No traffic problems ట్రాఫిక్ చిక్కులు ఉండవిక
ABN , Publish Date - Mar 31 , 2026 | 11:47 PM
No traffic problems విజయనగరం-శ్రీకాకుళం-పార్వతీపురం మన్యం-ఒడిశాలోని రాయగడను కలిపే స్టేట్‌హైవే దశ త్వరలో మారనుంది. 131 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు విస్తరించనుంది. డీపీఆర్ కూడా సిద్ధమవ్వడంతో ఇక టెండర్ ఖరారై పనులు మొదలుకావడమే ఆలస్యం. ఇదే జరిగితే ఆ రోడ్డులో ట్రాఫిక్ చిక్కులు ఉండవు. ప్రశాంతంగా, సౌకర్యవంతంగా ప్రయాణం సాగించవచ్చు.
ట్రాఫిక్ చిక్కులు ఉండవిక
చిలకపాలెం-రామభద్రపురం-బొబ్బిలి-రాయగడ స్టేట్‌హైవేకు మహర్దశ
131 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ
డీపీఆర్ సిద్ధం
విజయనగరం-శ్రీకాకుళం-పార్వతీపురం మన్యం-ఒడిశాలోని రాయగడను కలిపే స్టేట్‌హైవే దశ త్వరలో మారనుంది. 131 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు విస్తరించనుంది. డీపీఆర్ కూడా సిద్ధమవ్వడంతో ఇక టెండర్ ఖరారై పనులు మొదలుకావడమే ఆలస్యం. ఇదే జరిగితే ఆ రోడ్డులో ట్రాఫిక్ చిక్కులు ఉండవు. ప్రశాంతంగా, సౌకర్యవంతంగా ప్రయాణం సాగించవచ్చు.
బొబ్బిలి, మార్చి31(ఆంధ్రజ్యోతి):
అంతర్రాష్ట్ర రహదారికి మహర్దశ కలగనుంది. శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం జంక్షన్ నుంచి విజయనగరం జిల్లా రాజాం, రామభద్రపురం, బొబ్బిలి, పార్వతీపురం మన్యం జిల్లా మీదుగా రాయగడకు వెళ్లే రాష్ర్టీయ రహదారిని నాలుగులైన్ల మేర విస్తరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ), హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఎఎం) పద్ధతిలో ఈ పనులు చేపట్టనున్నారు. రూ.1172 కోట్లతో డీపీఆర్‌ను ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో సిద్ధం చేశారు. రామభద్రపురం నుంచి రాజాం, ఇటు బొబ్బిలి మీదుగా పార్వతీపురం, రాయగడ మధ్య రహదారి పూర్తిగా మారుతుందని వాహనదారులు భావిస్తున్నారు. అలాగే భారీ వాహనాల రాకపోకలతో ఏర్పడే రద్దీని తట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రయాణసమయం ఆదా అవుతుంది. వ్యవసాయ, వాణిజ్య ఉత్పత్తుల రవాణా ఇతరత్రా సదుపాయాలు మెరుగుకానున్నాయి. వ్యాపారులకు ఆర్థిక పరంగా కూడా తోడ్పాటు లభించనుంది.
- పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రంతో ఈ రాష్ర్టీయ రహదారి అనుసంధానంగా ఉన్న నేపథ్యంలో విస్తరణ, అభివృద్ధికి నోచుకోవడంతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు, సరకుల రవాణా వేగవంతమవుతాయి. రామభద్రపురం నుంచి బొబ్బిలి మీదుగా రాయగడ వరకు చత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్ ప్రాంతాలకు చెందిన పలు భారీ వాహనాల రద్దీ విపరీతంగా పెరగడంతో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకోవడం, ట్రాఫిక్ జామ్ కావడం జరుగుతోంది. ఇక ఆ సమస్యలకు చెక్ పడనుంది. డీపీఆర్ సిద్ధం కావడంతో త్వరలోనే టెండర్లు ఖరారు కానున్నాయి.
త్వరలోనే టెండర్లు ఖరారు
బీఏ రాజు, ఆర్‌అండ్‌బీ జేఈ
చిలకపాలెం-రాయగడ రాష్ర్టీయ రహదారి విస్తరణ, అభివృద్ధికి సంబంధించిన డీపీఆర్ పనులు ప్రైవేట్ భాగస్వామ్యంలో పూర్తయ్యాయి. ఇదంతా ఓ ఏజన్సీ ఆధ్వర్యంలో జరుగుతోంది. త్వరలో టెండర్లు ఖరారవుతాయని సమాచారం ఉంది.