No Water… నీరందక.. ఉభాలు పూర్తికాక!
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:37 AM
No Water… Transplanting Incomplete! జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన కాలువ నుంచి ఆయకట్టుకు సాగునీరందండం లేదు. శివారు ప్రాంతాల్లో నేటికీ వరి ఉభాలు పూర్తికాక పోవడంతో ఖరీఫ్ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా ఎల్‌నినో ప్రభావంతో జిల్లాతో పాటు ఎగువ ప్రాంతం ఒడిశాలోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులోనే కాదు సమీప చెరువుల్లోనూ జలకళ కనిపించడం లేదు.
వర్షాభావంతో ప్రాజెక్టులో తగ్గిన నీటి సామర్థ్యం
మరోవైపు సరఫరాను అడ్డుకుంటున్న ఎగువ ప్రాంతవాసులు
ఆందోళనలో ఖరీఫ్ రైతులు
గరుగుబిల్లి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన కాలువ నుంచి ఆయకట్టుకు సాగునీరందండం లేదు. శివారు ప్రాంతాల్లో నేటికీ వరి ఉభాలు పూర్తికాక పోవడంతో ఖరీఫ్ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా ఎల్‌నినో ప్రభావంతో జిల్లాతో పాటు ఎగువ ప్రాంతం ఒడిశాలోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులోనే కాదు సమీప చెరువుల్లోనూ జలకళ కనిపించడం లేదు. మరోవైపు ప్రాజెక్టు కాలువ పరిధిలో సరఫరా అవుతున్న సాగునీటిని పైప్రాంతాల్లోని రైతులు అడ్డుకుంటున్నారు. మదుములు కప్పి వేయడంతో దిగువకు నీరు సరఫరా కావడం లేదు. దీంతో శివారు గ్రామాల రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. కాలువల పరిధిలో సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేస్తున్నా ఫలితం కానరావడం లేదు.
ప్రాజెక్టు పరిధిలో కొమరాడ, పార్వతీపురం, గరుగుబిల్లి, సీతానగరం, మక్కువ మండలాల్లో తొమ్మిది వేల ఎకరాలకు గాను సుమారు 6 వేల ఎకరాలకే సాగునీరు అందుతుంది. గరుగుబిల్లికి సంబంధించి నీరు సరఫరా కాకపోవడంతో వరి నారుమళ్లు ఎండుతున్నాయి. గొట్టివలస, గరుగు బిల్లి, పెద్దూరు, ఉద్దవోలు, గొల్లవానివలస, ఉల్లిభద్ర, కొంకడివరం, సీతారాంపురంతో పాటు పలు గ్రామాల్లో ఉభాలు జరగడం లేదు. మొత్తంగా శివారు గ్రామాల్లో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై జంఝావతి ప్రాజెక్టు ఏఈఈ పి.పవన్‌కుమార్‌ను వివరణ కోరగా.. ‘ వర్షాలు లేక జంఝావతి రబ్బర్ డ్యాంలో నీటి సామర్థ్యం తగ్గింది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి సరఫరా అవుతున్న నీటిని పైప్రాంతాల్లోని రైతులు మదుములు కప్పి వేయడంతో దిగువ ప్రాంతాలకు అందడం లే దు. పరిశీలన సమయంలో బాగానే ఉన్నా.. ఆ తర్వాత యథా స్థితి నెలకొంటోంది. సాగునీటి సరఫరాను వారాబందీగా చేసినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. అనధికారికంగా మదుములును కప్పిన రైతులపై పోలీస్ కేసులు నమోదు చేస్తున్నాం. పైప్రాంతాల్లోని రైతులు నిర్వాహకంతో దిగువ ప్రాంతాల వారికి నష్టం కలుగుతుంది. శివారు గ్రామాలకు సాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు.
- పి.పవన్‌కుమార్, ఏఈఈ, జంఝావతి ప్రాజెక్టు, పార్వతీపురం