారు. పెద్దింపేట ప్రాంతంలో డ్రాప్‌లు శిథిలావస్థకు చేరడం, కాలువలు పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడం వల్ల దిగువ గ్రామాలకు నీరందకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా కాలువ పరిధిలో పెండింగ్‌ పనులు జరగక పోవడం వల్లే తరచూ సాగునీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయనే వ్యాఖ్యలు విని పిస్తున్నాయి.

 No Water Flow పనులు జరగవు.. నీరు పారదు
కుడి కాలువ నుంచి సాగునీరును నిలుపుదల చేసిన దృశ్యం

  • పిచ్చిమొక్కలతో నిండిన కాలువలు.. శిథిలావస్థలో డ్రాప్‌లు

  • ప్రస్తుతం సాగునీటి సరఫరాకు బ్రేక్‌

  • ఆందోళనలో రైతులు

గరుగుబిల్లి, జూలై20(ఆంధ్రజ్యోతి): తోటపల్లి పాత రెగ్యులేటర్‌ కుడి కాలువ పరిధిలో సాగునీటి సరఫరాను నిలుపుదల చేశారు. పెద్దింపేట ప్రాంతంలో డ్రాప్‌లు శిథిలావస్థకు చేరడం, కాలువలు పిచ్చిమొక్కలు ఏపుగా పెరగడం వల్ల దిగువ గ్రామాలకు నీరందకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా కాలువ పరిధిలో పెండింగ్‌ పనులు జరగక పోవడం వల్లే తరచూ సాగునీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయనే వ్యాఖ్యలు విని పిస్తున్నాయి. వాస్తవంగా ఖరీఫ్‌ సాగు కోసం ఈనెల2న ఎడమ ప్రధాన కాలువ, కుడి ఉప కాలువ నుంచి సాగునీరు విడుదల చేశారు. అయితే రెండు రోజుల్లోనే కుడి కాలువ పరిధిలోని సుంకి సమీపంలో గండి పడింది. దీంతో నీరు వృఽథాగా పోయింది. అయితే రైతుల సహకారంతో తాత్కాలికంగా గండిని పూడ్చిన అనంతరం సాగునీటిను విడుదల చేశారు. తాజాగా ఇప్పుడు నీటి సరఫరాను నిలిపేయడంపై ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. అసలు కుడి కాలువ పరిధిలోని సుంకి, మరుపెంట, గొట్టివలస, శివ్వాం, కొత్తూరు, అలాగే బలిజిపేట మండలం పెద్దింపేట ప్రాంతంలో కాలువలు దయనీయంగా మారాయి. దీంతో అధికంగా గండ్లు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడు నీరు విడుదల చేస్తారో, ఎప్పుడు నిలిపేస్తారో తెలి యని పరిస్థితి. మొత్తంగా కుడి కాలువకు సంబంధించి గరుగుబిల్లి, బలిజిపేట, విజయనగరం జిల్లా వంగర మండలాల పరిధిలోని సుమారు 9వేల ఎకరాలకు సాగునీటి సరఫరాలో నిత్యం ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాగా దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని ఆయా ప్రాంత రైతులు కోరుతున్నారు. వర్షాలు లేక నారుమడులు ఎండుతున్న తరుణంలో తరచూ ఇలా సాగునీటి సరఫరాలో అవాంతరాలు కలగకుండా చూడాలని వేడుకుంటున్నారు. ‘కుడి కాలువ పరిధిలో అవసరమైన పనులు నిర్వహించకపోవడంతోనే సాగునీటి సరఫరాకు ఆటంకాలు తప్పడం లేదు. పలు డ్రాపుల పరిధిలో పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. కాలువలు శిథిలావస్థకు చేరాయి. వాటిపై దృష్టి సారిస్తాం. రెండు రోజుల్లో సాగునీటిని విడుదల చేస్తాం. వరి ఉబాలుకు ముందు గండ్లు పూడ్చడంతో పాటు కాంక్రీటు పనులు చేపడతాం. రైతులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడతాం.’ అని తోటపల్లి పాత రెగ్యులేటర్‌ వీరఘట్టం సెక్షన్‌ ఏఈ డీవీ రమణ తెలిపారు.

Updated Date - Jul 20 , 2026 | 11:59 PM