No stock నో స్టాక్
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:14 AM
No stock జిల్లాలో ‘పెట్రో’ కష్టాలు ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియా దేశాలలో నెలకొన్న యుద్ధం ఫలితంగా ఇప్పటికే గ్యాస్ బండ ప్రజలకు గుదిబండగా మారింది. తాజాగా పెట్రోల్, డీజిల్ కొరత జనాన్ని మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని జిల్లా యంత్రాంగం ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ కోసం బంక్‌లవద్ద గంటల తరబడి వాహనాలతో బారులు తీరుతున్నారు.
నో స్టాక్
డీజిల్ లేదంటున్న బంకుల నిర్వాహకులు
నిలిచిపోతున్న ఫోర్‌వీలర్లు, ఆటోలు
పెట్రోల్ కోసమూ పాట్లు
వాహనదారులతో కిటకిటలాడుతున్న బంకులు
జిల్లాలో ‘పెట్రో’ కష్టాలు ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియా దేశాలలో నెలకొన్న యుద్ధం ఫలితంగా ఇప్పటికే గ్యాస్ బండ ప్రజలకు గుదిబండగా మారింది. తాజాగా పెట్రోల్, డీజిల్ కొరత జనాన్ని మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని జిల్లా యంత్రాంగం ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ కోసం బంక్‌లవద్ద గంటల తరబడి వాహనాలతో బారులు తీరుతున్నారు.
విజయనగరం/ రాజాం రూరల్/ భోగాపురం, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 158 బంకులు ఉన్నాయి. ప్రస్తుతానికి పెట్రోల్ కొంతవరకు దొరుకుతోంది. డీజిల్ ఎక్కడా లేదంటున్నారు. రోజుకు సగటున 4.50 లక్షల నుంచి 5 లక్షల లీటర్ల వరకూ డీజిల్ విక్రయిస్తుంటారు. ఇప్పుడు రోజుకు 2 లక్షల నుంచి 2.50 లక్షల లీటర్ల వరకూ మాత్రమే చమురు కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. ఇది ఏ మూలకు చాలడం లేదు. ఎక్కడికక్కడే నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తెలిసిన వారికి డీజిల్ అందించి.. తెలియని ముఖాలకు అందించడం లేదు. దీంతో రోజురోజుకూ డీజిల్ కొరత జఠిలంగా మారిపోతోంది. డీజిల్ కోసం బంకులకు వెళ్లే వినియోగదారుల్లో 90 శాతానికి పైగా నిరాశతో వెనుతిరుగుతున్నారు. డీజిల్ స్టాక్ లేదని, ఎప్పుడు వస్తుందో చెప్పలేమని బంకుల నిర్వాహకులు చెబుతుండడంతో చేసేదిలేక వాహనదారులు తిరుగుముఖం పడుతున్నారు. డీజిల్ కొరత ఉందని ప్రచారం జరుగుతుండడమో, పారిశ్రామిక వర్గాలకు గుట్టుగా చేరడమో, కృత్రిమ కొరత సృష్టిస్తుండడమో కాని డీజిల్ విరివిగా బయట దొరకడం లేదు. దీంతో లారీలు, ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. హైవేలపై దూర ప్రాంతాలనుంచి రాకపోకలు సాగించే లారీలు గత్యంతరం లేక డీజిల్ వచ్చేంతవరకు నిరీక్షిస్తున్నారు. కోల్‌కతా, చెన్నై వంటి దూర ప్రాంతాల నుంచి సరుకు తీసుకొస్తున్నామని, సమయానికి గమ్యానికి చేరవేయకపోతే చాలా నష్టం వస్తుందని లారీ డైవ్రర్లు వాపోతున్నారు. అలాగే డీజిల్ అయిపోవడంతో పాసింజర్లతో ఉన్న ఆటోలను మార్గమధ్యలో నిలిపేసి పడుతున్న ఇక్కట్లు ఇన్నీఅన్నీ కావు. ఇక రవాణాపై ఉపాధి పొందుతున్న చాలా మంది వ్యాన్ డ్రైవర్లు డీజిల్ లేక ఇళ్ల వద్దే ఉండిపోతున్నారు. దీనిపై భోగాపురం సీఎస్‌డీటీ మురళీని వివరణ కోరగా భోగాపురం పెట్రోల్ బంకులో ఉదయం డీజిల్ ఉందని, మఽధ్యాహ్నానానికి అయిపోయిందని చెప్పారు. చాలా మంది అవసరం లేకున్నా అధికంగా డీజిల్‌ను వాహనాలకు నింపుతున్నారని అన్నారు. కాగా విజయనగరంలోని అన్ని బంకుల వద్ద డీజిల్ కోసం వాహనదారులు సోమవారం బారులుతీరడం కనిపించింది.
