No Shortage of Fuel ఇంధన కొరత లేదు
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:10 AM
No Shortage of Fuel జిల్లాలో ఇంధన కొరత లేదని, దీనిపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయన్నారు.
పెట్రోల్ బంకుల్లో ఆకస్మిక తనిఖీలు
పార్వతీపురం/బెలగాం, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇంధన కొరత లేదని, దీనిపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇంధన సరఫరా సజావుగా సాగుతుందన్నారు. ప్రజలు వదంతులను నమ్మరాదని హితవు పలికారు. మంగళవారం పార్వతీపురం పట్టణంతో పాటు సమీప గ్రామాల్లో పలు పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా స్టాక్ అయిపోకుండా చూడాలని , అవసరమైన వెంటనే ఇండెంట్ పెట్టి సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. ఇంధన సరఫ రాలో జాప్యం జరిగితే సహించేది లేదన్నారు. అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు: సబ్ కలెక్టర్
పాలకొండ, ఏప్రిల్28(ఆంధ్రజ్యోతి): పెట్రోల్, డీజిల్‌కు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ హెచ్చరించారు. మంగళవారం పట్టణంతో పాటు మం డలంలోని సింగన్నవలస వద్ద పెట్రోల్ బంకును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిల్వలు, రికార్డులు పరిశీలించారు. వాహనదారులకు సక్రమంగా పెట్రోల్, డీజిల్‌ను అందించాలని బంకు యజమానులను ఆదేశించారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇంధన విక్రయాలు నిలిపి వేసినా, బ్లాక్ మార్కెటింగ్‌కు తరలించినా సహించేది లేదన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన వారిపై చర్యలు తప్పవన్నారు.
- మరోవైపు డీఎస్పీ ఎం.రాంబాబు పట్టణం లోని పలు పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. బంకు యజమానులకు పలు సూచనలు చేశారు. బాటిళ్లు, క్యాన్ల ద్వారా ప్రజలు పెట్రోల్, డీజిల్ తీసుకెళ్లరాదన్నారు. పెట్రోల్, డీజిల్ నిల్వలను ఇళ్లలో ఉంచుకోవడం ప్రమాదకరమని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ రాధాకృష్ణ తది తరులు ఉన్నారు.