సిబ్బంది లేరు.. షట్టర్లు లేవు
ABN , Publish Date - Jun 25 , 2026 | 11:30 PM
తోటపల్లి ప్రాజెక్టు పాత కుడి, ఎడమ కాలువల ఆయకట్టు రైతులు ప్రతీ సంవత్సరం సాగునీటి కోసం ఆందోళనకు గురవుతున్నారు.
- సాగునీటి కోసం రైతుల్లో ఆందోళన
వీరఘట్టం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి ప్రాజెక్టు పాత కుడి, ఎడమ కాలువల ఆయకట్టు రైతులు ప్రతీ సంవత్సరం సాగునీటి కోసం ఆందోళనకు గురవుతున్నారు. ఈ కాలువల పరిధిలో చాలాచోట్ల షట్టర్లు లేవు. కొన్ని చోట్ల మరమ్మతులకు గురయ్యాయి. పూడికలు సక్రమంగా తీయకపోవడంతో కాలువలు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. మరోపక్క సిబ్బంది కొరత వేధిస్తుంది. వీరఘట్టంలోని తోటపల్లి ప్రాజెక్టు కార్యాలయం పరిధిలో ముగ్గురు ఐజీలు, ముగ్గురు వర్క్ ఇన్‌స్పెక్టర్లు, 25 మంది లస్కర్లతో కలిసి 31 మంది అధికారులు ఉండాలి. కానీ, ప్రస్తుతం నలుగురు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యాలయం పరిధిలో సుమారు 25 వేల ఎకరాలకు సాగునీరు సక్రమంగా అందే విధంగా చూడాలి. అయితే, లస్కర్ల కొరతతో కాలువల నిర్వహణ అధ్వానంగా ఉంది. దీంతో సాగునీటి కోసం రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ సంవత్సరం జూలై రెండు లేదా మూడో వారంలో సాగునీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి షట్టర్లను బాగు చేయాలని, తాత్కాలికంగానైనా లస్కర్లను నియమించాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఏఈ డీవీ రమణను వివరణ కోరగా.. ఉన్నతాధికారులకు తెలియజేశామని, నిధులు మంజూరైతే ప్రధాన గేట్లు, పిల్ల కాలువల షట్టర్లు మరమ్మతులు చేపడతామని అన్నారు.