- పెట్రోల్ కష్టాలు సోమవారం నుంచి ప్రత్యక్షంగా కనిపించాయి. చాలా బంకుల్లో మధ్యాహ్నానికి పెట్రోల్ లేదు. నో స్టాక్ బోర్డులు కూడా పెట్టేశారు. ఇంకొన్ని బంకుల వద్ద వాహనాలు బారులు తీరి కనిపించాయి. గంటకు పైగా వేచి ఉంటే ద్విచక్ర వాహనాలకు రూ.100 నుంచి రూ.200, ఆటోలకు రూ.300 వందల నుంచి రూ.500, కార్లకు రూ.1000 నుంచి రూ.1500 కోటాగా పెట్రోల్ పోయడంతో వాహనచోదకులు ఈసురోమన్నారు. రాజాం పట్టణ పరిసరాలలో పది పెట్రోల్ బంకులుండగా ఎక్కడా డీజిల్ అందుబాటులో లేదు. మూడు బంకుల్లో పెట్రోల్ సైతం సోమవారం సాయంత్రానికి అయిపోయింది. మంగళవారం సాయంత్రానికి ట్యాంకులు వచ్చే అవకాశం ఉందని బంకుల యజమానులు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో పెట్రోల్ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని ఓ బంక్ యజమాని పొట్టా రమేష్‌చంద్ర గుప్త ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
ఇండెంట్ పెడుతున్నా..
జిల్లా నుంచి అన్ని బంకుల నుంచి ఇండెంట్ వెళుతోంది. కానీ కొన్ని బంకులకు రోజు విడిచి రోజు చమురు కంపెనీలు పంపిస్తున్నాయి. మరికొన్ని బంకులకు మూడు రోజులకు ఒకసారి డీజిల్ సరఫరా జరుగుతోంది. జిల్లాలో హెచ్‌పీ, ఇండియన్, భారత్ పెట్రోలియం బంకులు అధికంగా ఉన్నాయి. దాదాపు అన్ని కంపెనీలదీ అదే పరిస్థితి. డీలర్లు నగదు డీడీలు చెల్లించినా ఫలితం లేకపోతోంది. దీంతో బంకుల యజమానులపై ఒత్తిడి పెరుగుతోంది. అధికారుల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. కంపెనీలకు డీడీలతో పాటు ఇండెంట్‌లు పంపిస్తున్నా అనుకున్న స్థాయిలో డీజిల్ సరఫరా కావడం లేదని బంకుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరో రెండు రోజుల్లో ఈ పరిస్థితి కొలిక్కి రావొచ్చని అటు అధికారులు, బంకుల యజమానులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీరియస్‌గా దృష్టిపెట్టిన క్రమంలో మంగళవారం సాయంత్రానికి గాడినపడే అవకాశముందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
స్టాకు అయిపోయింది
ఈనెల 25న 30వేల లీటర్ల డీజిల్ వచ్చింది. అదే రోజున 18664 లీటర్లు, 26వ తేదీన 9944లీటర్లు అమ్మకాలు జరిగాయి. మిగతా 1392 లీటర్లు 27వ తేదీ మధ్యహ్నం 12.30 వరకు వచ్చింది. అప్పటి వరకు వచ్చిన అన్ని వాహనాలకు డీజిల్ వేశాం. స్టాకు అయిపోవడంతో ఏమి చేయలేకపోతున్నాం. వచ్చిన వాహనాలకు డీజిల్ లేదని చెబుతున్నాం.
