Share News

No Work… పనుల్లేక.. జీవనం సాగక!

ABN , Publish Date - Mar 13 , 2026 | 11:48 PM

No Work… No Livelihood! స్థానికంగా పనుల్లేక.. జీవనం సాగించలేక సీతంపేట ఏజెన్సీలో నిరుపేద గిరిజన కుంటుంబాలు వలసబాటపడుతున్నాయి. పొట్ట చేత పట్టుకుని సుదూర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. దీంతో జనసంచారం లేక గిరిజన గ్రామాలు బోసిపోతున్నాయి.

No Work… పనుల్లేక.. జీవనం సాగక!
పనుల కోసం చెన్నైకు బయలుదేరిన బిడింగిగూడ గ్రామస్థులు

  • కుటుంబాలతో ఇతర ప్రాంతాలకు గిరిజనులు

  • బోసిపోతున్న గ్రామాలు

  • ఏటా ఇదే పరిస్థితి..

  • ఉపాధి మార్గాలు చూపడంలో అధికార యంత్రాంగం విఫలం

సీతంపేట రూరల్‌, మార్చి13(ఆంధ్రజ్యోతి): స్థానికంగా పనుల్లేక.. జీవనం సాగించలేక సీతంపేట ఏజెన్సీలో నిరుపేద గిరిజన కుంటుంబాలు వలసబాటపడుతున్నాయి. పొట్ట చేత పట్టుకుని సుదూర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. దీంతో జనసంచారం లేక గిరిజన గ్రామాలు బోసిపోతున్నాయి. మూటాముళ్లు సర్దుకుని.. ఇంటికి తాళాలు వేసి.. చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, సూర్యాపేట ,రాజమండ్రి వంటి పట్టణ ప్రాంతాలకు వలస పోతున్నారు. మొత్తంగా 53పంచాయతీల పరిధిలో సుమారు 100కిపైగా గిరిజన గ్రామాల నుంచి ఏటా ఎంతోమంది ఇతర ప్రాంతాలకు పయనమవుతున్నా.. స్పందించేవారే కరువయ్యారు. ఏదే మైనా వలసల నివారణలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇవీ కారణాలు..

- ఏజెన్సీలో వలసలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో ఉపాధి పనులు తగ్గిపోవడం, అటవీ ఉత్పత్తులకు డిమాండ్‌ లేకపోవడంతో గిరిప్రుతుల కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు. అంతేకాకుండా గిరిజనులు కొండచీపుర్ల పంటను చక్కదిద్దిన అనంతరం మూడు నెలల నుంచి ఆరునెలల వరకు గిరిజన ఉత్పత్తుల సేకరణ, కొండపోడు వ్యవసాయ పనులు ఉండడం లేదు. ఉపాధి హామీ పథకం కింద పూర్తిస్థాయిలో పనులు జరగకపోవడం, సకాలంలో వేతనాలు చెల్లింపులు జరగకపోవడం వంటి కారణాలు కూడా గిరిజన కుటుంబాలు వలసలు పోవడానికి కారణమవుతున్నాయి.

- వలసపోయిన గిరిజనులు పట్టణాల్లో వేరువేరుగా పనులు చేస్తుంటారు. మూడు నెలల పాటు కష్టపడిన తర్వాత సంపాదించిన డబ్బుతో తిరిగి సొంత గ్రామాలకు చేరుకుంటారు. ఆ డబ్బుతో ఇంటి అవసరాలు తీర్చుకొని మిగిలిన మొత్తంతో వ్యవసాయ పనులు చేపడుతుంటారు.

ఈ గ్రామాల నుంచే వలసలు..

సీతంపేట ఏజెన్సీలో ఏటా ఈ గ్రామాల నుంచే అత్యధికంగా గిరిజనులు వలసబాట పడు తున్నారు. ప్రధానంగా డొంబంగివలస, పూతికవలస, గూడంగికాలనీ, చింతమానుకాలనీ, ఈత మానుగూడ, పుట్టిగాం, గురండి, నడిమిగూడ, తుంబలిగూడ, ద్వారబంధం, రంగంవలస, గూడగుడ్డి, మూలగుడ్డి, ఆడలి, బిడిందిగూడ, బెన్నడుగూడ, పొంజాడ, కిండంగి, రశూల్‌పేట, ఎగువదారబ, బీరపాడు, ఇసపరాయి, పీవీ ఈతమానుగూడ తదితర గ్రామాలకు చెందిన గిరిజన కుటుంబాలు వలస పోతున్నాయి. స్థానికంగా ఉపాధి మార్గాలు లేక .. జీవనం కష్టమై ఒక్కో గ్రామం నుంచి కనీసం ఐదు నుంచి ఏడు కుటుంబాలు వరకు పట్టణ ప్రాంతాలకు తరలి పోతున్నాయి.

ఉపాధి ఏపీడీ ఏమన్నారంటే..

‘ సీతంపేట ఏజెన్సీలో పలు గిరిజన కుటుంబాలు వలసలు పోతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఉపాధి హామీ పథకం ద్వారా 100రోజుల పనిదినాలు పూర్తిచేసుకున్న కుటుంబాలకు ఉపాధి పనులు ఉండడం లేదని తెలిసింది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్తగా అమలు కానున్న వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా ప్రతీ కుటుంబానికి 125రోజుల పనిదినాలు కల్పిస్తాం. సకాలంలో వేతనాలు చెల్లింపులు జరిగే అవకాశం ఉంది. దీని ద్వారా వలసల నివారణ సాధ్యపడుతుంది. ’ అని ఉపాధి హామీ పథకం ఏపీడీ శ్రీహరి తెలిపారు.

ఆర్థిక భరోసా కల్పించాలి..

ఏటా వేసవి కాలంలో సీతంపేట ఏజెన్సీ నుంచి ఎంతోమంది వలస బాటపడుతున్నారు. ఇటువంటి గిరిజన కుటుంబాలకు ఆర్థికభరోసా కల్పించేలా ప్రభుత్వం చొరవతీసుకోవాలి. గ్రామాల్లో నిత్యం ఉపాధి పనులు ఉండేలా చూడాలి. పనికి తగ్గ వేతనం సకాలంలో అందించాలి.

- లక్ష్మణరావు, జిల్లా గిరిజన సంఘం అధ్యక్షుడు

==============================

పూర్తిస్థాయిలో పనులు జరగట్లే..

మా పంచాయతీ పరిధిలో ఏటా గిరిజనులు పట్టణ ప్రాంతాలకు వలసపోతున్నారు. గ్రామాల్లో పూర్తిస్థాయిలో ఉపాధిహామీ పథకం పనులు జరగడం లేదు. పనులు చేస్తున్న గిరిజన కుటుం బాలకు సకాలంలో వేతనాలు అందడం లేదు. గిరిజన ఉత్పత్తులకు కూడ సరైన గిట్టుబాటు ధర రావడం లేదు. మరోవైపు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు దెబ్బతినడంతో మరికొంత మంది గిరిజనులు పొట్ట చేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.

- జీలకర్ర సుందరమ్మ, సర్పంచ్‌, దారపాడు

Updated Date - Mar 13 , 2026 | 11:48 PM