Share News

no records those lands పేరుకే వారి భూములు

ABN , Publish Date - Mar 14 , 2026 | 12:29 AM

no records to those lands ఆ భూముల్లో తాతలు, తండ్రుల నుంచి రైతులు సాగు చేసుకుంటున్నారు. దశాబ్దాలుగా ఫలసాయం పొందుతున్నారు. కుటుంబ సమేతంగా పొలం పనులు చేస్తున్నారు. అయితే రుణం కోసం దరఖాస్తు చేయాలన్నా.. అత్యవసరమై అమ్ముకోవాలన్నా కుదరక ఇబ్బంది పడుతున్నారు. పేరుకు తమ భూములే అని చెప్పుకుంటున్నా పట్టాలు లేక దిగాలుగా ఉంటున్నారు.

no records  those lands పేరుకే వారి భూములు

పేరుకే వారి భూములు

రికార్డుల పరంగా కానరాని హక్కులు

దశాబ్దాలుగా వాటిలోనే సాగు

మూడుసార్లు సర్వే చేసినా భరోసా ఇవ్వలే

అధికారుల చుట్టూ కొర్లవలస రైతుల ప్రదక్షిణలు

ఆ భూముల్లో తాతలు, తండ్రుల నుంచి రైతులు సాగు చేసుకుంటున్నారు. దశాబ్దాలుగా ఫలసాయం పొందుతున్నారు. కుటుంబ సమేతంగా పొలం పనులు చేస్తున్నారు. అయితే రుణం కోసం దరఖాస్తు చేయాలన్నా.. అత్యవసరమై అమ్ముకోవాలన్నా కుదరక ఇబ్బంది పడుతున్నారు. పేరుకు తమ భూములే అని చెప్పుకుంటున్నా పట్టాలు లేక దిగాలుగా ఉంటున్నారు. అనేకసార్లు అధికారులకు విన్నపాలు ఇచ్చారు. కొర్లవలస ఇనాందారుల పరిస్థితి ఇది. వీరి సమస్యపై ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అప్పటి రికార్డుల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

రేగిడి, మార్చి 13(ఆంద్రజ్యోతి):

కొర్లవలస గ్రామంలో 825 ఎకరాల ఇనాం ఎస్టేట్‌, మరో 200 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూములు ఉండగా అవి 30 ఏళ్లుగా 600మంది రైతుల సాగులో ఉన్నాయి. తాతతండ్రుల నుంచి ఈ భూములనే సాగుచేస్తూ వారంతా జీవనం సాగిస్తున్నారు. ఇనాం ఎస్టేట్లు రద్దుయినా చాలా సంవత్సరాలు వీరికి ఆ భూములపై హక్కులు ఇవ్వలేదు. ఎట్టకేలకు 1979లో అప్పటి రెవెన్యు అధికారులు రైతులతో ఒప్పందం కుదుర్చుకుని పట్టాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈక్రమంలో 60 మందికి రైత్వారీ పట్టాలు ఇవ్వగా కొందరు రైతులు కోర్టుకు వెళ్లడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఆ తర్వాత రైతులకు అనుకూలంగా తీర్పులొచ్చినా పట్టాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు ముందుకు రావట్లేదు అనేది రైతుల వాదన.

మూడు సార్లు సర్వేలు చేసినా...

రైతులకు పట్టాలు ఇచ్చేందుకు 1979, 2010, 2023లో మూడు సార్లు రీసర్వేలు చేశారు. ప్రత్యేక సర్వే బృందాలు గ్రామంలో మకాం వేసి మరీ భూహక్కుదారులను తేల్చారు. దాదాపు 326 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరికి నోషనల్‌ ఖాతాలు కేటాయించారు. కొంతమందికి అడంగల్‌ వస్తున్నాయి. పట్టాలు మాత్రం జారీచేయలేదు. అయితే బ్యాంక్‌ రుణాలు, భూక్రయ విక్రయాలకు అడంగల్‌ చెల్లడం లేదు. దీంతో ఇనాం రైతులు పూర్తిహక్కులు కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా వీరి సమస్య పరిష్కారం కావడం లేదు. ఇనాం ఎస్టేట్‌లు రద్దయిన నేపథ్యంలో రైతులకు సెటెల్మింట్‌ చేసేందుకు 1979లో తొలిసారి సర్వే చేశారు. అప్పట్లో ఫైనల్‌ నోటిఫికేషన్‌ కూడా జారీచే శారు. ఆ నోటిఫికేషన్‌ ప్రతి(ఫైల్‌) ఎక్కడుందో వారికి తెలియడం లేదు. ఆ తర్వాత జిల్లాలు మారిపోవడం, కార్యాలయాలు మారిపోవడంతో గుర్తించడం కష్టమవుతోంది. నోటిఫికేషన్‌ ప్రతి కోసం రెవెన్యూ అఽధికారులు వెతుకులాటలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ ప్రతి ఎక్కడుందో...?

కొర్లవలస ఇనాందారుల పట్టాలకు సంబంధించిన ఫైల్‌ స్థానిక టీడీపీ నేతల ఒత్తిడిమేరకు కదులుతున్నట్లు సమాచారం. ఇటీవల రీసర్వేలో గుర్తించిన మిగితా ఇనాందారులకు పట్టాలు ఇచ్చేందుకు ఫైనల్‌ సర్వే నోటిఫికేషన్‌ ఇవ్వాలి. ఈపైల్‌ ముందుకు వెళ్లాలంటే అప్పటి సర్వే ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఉండాలి. లేదంటే మళ్లీ భూసర్వే తప్పనిసరి అని రెవెన్యూ వర్గాలమాట. అప్పటి నోటిఫికేషన్‌ ప్రతి స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం, చీపురుపల్లి ఆర్డీవో కార్యాలయంలో లేనిట్లు సమాచారం. దీంతో రెవెన్యూ యంత్రాంగం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తుంది.

కలెక్టర్‌ హామీ అమలు కాలేదు

గేదల సత్తిబాబు రైతు, కొర్లవలస

కొర్లవలసలో ఇనాం భూములు ఎన్నో ఏళ్లుగా రైతుల సాగులో ఉన్నాయి. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టాలు జారీ కావడంలేదు. 2010లో అప్పటి కలెక్టర్‌ శ్రీకాంత్‌ మాగ్రామం వచ్చి పట్టాలు ఇస్తామన్నారు. కానీ ఆ హామీ నెరవేర్చలేదు.

సర్వే ఫైనల్‌ రిపోర్టు కీలకం

ఐ.కృష్ణలత, తహసీల్దార్‌

కొర్లవలస ఇనాం రైతుల సమస్య ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది. రైతులతో అప్పట్లో జరిగిన సెటిల్మెంట్‌కు సంబంధించిన సర్వే ఫైనల్‌ రిపోర్టు కీలకం. అప్పట్లో సర్వే పూర్తియినట్లు ఫైనల్‌ 13 నోటిఫికేషన్‌ ప్రతి ప్రస్తుతం ఉన్న రికార్డుల్లో అందుబాటులో లేదు. ఆర్డీవో ఆదేశాల మేరకు శ్రీకాకుళం సర్వేలాండ్‌ విభాగం ఏడీకి కూడా నివేదించాం. ఫైనల్‌ నోటిఫికేషన్‌ ప్రతి ఉంటే పంపించాలని కోరాం.ఆ ప్రతి ఉంటే కాని పట్టాలు జారీకావు. దీనిపై కలెక్టర్‌, జేసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Updated Date - Mar 14 , 2026 | 12:29 AM