- చిన్ని, పెట్రోల్ బంకు నిర్వాహకుడు, భోగాపురం
ఎక్కడా డీజిల్ లేదు
ఈనెల 26వ తేదీ రాత్రి శ్రీకాకుళంలో బయలు దేరాం. చెన్నై వెళ్తున్నాం. లారీలో డీజిల్ చివరి దశకు చేరుకోవడంతో ఆగిపోతుందన్న భయంతో డీజిల్ కోసం ప్రతీ పెట్రోల్ బంకు దగ్గర అడుగుతూ వచ్చాం. ఎక్కడా డీజిల్ దొరకలేదు. ఇక్కడ కూడా డీజిల్ అయిపోయిందంటున్నారు. వచ్చేంతవరకు ఇక్కడే వేచి ఉంటాం. సరుకు సమయానికి చేరవేయకపోతే నష్టం వస్తుంది. డీజిల్ కొరత ఉందని తెలిస్తే సరుకు లారీకి ఎక్కించేవాళ్లం కాదు.
ఆటోయే ఆధారం
ఆటో నడుపుతూ ఉపాధి పొందుతున్నాను. పైనాన్స్ పోను ఆటోపై రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించుకొంటున్నాను. ఆటోలో డీజిల్ అయిపోవడంతో పాసింజర్లతో ఆటోని పూసపాటిరేగ మండలం కోనాడ జంక్షన్ సమీపంలో ఉంచేశాను. ఇక్కడ డీజిల్ లేదంటున్నారు. డీజిల్ లేకపోతే ఆటో తిప్పలేం. ఆటో లేకపోతే జీవనాధారం లేనట్టే.
అల్లుపల్లి సత్యం, ఆటోడ్రైవర్, కోష్ఠ, శ్రీకాకుళం జిల్లా
ఒక్కో బంకు వద్ద వీఆర్వో
లక్కవరపుకోట, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): ఎల్.కోట మండలంలోని నాలుగు బంకులున్నాయి. డీజిల్ లేదనే పుకార్లతో వినియోగదారులు ఒక్కసారిగా సోమవారం బంకులకు క్యూ కట్టారు. అయితే కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ ఒక్కో బంకు వద్ద వీఆర్వోలను షిప్ట్‌లలో నియమించారు. వాహనాలు వస్తే తప్పా డ్రమ్ములు, కేన్లు, బాటిల్స్, ఇతర నిల్వ ఉంచుకునే సామగ్రికి డీజిల్, పెట్రోలు నింపరాదని ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రానికి నాలుగు బంకుల్లో డీజిల్ సుమారు 25వేల లీటర్లు, పెట్రోల్ సుమారుగా 35 వేల లీటర్లు నిల్వ ఉన్నట్టు తహసీల్దార్ రమేష్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను ఎక్కడైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలతో పాటు బంకులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
పర్యవేక్షించిన పోలీసులు
గంట్యాడ, ఏప్రిల్ 27(ఆంరఽధజ్యోతి): కొటారుబిల్లి పెట్రోల్ బంకు వద్ద వాహనదారులు సోమవారం సాయంత్రం బారులు తీరారు. కొండతామరాపల్లి, కొటారుబిల్లి, రామవరం, గంట్యాడ పెట్రోల్ బంకుల్లో ఆదివారం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకూ పెట్రోల్ లేదు. సాయంత్రం కొటారుబిల్లి పెట్రోలు బంకుకు నిల్వలు రావడంతో వినియోగదారులు బారులు తీరారు. గంట్యాడ ఎస్‌ఐ సాయికృష్ణ, సిబ్బంది పెట్రోల్ బంకు వద్ద ఉండి పర్యవేక్షించారు. ద్విచక్ర వాహనదారులకు రూ.100 విలువగల పెట్రోల్, నాలుగు చక్రవాహనాలకు రూ.1000 చొప్పున పెట్రోల్ వేశారు.