No Bill Payments! తారు లేదు.. బిల్లుల చెల్లింపుల్లేవు!
ABN , Publish Date - Nov 15 , 2026 | 12:26 AM
No Tar Roads, No Bill Payments! జిల్లాలోని బీటీ, సీసీ రహదారుల నిర్మాణాల్లో పురోగతి కనిపించడం లేదు. ఓ వైపు తారు లభించకపోవడం.. మరోవైపు సకాలంలో బిల్లుల చెల్లింపు కాకపోవడమే ఈ పరిస్థితికి కారణం. కాగా కొన్నిచోట్ల రోడ్డు నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. అయితే ఈ నెలాఖరులోగా బీటీ రహదారులు నిర్మాణాలు పూర్తి చేయాలని మరోవైపు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. జిల్లాలోకు 106 రహదారులు మంజూరయ్యాయి.
చేతులెత్తేస్తున్న కాంట్రాక్టర్లు
నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారుల ఆదేశాలు
పార్వతీపురం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని బీటీ, సీసీ రహదారుల నిర్మాణాల్లో పురోగతి కనిపించడం లేదు. ఓ వైపు తారు లభించకపోవడం.. మరోవైపు సకాలంలో బిల్లుల చెల్లింపు కాకపోవడమే ఈ పరిస్థితికి కారణం. కాగా కొన్నిచోట్ల రోడ్డు నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. అయితే ఈ నెలాఖరులోగా బీటీ రహదారులు నిర్మాణాలు పూర్తి చేయాలని మరోవైపు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. జిల్లాలోకు 106 రహదారులు మంజూరయ్యాయి. సుమారు 69 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు నిర్మించాల్సి ఉంది. కాగా ఇప్పటివరకు 18 రహదారులు మాత్రమే పూర్తయ్యాయి. మరో 70 రహదారుల పనులు వివిధ దశలో ఉన్నాయి. మరో 18 రహదారులు పనులు నేటికీ ప్రారంభం కాలేదు. తారు లభ్యం కాకపోవడంతో అనేకచోట్ల బీటీ రహదారి నిర్మాణాలు పూర్తికావడం లేదు. ప్రస్తుతం విశాఖ పట్నంలో తారు దొరకడం లేదు. జిల్లాలో పనులకు చెన్నై నుంచి తారు తెప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అదనపు రవాణా చార్జీలు భారంగా మారుతున్నాయి. ఇకపోతే జిల్లాకు 2001 సీసీ రోడ్లు మంజూరైతే.. కేవలం 908 రోడ్లు పనులు మాత్రమే పూర్తయ్యాయి. మరో 66 రహదారుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. 1027 వరకు రహదారి పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటివరకు సుమారు రూ.43 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే వదిలేశారు.
బిల్లులు చెల్లిస్తున్నాం
పూర్తి చేసిన రోడ్డు పనులకు బిల్లులు అప్‌లోడ్ చేస్తున్నాం. త్వరలోనే చెల్లింపులు చేస్తాం. తారు లభ్యం కాకపోవడం వల్ల బీటీ రోడ్దు నిర్మాణాలు సకాలంలో పూర్తికావడం లేదు. ఏదేమైనా సకాలంలో పనులు పూర్తిచేస్తాం.
- ప్రదీప్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి