No Water for Paddy Nurseries! నారుకు నీరందట్లే!
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:46 PM
No Water for Paddy Nurseries! జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు జలకళ లేక వెలవెల బోతున్నాయి. గతేడాదితో పోలిస్తే భారీగా నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఎల్‌నినో ప్రభావంతో వరుణుడు ముఖం చాటేశాడు. ఒడిశాతో పాటు జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. దీంతో జలాశయాల్లో రోజురోజుకూ నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఇదే సమయంలో వాటి పరిధిలో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది.
ముఖం చాటేసిన వరుణుడు
ప్రాజెక్టుల్లో అడుగంటుతున్న నీటి నిల్వలు
పొలాలకు చేరని సాగునీరు
ఎండుతున్న నారుమడులు..
ఆందోళనలో రైతులు
ఖరీఫ్ సాగు కష్టమేనా?
పార్వతీపురం, జూలై21(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు జలకళ లేక వెలవెల బోతున్నాయి. గతేడాదితో పోలిస్తే భారీగా నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఎల్‌నినో ప్రభావంతో వరుణుడు ముఖం చాటేశాడు. ఒడిశాతో పాటు జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. దీంతో జలాశయాల్లో రోజురోజుకూ నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ఇదే సమయంలో వాటి పరిధిలో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఓ వైపు వర్షాలు లేక.. మరోవైపు ప్రాజెక్టుల నుంచి సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నారుమడులను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల బిందెలతో నీటిని తెచ్చుకుని.. నారుమడికి తడి అందిస్తున్నారు. మొత్తంగా ఖరీఫ్ ఆరంభంలోనే జిల్లాలో అన్నదాతలకు కష్టాలు మొదలయ్యాయి.
నీటి నిల్వలు ఇలా..
- వీఆర్‌ఎస్ ప్రాజెక్టులో 1.683 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1.630 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 24,700 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. అయితే నీటి నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో మన్యంతో పాటు విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో ఉన్న ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒడిశాలో లేదా జిల్లాలో వర్షాలు కురిస్తే ఖరీఫ్ సాగుకు ఢోకా ఉండదు. లేకుంటే శివారు ప్రాంతాలకు నీరందడం కష్టమేనని రైతులు వాపోతున్నారు.
- పెద్దగెడ్డ ప్రాజెక్టు ద్వారా 12,721 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. అయితే ప్రస్తుతం జలాశయంలో 0.949 టీఎంసీలకు గాను 0.605 టీఎంసీలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులోనూ నీటి నిల్వలు అడుగంటడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
- ఇక జియ్యమ్మవలస మండలంలో ఒట్టిగెడ్డ రిజర్వాయర్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఈ ప్రాజెక్టులోనూ నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఖరీఫ్ సాగు ఎలా? అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు.
- తోటపల్లి ప్రాజెక్టులో 2.534 టీఎంసీలకు గాను ప్రస్తుతం 2.283 టీఎంసీల మేర నీటినిల్వలు ఉన్నాయి. అయితే ప్రాజెక్టు పరిధిలో ఖరీఫ్ సాగుకు ఎటువంటి ఢోకా లేదని ఆ శాఖ ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయకట్టుకు సాగునీరు విడుదల చేశామని తెలిపారు. కాగా ఎగువ ప్రాంతం ఒడిశాలో వర్షాలు కురవడంతో తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళికి మంగళవారం 1200 క్యూసెక్కుల వరద చేరింది. అధికారులు అప్రమత్తమై దిగువ ప్రాంతాలకు స్పిల్‌వే గేట్ల నుంచి 2,200 క్యూసెక్కులను విడుదల చేశారు. ప్రధాన కాలువల నుంచి సుమారు 1,020 క్యూసెక్కుల మేర సాగునీటిని సరఫరా చేస్తున్నారు.
నారుమడులను కాపాడునేందుకు పాట్లు
వీరఘట్టం: వర్షాలు కురవకపోవడం, తోటపల్లి ఎడమ కాలువల ద్వారా పూర్తిస్థాయిలో సాగు నీరు రాకపోవడంతో మండల పరిధిలో నారుమడులు ఎండుతున్నాయి. దీంతో వాటిని రక్షిం చుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కిమ్మి, కొట్టుగుమ్మడ, గడగమ్మ, తెట్టంగి, వండువ గ్రామాల రైతులు సుదూర ప్రాంతాల్లో ఉన్న బోరులు, చెరువులు, నాగావళి నది నుంచి డ్రమ్ములు, బకేట్లు, బిందెలతో నీటిని తెచ్చి నారుమడులు తడుపుతున్నారు. మొత్తంగా వర్షాభావంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఆకాశంవైపు చూ సిన కళ్లతో ఇప్పుడు కన్నీరు కారుస్తున్నారు.
ఎడారిని తలపిస్తున్న చెరువులు
గరుగుబిల్లి: మండలంలో సుమారు 110 చెరువులు ఎడారిని తలపిస్తున్నాయి. వర్షాలు కురవకపోవడం, జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని కాలువ నుంచి సాగునీరు సరఫరా కాకపో వడంతో చెరువులు జలకళ లేక వెలవెలబోతున్నాయి. ఏదేమైనా నీటి నిల్వలు పెరిగితేనే ఈ ఏడాది ఖరీఫ్ రైతులు ఆశలు ఫలించే అవకాశం ఉంది.
ఇలా అయితే కష్టమే..
వెంగళరాయసాగర్ ప్రాజెక్టుకు సమీపంలో మా పొలాలు ఉన్నాయి. ఏటా ఈ సమయానికి ఉబాలు పూర్తి చేసేవాళ్లం. అయితే ఈ ఏడాది వర్షాలు కురవకపోవడం, ప్రాజెక్టు నుంచి పూర్తి స్థాయిలో నీరందకపోవడంతో ఖరీఫ్ పనులు చేపట్టలేకపోతున్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే ఖరీఫ్ సాగు కష్టమే..
- గొంగాడ భూషణం, రైతు, చెముడు , మక్కువ మండలం
==================================
నారుమడులు ఎండిపోతున్నాయి
సకాలంలో వర్షాలు కురవని కారణంగా నారుమడులు ఎండుతున్నాయి. వీటిని కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నాం. దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చి వాటికి తడి అందిస్తున్నాం.
- ఉమామహేశ్వరరావు, రైతు, కిమ్మి, వీరఘట్టం మండలం
==================================
ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం..
జిల్లాలో వీఆర్‌ఎస్, పెద్దగెడ్డ ప్రాజెక్టులతో పాటు ఒట్టిగెడ్డ రిజర్వాయర్ పరిధిలో పూర్తిస్థాయిలో నీటి నిల్వలు లేవు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం. ఒడిశాలో వర్షాలు కురిస్తే ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది. ఏదేమైనా ఖరీఫ్ పంటలకు ఇబ్బంది లేకుండా ఆగస్టు మొదటి వారంలో సాగునీటిని విడుదల చేస్తాం.
- ప్రదీప్, ఇంజనీరింగ్ అధికారి, జిల్లా ఇరిగేషన్ శాఖ